త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

UPI Credit Line | యూపీఐ క్రెడిట్ లైన్ అంటే ఏమిటి..? అస‌లు ఇది ఎలా ప‌నిచేస్తుంది..?

UPI Credit Line | ఇప్పటివరకు యూపీఐ అంటే నేరుగా బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బుతో చెల్లింపులు చేయడమే. కానీ ఇప్పుడు ఆ విధానం మారుతోంది. యూపీఐలో క్రెడిట్ లైన్ అనే కొత్త సౌకర్యంతో, బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోయినా క్రెడిట్ ద్వారా చెల్లింపులు చేసే అవకాశం అందుబాటులోకి వచ్చింది. కార్డు అవసరం లేదు.

S

Business | Published On Jan 27, 2026, 9.26 am IST

UPI Credit Line | యూపీఐ క్రెడిట్ లైన్ అంటే ఏమిటి..? అస‌లు ఇది ఎలా ప‌నిచేస్తుంది..?
Advertisement

UPI Credit Line | ఇప్పటివరకు యూపీఐ అంటే నేరుగా బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బుతో చెల్లింపులు చేయడమే. కానీ ఇప్పుడు ఆ విధానం మారుతోంది. యూపీఐలో క్రెడిట్ లైన్ అనే కొత్త సౌకర్యంతో, బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోయినా క్రెడిట్ ద్వారా చెల్లింపులు చేసే అవకాశం అందుబాటులోకి వచ్చింది. కార్డు అవసరం లేదు. కొత్త యాప్ అవసరం లేదు. మీ యూపీఐ ఐడీకే క్రెడిట్ లైన్ లింక్ అవుతుంది. మీ బ్యాంక్ ఈ సౌకర్యాన్ని ఆమోదిస్తే, అదే యూపీఐ యాప్‌లో మరో ఆప్షన్‌గా క్రెడిట్ లైన్ కనిపిస్తుంది. మీరు చెల్లింపు చేసే సమయంలో, డబ్బు సేవింగ్స్ అకౌంట్ నుంచి వెళ్లాలా లేదా క్రెడిట్ లైన్ నుంచి వెళ్లాలా అనేది మీరే ఎంచుకోవచ్చు. మిగతా ప్రక్రియ అంతా మామూలు యూపీఐ పేమెంట్‌లాగే ఉంటుంది. ఈ మార్పు సాధ్యమయ్యేలా బ్యాంకులకు ముందుగానే అనుమతి ఇచ్చారు.

అనుమ‌తిచ్చిన రిజర్వ్ బ్యాంకు..

ప్రీ-అప్రూవ్డ్ క్రెడిట్ లైన్లను యూపీఐకి అనుసంధానించేందుకు రిజర్వ్ బ్యాంక్ మార్గం సుగమం చేసింది. దీంతో యూపీఐ కేవలం చెల్లింపుల సాధనం మాత్రమే కాకుండా, చిన్న మొత్తాల్లో అప్పు తీసుకునే వేదికగానూ మారింది. వినియోగంలో చూస్తే పెద్దగా తేడా ఏమీ అనిపించదు. మీరు షాప్‌లో క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తారు. అమౌంట్ ఎంటర్ చేస్తారు. చెల్లింపుకు సేవింగ్స్ అకౌంట్ బదులు క్రెడిట్ లైన్ ఎంచుకుంటారు. అంతే.. దుకాణదారుడికి వెంటనే డబ్బు చేరుతుంది. సాధారణ యూపీఐ ట్రాన్సాక్షన్ లాగే. తర్వాత మీరు ఆ మొత్తాన్ని బ్యాంక్‌కు తిరిగి చెల్లించాలి. రీపేమెంట్ విధానం బ్యాంక్‌ను బట్టి మారుతుంది. కొన్ని బ్యాంకులు త‌క్కువ‌ ఇంట్రెస్ట్-ఫ్రీ పీరియడ్ ఇస్తాయి. కొన్ని బ్యాంకులు వెంటనే వడ్డీ వేస్తాయి. ఎక్కువగా నెలవారిగా చెల్లించేలా, చిన్న లోన్ తరహాలో ఈ క్రెడిట్ లైన్ పనిచేస్తుంది.

