త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vijayasai Reddy | విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ‘పరివర్తన రాజనీతి పార్టీ’.. 2029 ఎన్నిక‌ల్లో పోటీకి సై

Vijayasai Reddy | ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తన నూతన రాజకీయ పార్టీ పేరును ‘పరివర్తన రాజనీతి పార్టీ’గా ప్రకటించారు. ‘కొత్త తరం.. కొత్త పార్టీ’ నినాదంతో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆయన సిద్ధమయ్యారు.

S

National | Published On Nov 11, 2026, 1.45 pm IST

Vijayasai Reddy | విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ‘పరివర్తన రాజనీతి పార్టీ’.. 2029 ఎన్నిక‌ల్లో పోటీకి సై
Advertisement

2029 ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేస్తాం
యువతకు 66 శాతం సీట్లు కేటాయిస్తాం
కుల, మతాలకు అతీతంగా రాజకీయాలు
మా పార్టీ ఎవరికీ బీ టీమ్ కాదు
క్లీన్ పాలిటిక్స్ కోరుకునేవారికి ఆహ్వానం
చంద్రబాబు, జగన్‌లలో నాయకత్వ లక్షణాలు లేవు
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వెల్ల‌డి

Vijayasai Reddy | త్రినేత్ర న్యూస్ : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తన నూతన రాజకీయ పార్టీ పేరును ‘పరివర్తన రాజనీతి పార్టీ’గా ప్రకటించారు. ‘కొత్త తరం.. కొత్త పార్టీ’ నినాదంతో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆయన సిద్ధమయ్యారు.

2029 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ తమ పార్టీ పోటీ చేస్తుందని ఆయ‌న‌ ప్రకటించారు. తమ పార్టీ ఎవరికీ బీ టీమ్ కాదని, స్వతంత్ర రాజకీయ విధానాలతో ప్రజల ముందుకు వస్తామని స్పష్టం చేశారు. తాను ఎప్పుడూ ఎవరి వద్దా పదవుల కోసం అడగలేదని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీకి 151 స్థానాలు కట్టబెట్టిన ప్రజలే 2024లో 11 స్థానాలకు ఎందుకు పరిమితం చేశారో ఆ పార్టీ నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. నాయకులకు, ప్రజలకు మధ్య గోడలు నిర్మించుకుంటే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని వ్యాఖ్యానించారు.

చంద్రబాబు, జగన్‌లలో నాయకత్వ లక్షణాలు లేవని, 2029లో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు తనను జగన్ వదిలిన బాణంగా అభివర్ణిస్తుంటే, వైసీపీ నేతలు చంద్రబాబు కోసమే పార్టీ పెట్టానని ఆరోపిస్తున్నారని అన్నారు. ఈ విమర్శలను ఖండిస్తూ పరివర్తన రాజనీతి పార్టీ ఎవరికీ అనుబంధ పార్టీ కాదని స్పష్టం చేశారు. తమ పార్టీలో కుల, మతాలకు అతీతంగా యువతకు 66 శాతం సీట్లు కేటాయిస్తామని ప్రకటించారు. క్లీన్ పాలిటిక్స్ చేయాలనుకునే వారు ఏ పార్టీ నుంచి వచ్చినా తమ పార్టీ తలుపులు తెరిచే ఉంటాయని తెలిపారు.

విజ‌య‌సాయి రెడ్డి నేప‌థ్యం..

విజయసాయిరెడ్డి... 1957 జూలై 1న నెల్లూరు జిల్లా తాళ్లపూడి గ్రామంలో జన్మించాడు. ఆయన పూర్తి పేరు వేణుంబిక విజయసాయిరెడ్డి. ఆయన చార్టెడ్ అకౌంట్ పూర్తి చేసి.. చెన్నై ,హైదరాబాద్, బెంగళూరులో సొంతంగా చార్టెడ్ అకౌంట్ కి సంబంధించిన ఆఫీసులు ప్రారంభించారు. ఎన్నో కంపెనీలకు ఆడిటింగ్ చూసేవారు. సాయి రెడ్డి సునంద రెడ్డిని వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు. సునంద రెడ్డి సొంత అక్క కూతురే తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి.

వైఎస్సార్ కుటుంబ వ్యాపార లావాదేవీలు విజ‌యసాయిరెడ్డినే చూసుకునేవారు. 2006లో సాయి రెడ్డిని టిటిడి మండల సభ్యుడిగా నియమించారు. ఇలా ఆయన 2006 నుంచి 2010 వరకు టీటీడీ బోర్డు సభ్యుడిగా కొనసాగారు. 2006 డిసెంబర్ నుంచి 2009 డిసెంబర్ వరకు ఓరియంటల్ బ్యాంక్ కామర్స్‌కి డైరెక్టర్‌గా కొనసాగారు. 2006లో జ‌గ‌తి ప‌బ్లికేష‌న్ లిమిటెడ్‌కి చైర్మ‌న్‌గా నియామ‌కం అయ్యారు. 2007లో ఆయ‌న రాజీనామాతో జ‌గ‌న్‌కు చైర్మ‌న్ బాధ్య‌త‌లు అప్ప‌జెప్పారు.

2011 మార్చిలో వైఎస్సార్‌సీపీ ఏర్పాటు అయ్యాక జ‌గ‌న్ స‌మ‌క్షంలో విజ‌యసాయిరెడ్డి ఆ పార్టీలో చేరారు. ఆ పార్టీ సెక్ర‌ట‌రీగా సేవ‌లందించారు. 2016లో వైఎస్సార్‌సీపీ నుంచి రాజ్య‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. 2025 జ‌న‌వ‌రి 24న రాజ‌కీయాల‌కు గుడ్‌బై చెప్పారు. మొత్తానికి 2026 న‌వంబ‌ర్ నెల‌లో కొత్త పార్టీని ప్ర‌క‌టించారు.

Advertisement
Advertisement