త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Freelancers | ఫ్రీలాన్సర్లకు కీలక సమాచారం.. ఏ ఐటీఆర్ ఫామ్‌ను దాఖలు చేయాలి..?

Freelancers | భారత్‌లో ఫ్రీలాన్సింగ్ ప్ర‌స్తుతం ప్రధాన ఆదాయ వనరుగా మారుతోంది. కంటెంట్ రైటర్లు, గ్రాఫిక్ డిజైనర్లు, సాఫ్ట్‌వేర్ డెవలపర్లు, కన్సల్టెంట్లు, డిజిటల్ మార్కెటర్లు, ఆర్కిటెక్ట్‌లు, ఇంజినీర్లు, ఇతర స్వతంత్ర నిపుణులు ప్రాజెక్ట్ ఆధారంగా పనిచేస్తూ ఆదాయం పొందుతున్నారు.

S

Business | Published On Jun 20, 2026, 1.54 pm IST

Freelancers | ఫ్రీలాన్సర్లకు కీలక సమాచారం.. ఏ ఐటీఆర్ ఫామ్‌ను దాఖలు చేయాలి..?
Advertisement

Freelancers | భారత్‌లో ఫ్రీలాన్సింగ్ ప్ర‌స్తుతం ప్రధాన ఆదాయ వనరుగా మారుతోంది. కంటెంట్ రైటర్లు, గ్రాఫిక్ డిజైనర్లు, సాఫ్ట్‌వేర్ డెవలపర్లు, కన్సల్టెంట్లు, డిజిటల్ మార్కెటర్లు, ఆర్కిటెక్ట్‌లు, ఇంజినీర్లు, ఇతర స్వతంత్ర నిపుణులు ప్రాజెక్ట్ ఆధారంగా పనిచేస్తూ ఆదాయం పొందుతున్నారు. అయితే ఆదాయపు పన్ను రిటర్నులు (ఐటీఆర్) దాఖలు చేసే సమయంలో చాలా మంది ఫ్రీలాన్సర్లు ఏ ఫామ్‌ను ఉపయోగించాలో తెలియక గందరగోళానికి గురవుతున్నారు. పన్ను నిపుణులు తెలిపిన ప్రకారం అసెస్‌మెంట్ ఇయర్ 2026-27 (ఫైనాన్షియల్ ఇయర్ 2025-26కు సంబంధించింది) కోసం ఫ్రీలాన్సర్లు సాధారణంగా ఐటీఆర్-3 లేదా ఐటీఆర్-4 ఫామ్‌లను దాఖలు చేయాలి. ఇది వారి ఆదాయ నిర్మాణం, ఎంచుకున్న పన్ను విధానంపై ఆధారపడి ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టంలో ఫ్రీలాన్సర్ లేదా గిగ్ వర్కర్ అనే పదాలకు ప్రత్యేక చట్టబద్ధ నిర్వచనం లేకపోయినా, వారి ఆదాయాన్ని వ్యాపారం లేదా వృత్తి ఆదాయంగా పరిగణిస్తారు. పని స్వభావాన్ని బట్టి ఈ వర్గీకరణ జరుగుతుంది.

ఐటీఆర్-3 లేదా ఐటీఆర్‌-4ను ఉప‌యోగించాలి..