క్రెడిట్ కార్డుల‌తో పోలిస్తే..

క్రెడిట్ కార్డులతో పోలిస్తే ఇక్కడ పెద్ద తేడా ఎక్కడ కనిపిస్తుందంటే - అంగీకారం (acceptance) విషయంలో. క్రెడిట్ కార్డులు ఇప్పటికీ అన్ని చోట్ల పని చేయవు. కానీ యూపీఐ మాత్రం దాదాపు ప్రతిచోటా పనిచేస్తుంది. కిరాణా షాపులు, చిన్న వ్యాపారులు, లోకల్ క్లినిక్‌లు, సర్వీస్ సెంటర్లు - కార్డు మెషిన్ పెట్టుకోని చోట్ల కూడా యూపీఐ ఉంటుంది. ఇంకో లాభం ఏమిటంటే, వేరే ఏదీ నిర్వహించాల్సిన అవసరం లేదు. కార్డు నంబర్ గుర్తుంచుకోవాల్సిన పని లేదు. ఎక్స్‌పైరీ డేట్ టెన్షన్ లేదు. ఏ కార్డు వాడామో అనే గందరగోళం లేదు. రోజూ మీరు వాడే యూపీఐ యాప్‌లోనే అన్నీ ఉంటాయి. అలాగే, అప్పు తీసుకుంటున్నామన్న భావన కూడా ఇక్కడ స్పష్టంగా ఉంటుంది. క్రెడిట్ కార్డుల్లో చాలామంది తెలియకుండానే ఖర్చు చేస్తారు, తర్వాత మినిమమ్ డ్యూ మాత్రమే కడుతూ అప్పును పెంచుకుంటారు. కానీ యూపీఐ క్రెడిట్ లైన్‌లో మీరు ప్రత్యేకంగా క్రెడిట్ ఎంపిక చేసుకుంటారు. ఇది అప్పే అన్న అవగాహన ఉంటుంది. త్వరలో తిరిగి చెల్లించాల్సిందే అన్న స్పష్టత కూడా ఉంటుంది.

క్రెడిట్ కార్డు అర్హ‌త లేకున్నా..

మరొక విషయం ఏమిటంటే, క్రెడిట్ కార్డ్‌కు అర్హత లేని వారికి కూడా బ్యాంకులు చిన్న మొత్తంలో యూపీఐ క్రెడిట్ లైన్ ఇచ్చే అవకాశముంది. ఖాతా లావాదేవీల చరిత్ర ఆధారంగా బ్యాంకులు ఈ పరిమితిని నిర్ణయిస్తాయి. అయితే క్రెడిట్ కార్డులకు ఇంకా కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి. రివార్డ్ పాయింట్లు, క్యాష్‌బ్యాక్, ఎయిర్‌పోర్ట్ లౌంజ్ యాక్సెస్, ఎక్కువ రోజులు వడ్డీ లేకుండా బిల్ చెల్లించే అవకాశం - ఇవన్నీ సరిగా ఉపయోగించుకుంటే కార్డులు ఇంకా ప్రయోజనకరంగానే ఉంటాయి. అయితే, యూపీఐలో క్రెడిట్ లైన్ అనేది క్రెడిట్ కార్డులకు ప్రత్యామ్నాయం కాదు. కానీ ఒక అవ‌కాశంగా అందుబాటులో ఉంది. చిన్న ఖర్చులు, రోజువారీ అవసరాలు, కార్డులు సరిగా పని చేయని చోట్ల - ఇలాంటి సందర్భాల్లో ఇది చాలా సులభంగా ఉంటుంది. ఇప్పటికే ప్రజలు నమ్ముతున్న, రోజూ వాడుతున్న యూపీఐ వ్యవస్థపైనే క్రెడిట్‌ను జోడించిన కొత్త దశగా దీనిని ఆర్థిక నిపుణులు అభివర్ణిస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement