త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ITR 3 | ఐటీఆర్-3 ఫైలింగ్ ప్రారంభం.. వ్యాపారులు, ప్రొఫెషనల్స్‌కు కీలక అప్‌డేట్‌..

ITR 3 | ఆదాయపు పన్ను శాఖ అసెస్‌మెంట్ ఇయర్ (ఏవై) 2026-27 కోసం ఐటీఆర్-3 ఆన్‌లైన్ ఫైలింగ్ సౌకర్యం, ఎక్సెల్ యుటిలిటీని అధికారికంగా ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. వ్యాపారం లేదా వృత్తి ద్వారా లాభాలు, ఆదాయం పొందే వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్‌యూఎఫ్‌లు) ఐటీఆర్-3 ని దాఖలు చేయాల్సి ఉంటుంది.

S

Business | Published On Jun 19, 2026, 5.46 pm IST

ITR 3 | ఐటీఆర్-3 ఫైలింగ్ ప్రారంభం.. వ్యాపారులు, ప్రొఫెషనల్స్‌కు కీలక అప్‌డేట్‌..
Advertisement

ITR 3 | ఆదాయపు పన్ను శాఖ అసెస్‌మెంట్ ఇయర్ (ఏవై) 2026-27 కోసం ఐటీఆర్-3 ఆన్‌లైన్ ఫైలింగ్ సౌకర్యం, ఎక్సెల్ యుటిలిటీని అధికారికంగా ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. వ్యాపారం లేదా వృత్తి ద్వారా లాభాలు, ఆదాయం పొందే వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్‌యూఎఫ్‌లు) ఐటీఆర్-3 ని దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని ఆదాయపు పన్ను శాఖ సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో ప్రకటించింది. ఏవై 2026-27 కోసం ఐటీఆర్-3 ఆన్‌లైన్ ఫైలింగ్, ఎక్సెల్ యుటిలిటీ ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో అందుబాటులో ఉంద‌ని వెల్లడించింది. ఐటీఆర్-3 యుటిలిటీ విడుదలతో ఏవై 2026-27కి సంబంధించిన ప్రధాన ఆదాయపు పన్ను రిటర్న్ ఫైలింగ్ టూల్స్ విడుదల ప్రక్రియ పూర్తయింది. అంతకుముందు మే 15న ఐటీఆర్-1, ఐటీఆర్-4 ఎక్సెల్ యుటిలిటీలను ప్రవేశపెట్టగా, మే 27న ఐటీఆర్-2 యుటిలిటీని అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఐటీఆర్‌-3 ఫామ్ ఎవ‌రికి..?

ఐటీఆర్-3 ఫామ్ ను ప్రధానంగా వ్యాపార కార్యకలాపాలు లేదా వృత్తిపరమైన సేవల ద్వారా ఆదాయం పొందే వ్యక్తులు, హెచ్‌యూఎఫ్‌ల కోసం రూపొందించారు. ఆడిట్ అవసరమయ్యే, అవసరం లేని రెండువర్గాల పన్ను చెల్లింపుదారులు ఈ ఫామ్‌ను ఉపయోగించవచ్చు. జీతం, పెన్షన్, అద్దె ఆదాయం, మూలధన లాభాలు, ఇతర వనరుల నుంచి వచ్చే ఆదాయాలను కూడా ఇందులో ప్రకటించే అవకాశం ఉంటుంది. భాగస్వామ్య సంస్థల నుంచి పొందే పారితోషికం, వడ్డీ వంటి ఆదాయాలు వ్యాపార లేదా వృత్తి లాభాలు పన్ను విధింపుకు లోబడితే అవి కూడా ఐటీఆర్-3 పరిధిలోకి వస్తాయి. అయితే వ్యాపారం లేదా వృత్తి ఆదాయాన్ని ప్రకటించే పన్ను చెల్లింపుదారులు మాత్రమే ఐటీఆర్-3 ని ఉపయోగించాలి. అలాంటి ఆదాయం లేని వ్యక్తులు, హెచ్‌యూఎఫ్‌లు ఈ రిటర్న్‌ను దాఖలు చేయకూడదు.

గ‌డువు తేదీలు ఇవే..

ఐటీఆర్-3 దాఖలుకు గడువు తేదీలు ఆడిట్ అవసరాన్ని బట్టి మారుతాయి. ఆడిట్ అవసరం లేని వ్యక్తులు, సంస్థలు ఆగస్టు 31లోపు రిటర్న్ దాఖలు చేయాలి. ఆడిట్‌కు లోబడే కేసులకు అక్టోబర్ 31 వరకు గడువు ఉంటుంది. సవరించిన ఫైలింగ్ విధానంలో మూలధన లాభాల నివేదికను మరింత సులభతరం చేశారు. 2024 జూలై 23కు ముందు, తర్వాత జరిగిన లావాదేవీలను వేర్వేరుగా చూపాల్సిన అవసరాన్ని తొలగించారు. అదే సమయంలో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్‌అండ్‌ఓ) ట్రేడర్ల కోసం ప్రత్యేక రిపోర్టింగ్ షెడ్యూల్‌ను ప్రవేశపెట్టారు. సెక్షన్ 80జీ, 80యూ కింద మినహాయింపులు క్లెయిమ్ చేసే పన్ను చెల్లింపుదారులు ఇకపై మరింత వివరమైన సమాచారాన్ని సమర్పించాల్సి ఉంటుంది. అలాగే సెక్షన్ 44బీబీడీ కింద ట్యాక్స్ ఆడిట్ వివరాలను నమోదు చేయడానికి కొత్త ఫీల్డ్‌ను కూడా ఫామ్‌లో చేర్చారు. రిటర్న్ దాఖలు చేసే ముందు ఆదాయానికి సంబంధించిన రికార్డులు, అవసరమైన పత్రాలను జాగ్రత్తగా పరిశీలించడం ద్వారా అనవసర విచారణలు, రిఫండ్ జాప్యాలు, నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించిన సమస్యలను నివారించవచ్చు. నిర్ణీత గడువులోపు రిటర్న్ దాఖలు చేయడం కూడా అత్యంత ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement
Advertisement