చార్టర్డ్ అకౌంటెంట్ సురేష్ సురానా తెలిపిన వివరాల ప్రకారం ఫ్రీలాన్సర్లు తమ ఆదాయం, ఎంపిక చేసిన పన్ను విధానాన్ని బట్టి ఐటీఆర్-3 లేదా ఐటీఆర్-4 ఫామ్‌ల‌ను దాఖలు చేయ‌వ‌చ్చే. సెక్షన్ 44ఏడీఏ కింద ప్రిజంప్టివ్ టాక్సేషన్ స్కీమ్‌ను ఎంచుకునే వారికి సాధారణంగా ఐటీఆర్-4 (సుగమ్) వర్తిస్తుంది. నగదు లావాదేవీలు మొత్తం రశీదుల్లో 5 శాతం కంటే తక్కువగా ఉంటే, ఈ పథకంలో గరిష్టంగా రూ.3 కోట్ల వరకు గ్రాస్ రిసీట్స్ ఉన్నవారు ప్రయోజనం పొందవచ్చు. ఈ పద్ధతిలో ఆదాయంలో 50 శాతాన్ని లాభంగా పరిగణిస్తారు. ఫ్రీలాన్సర్లకు ఏ ఐటీఆర్ ఫామ్ వ‌ర్తిస్తుందనే విష‌యం వారు సెక్షన్ 44ఏడీఏ కింద ప్రిజంప్టివ్ టాక్సేషన్‌ను ఎంచుకుంటారా లేదా సాధారణ ఖాతా పుస్తకాలను నిర్వహిస్తారా అన్న అంశంపై ఆధారపడి ఉంటుంది. సెక్షన్ 44ఏడీఏ కింద ప్రిజంప్టివ్ టాక్సేషన్‌ను ఎంచుకునే ఫ్రీలాన్సర్ల కోసం ఐటీఆర్-4 (సుగమ్) అందుబాటులో ఉంటుంది. నివాస భారతీయ వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్‌యూఎఫ్‌లు), భాగస్వామ్య సంస్థలు (ఎల్‌ఎల్‌పీలను మినహాయించి) ఈ ఫామ్‌ను దాఖలు చేయవచ్చు.

50 శాతం ఆదాయంపై ప‌న్ను..

అర్హత కలిగిన నిపుణులు తమ మొత్తం రశీదుల్లో 50 శాతాన్ని పన్ను విధించదగిన ఆదాయంగా ప్రకటించవచ్చు. ఇందుకోసం పూర్తి స్థాయి ఖాతా పుస్తకాలు నిర్వహించాల్సిన అవసరం ఉండదు. అలాగే సాధారణంగా ఖాతాల ఆడిట్ కూడా అవసరం ఉండదు. ఈ పథకం న్యాయవాదులు, వైద్యులు, ఇంజినీర్లు, ఆర్కిటెక్ట్‌లు, అకౌంటెంట్లు, టెక్నికల్ కన్సల్టెంట్లు, ఇంటీరియర్ డెకరేటర్లు, ప్రభుత్వం గుర్తించిన ఇతర నిపుణులకు వర్తిస్తుంది. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు సెక్షన్ 44ఏడీఏ కింద గ్రాస్ రిసీట్స్ పరిమితిని రూ.50 లక్షల వ‌ర‌కు ఇచ్చారు. అయితే నగదు రశీదులు మొత్తం రశీదుల్లో 5 శాతానికి మించకపోతే ఈ పరిమితి రూ.75 లక్షలకు పెరుగుతుంది. ఉదాహరణకు ఒక ఫ్రీలాన్స్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ రూ.60 లక్షల ఆదాయాన్ని పూర్తిగా బ్యాంక్ ట్రాన్స్‌ఫర్లు లేదా యూపీఐ ద్వారా పొందితే, నగదు రశీదులు 5 శాతం కంటే తక్కువగా ఉంటే అతను లేదా ఆమె సెక్షన్ 44ఏడీఏ కింద ఐటీఆర్-4 దాఖలు చేయడానికి అర్హులు అవుతారు.

ఐటీఆర్‌-3 ఎవరికి..?

