త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nvidia | ఎన్విడియా సీఈఓ రేసులో ముగ్గురు భారతీయులు.. ఎవరెవరంటే?

Nvidia | ప్రపంచ ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఎన్విడియా తదుపరి సీఈఓ ఎంపికపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. జెన్సన్ హువాంగ్ వైదొలగిన‌ నేపథ్యంలో భారత సంతతికి చెందిన నికేష్ అరోరా, థామస్ కురియన్, జే పురి పేర్లు తెరపైకి వచ్చాయి. అంతర్గత, బాహ్య అభ్యర్థులను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

S

Business | Published On Nov 14, 2026, 2.32 pm IST

Nvidia | ఎన్విడియా సీఈఓ రేసులో ముగ్గురు భారతీయులు.. ఎవరెవరంటే?
Advertisement

Nvidia | ప్రపంచ ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఎన్విడియా తదుపరి సీఈఓ ఎంపికపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. జెన్సన్ హువాంగ్ వైదొలగిన‌ నేపథ్యంలో భారత సంతతికి చెందిన నికేష్ అరోరా, థామస్ కురియన్, జే పురి పేర్లు తెరపైకి వచ్చాయి. అంతర్గత, బాహ్య అభ్యర్థులను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

త‌దుప‌రి నాయ‌క‌త్వంపై ఉత్కంఠ‌..

ప్రపంచ టెక్నాలజీ రంగంలో కీలక సంస్థ అయిన ఎన్విడియా తదుపరి నాయకత్వంపై ఉత్కంఠ నెలకొంది. వివాహేతర సంబంధాలకు సంబంధించిన ఆరోపణలు వెలుగులోకి రావడంతో ప్రస్తుత సీఈఓ జెన్సన్ హువాంగ్ పదవి నుంచి వైదొలగిన విష‌యం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కొలెట్ క్రెస్ తాత్కాలిక బాధ్యతలు చేపట్టారు. పూర్తిస్థాయి సీఈఓ నియామకం కోసం సంస్థ అన్వేషణ కొనసాగిస్తోంది. ఎన్విడియా అధికారికంగా అభ్యర్థుల పేర్లను ప్రకటించనప్పటికీ, యాక్సియోస్ కథనం ప్రకారం పలువురు భారత సంతతి టెక్ దిగ్గజాల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో పాలో ఆల్టో నెట్‌వర్క్స్ సీఈఓ నికేష్ అరోరా, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

నికేష్ అరోరా, జే పురి..

భారత సంతతికి చెందిన నికేష్ అరోరా ప్రస్తుతం సైబర్ సెక్యూరిటీ సంస్థ పాలో ఆల్టో నెట్‌వర్క్స్‌కు సీఈఓగా వ్యవహరిస్తున్నారు. గతంలో గూగుల్, టీ-మొబైల్ వంటి ప్రముఖ టెక్నాలజీ సంస్థల్లో పనిచేశారు. సాఫ్ట్‌బ్యాంక్‌లో ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఉబర్ బోర్డులో సభ్యుడిగా, స్విట్జర్లాండ్‌కు చెందిన లగ్జరీ వస్తువుల సంస్థ కాంపాగ్నీ ఫైనాన్సియర్ రిచ్‌మాంట్‌లో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. మరోవైపు ఎన్విడియాలో రెండు దశాబ్దాలకు పైగా పనిచేసిన జే పురి పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు ఫార్చ్యూన్ ఇండియా కథనం వెల్లడించింది. 2006లో ఎన్విడియాలో చేరిన ఆయన, ఈ ఏడాది ఆగస్టులో ఎగ్జిక్యూటివ్ బాధ్యతల నుంచి తప్పుకుని సలహాదారుడి పాత్రకు మారారు. అంతకుముందు సన్ మైక్రోసిస్టమ్స్‌లో 22 ఏళ్లపాటు పనిచేశారు. హ్యూలెట్ ప్యాకర్డ్, బూజ్ అలెన్ హామిల్టన్, టెక్సాస్ ఇన్‌స్ట్రుమెంట్స్ సంస్థల్లోనూ అనుభవం సంపాదించారు.

థామ‌స్ కురియ‌న్‌..

గూగుల్ క్లౌడ్ అధిపతి థామస్ కురియన్ పేరు కూడా సీఈఓ రేసులో వినిపిస్తోంది. 2018లో గూగుల్‌లో చేరడానికి ముందు ఒరాకిల్‌లో 22 ఏళ్లపాటు పనిచేశారు. మెకిన్సే సంస్థలో బిజినెస్ అనలిస్ట్, ఎంగేజ్‌మెంట్ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఇంజినీరింగ్, ఎంటర్‌ప్రైజ్ సంబంధాలు, భారీ సంస్థల నిర్వహణలో ఆయనకు దాదాపు మూడు దశాబ్దాల అనుభవం ఉంది. మరోవైపు ఎన్విడియా అంతర్గత, బాహ్య అభ్యర్థులను పరిశీలిస్తున్నట్లు ఫైనాన్షియల్ టైమ్స్ పేర్కొంది. ది ఎన్విడియా వే పుస్తక రచయిత టే కిమ్ మాత్రం ఆర్మ్ సీఈఓ రెనే హాస్, ఎన్విడియా డేటా సెంటర్ విభాగాధిపతి ఇయాన్ బక్‌లలో ఒకరికి అవకాశం ఉంటుంద‌ని అభిప్రాయపడ్డారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాజీ యాపిల్ సీఈఓ టిమ్ కుక్ పేరును కూడా ప్రతిపాదించారు. ఏఎండీ సీఈఓ లిసా సు, జెన్సన్ హువాంగ్ కుమార్తె మాడిసన్ పేర్లు సైతం పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం తాత్కాలిక బాధ్యతలు నిర్వహిస్తున్న కొలెట్ క్రెస్‌కే పూర్తిస్థాయి సీఈఓ బాధ్యతలు అప్పగించే అవకాశాలపైనా చర్చ జరుగుతోంది. అయితే తదుపరి సీఈఓ ఎవరనే విషయంపై ఎన్విడియా నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Advertisement
Advertisement