అయితే ఫ్రీలాన్సర్లు ప్రిజంప్టివ్ టాక్సేషన్ పథకాన్ని ఎంచుకోకపోతే లేదా దానికి అర్హులు కాకపోతే ఐటీఆర్-3 దాఖలు చేయాల్సి ఉంటుంది. వ్యాపారం లేదా వృత్తి ద్వారా ఆదాయం పొందే వ్యక్తులు, హెచ్‌యూఎఫ్‌లు తమ వాస్తవ లాభాలు, ఖర్చులను చూపిస్తూ ఈ ఫామ్‌ను ఉపయోగించాలి. ఖాతా పుస్తకాలను నిర్వహిస్తున్నట్లయితే, వాస్తవ వ్యాపార ఖర్చులను క్లెయిమ్ చేయాలనుకుంటే, సెక్షన్ 44ఏడీఏ అర్హత పరిమితులను మించిన ఆదాయం ఉంటే, ప్రిజంప్టివ్ రేటు కంటే తక్కువ లాభాలను ప్రకటించి రికార్డులు నిర్వహించాల్సి వచ్చినా, లేదా ఐటీఆర్-4కు అనర్హత కలిగించే అదనపు వ్యాపార ఆదాయం ఉన్నా ఐటీఆర్-3 దాఖలు చేయాల్సి ఉంటుంది. సెక్షన్ 44ఏడీఏ పద్ధతి ఫ్రీలాన్సర్లకు పన్ను ప్రక్రియను చాలా సులభతరం చేస్తుంది. ఉదాహరణకు ఒక ఫ్రీలాన్స్ కంటెంట్ కన్సల్టెంట్ 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.20 లక్షల గ్రాస్ ప్రొఫెషనల్ రిసీట్స్ సంపాదించినట్లయితే, అందులో 50 శాతం అంటే రూ.10 లక్షలను పన్ను విధించదగిన ఆదాయంగా పరిగణిస్తారు. మిగిలిన 50 శాతాన్ని వృత్తిపరమైన ఖర్చులుగా భావిస్తారు. దీంతో ప్రతి ఖర్చుకు సంబంధించిన పూర్తి రికార్డుల‌ను నిర్వహించాల్సిన అవసరం ఉండదు.

ఏయే ప‌త్రాల‌ను సిద్ధంగా ఉంచాలి..

అసెస్‌మెంట్ ఇయర్ 2026-27 కోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) ఇప్పటికే ఐటీఆర్ ఫామ్‌లను నోటిఫై చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రిటర్నులు దాఖలు చేసే సమయంలో పన్ను చెల్లింపుదారులు తగిన ఫామ్‌ను ఉపయోగించాలి. ఈసారి కొన్ని ముఖ్యమైన మార్పులు కూడా చోటుచేసుకున్నాయి. ఐటీఆర్-4లో ప్ర‌స్తుతం రెండు ఇళ్ల వరకు వచ్చే ఆదాయాన్ని నివేదించే అవకాశం కల్పించారు. అలాగే కొన్ని సందర్భాల్లో వ్యాపార, వృత్తి పన్ను చెల్లింపుదారుల కోసం కొత్త రిపోర్టింగ్ ఫీల్డ్‌లను కూడా చేర్చారు. రిటర్న్ దాఖలు చేయడానికి ముందు ఫ్రీలాన్సర్లు పాన్, ఆధార్, ఫామ్‌ 26ఏఎస్, యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్ (ఏఐఎస్), ట్యాక్స్‌పేయర్ ఇన్ఫర్మేషన్ సమ్మరీ (టీఐఎస్), బ్యాంక్ స్టేట్‌మెంట్లు, క్లయింట్లకు జారీ చేసిన ఇన్‌వాయిస్‌లు, టీడీఎస్ సర్టిఫికెట్లు (ఫామ్‌ 16ఏ), అడ్వాన్స్ టాక్స్ చెల్లింపు వివరాలు, అలాగే పాత పన్ను విధానంలో మినహాయింపులు క్లెయిమ్ చేస్తే సంబంధిత పెట్టుబడి, డిడక్షన్ ఆధారాలను సిద్ధంగా ఉంచుకోవాలి. ఖాతాల ఆడిట్ అవసరం లేని వ్యక్తులు, నిపుణుల కోసం అసెస్‌మెంట్ ఇయర్ 2026-27కు ఐటీఆర్ దాఖలు చేసే చివరి తేదీని జూలై 31గా నిర్ణయించారు. ఆడిట్‌కు లోబడే పన్ను చెల్లింపుదారులకు ఆదాయపు పన్ను చట్టం ప్రకారం వేరే గడువు తేదీలు వర్తిస్తాయి.

Advertisement
Advertisement