త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ULIP | యులిప్‌లతో పెట్టుబడులా? బీమా ముసుగులో తగ్గుతున్న మీ లాభాలు!

ULIP | జీవిత బీమా, పెట్టుబడిని కలిపి అందించే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ (యులిప్స్) ఆకర్షణీయంగా కనిపించినప్పటికీ, వీటిలో ఉండే వివిధ ఛార్జీలు, బ్రోకర్ కమీషన్లు పెట్టుబడిదారుల రాబడులను తగ్గిస్తున్నాయి. మ్యూచువల్ ఫండ్లలో నేరుగా పెట్టుబడి పెట్టడంతో పోలిస్తే యులిప్స్ ద్వారా తక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

S

Business | Published On Nov 23, 2026, 4.47 pm IST

ULIP | యులిప్‌లతో పెట్టుబడులా? బీమా ముసుగులో తగ్గుతున్న మీ లాభాలు!
Advertisement

ULIP | జీవిత బీమా, పెట్టుబడిని కలిపి అందించే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ (యులిప్స్) ఆకర్షణీయంగా కనిపించినప్పటికీ, వీటిలో ఉండే వివిధ ఛార్జీలు, బ్రోకర్ కమీషన్లు పెట్టుబడిదారుల రాబడులను తగ్గిస్తున్నాయి. మ్యూచువల్ ఫండ్లలో నేరుగా పెట్టుబడి పెట్టడంతో పోలిస్తే యులిప్స్ ద్వారా తక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

యులిప్‌లో పెట్టుబ‌డులు ఎలా పెడ‌తారు..?

బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తరచూ సిఫార్సు చేసే యులిప్స్‌లో బీమా, పెట్టుబడి రెండూ ఒకే పథకంలో ఉంటాయి. ఇందులో పెట్టుబడిలో ఎక్కువ భాగం మ్యూచువల్ ఫండ్ల తరహాలో మార్కెట్ ఆధారిత ఫండ్లలోకి వెళ్తుండగా, కొంత మొత్తం జీవిత బీమా రక్షణకు కేటాయిస్తారు. అయితే జీవిత బీమా కోసం వసూలు చేసే ఛార్జీలు, ఇతర నిర్వహణ ఖర్చులు, బ్రోకర్ కమీషన్లు పెట్టుబడి మొత్తాన్ని తగ్గిస్తాయి. ఉదాహరణకు, ఎంచుకున్న ఫండ్ ఏడాదికి 12-13 శాతం రాబడి ఇచ్చినా, యులిప్‌లో అన్ని ఖర్చులు మినహాయించిన తర్వాత పెట్టుబడిదారుడికి 9-10 శాతం మాత్రమే దక్కే అవకాశం ఉంటుంది. ఏడాదికి రూ.50వేల‌ ప్రీమియం చెల్లించే యులిప్‌లో బీమా, ఇతర ఛార్జీల కింద రూ.3,500 మినహాయిస్తే, మిగిలిన మొత్తమే పెట్టుబడిగా వెళ్తుంది. ఉదాహరణలో వర్తించే ఛార్జీల తర్వాత రూ.37,500 పెట్టుబడిగా ఫండ్‌లో కేటాయించినట్లు చెప్ప‌వ‌చ్చు. ఈ మొత్తానికి సంబంధిత నికర ఆస్తి విలువ (ఎన్ఏవీ) ఆధారంగా యూనిట్లు కేటాయిస్తారు.

బీమా ప‌రిమిత కాలం మాత్ర‌మే..

సాధారణంగా యులిప్స్‌లో కనీసం ఐదేళ్లపాటు ప్రీమియం చెల్లించాల్సి ఉండగా, పాలసీ మెచ్యూరిటీ వ్యవధి సుమారు పదేళ్లుగా ఉంటుంది. ఏడాదికి రూ.37,500 చొప్పున ఐదేళ్లపాటు పెట్టుబడి పెడితే మొత్తం పెట్టుబడి రూ.1,87,500 అవుతుంది. 10 శాతం రాబడిని అంచనా వేస్తే, ఐదేళ్ల పెట్టుబడిపై సుమారు రూ.64వేల రాబడి వస్తుందని, మొత్తం విలువ రూ.2,51,835కు చేరుతుందని చెప్ప‌వ‌చ్చు. ఈ మొత్తాన్ని మరో ఐదేళ్లపాటు 10 శాతం వార్షిక వృద్ధితో కొనసాగిస్తే సుమారు రూ.4.05 లక్షలకు చేరుతుందని అంచనా. అయితే యులిప్‌లోని జీవిత బీమా రక్షణ పాలసీ మెచ్యూరిటీతో ముగుస్తుంది. అంటే పదేళ్ల తర్వాత ఆ బీమా కవరేజీ అందుబాటులో ఉండదు. కుటుంబ సభ్యులు ఆర్థికంగా స్వతంత్రంగా మారే వరకు లేదా తగిన పెట్టుబడి నిధి సమకూరే వరకు జీవిత బీమా అవసరమని, అందువల్ల పరిమిత కాలపు యులిప్ కవరేజీ ఒక లోపంగా మారుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ఆధారపడిన కుటుంబ సభ్యులు లేని వ్యక్తులు లేదా మైనర్ల విషయంలో ఈ బీమా ప్రయోజనం కూడా పరిమితంగానే ఉంటుంది.

ఎస్ఐపీ అయితే ఎంత మొత్తం వ‌స్తుంది..?

ఇదే మొత్తాన్ని బీమాతో సంబంధం లేకుండా నేరుగా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (ఎస్ఐపీ) ద్వారా పెట్టుబడి పెడితే మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఏడాదికి రూ.50వేల చొప్పున ఐదేళ్లపాటు పెట్టుబడి పెడితే మొత్తం రూ.2.50 లక్షలు అవుతుంది. 12 శాతం వార్షిక రాబడిని అంచనా వేస్తే, ఐదేళ్ల తర్వాత పెట్టుబడి విలువ రూ.3,55,759కు చేరుతుంది. అనంతరం మరో ఐదేళ్లపాటు అదే రాబడితో కొనసాగిస్తే సుమారు రూ.6,27,032 అవుతుంది. ఈ రెండు ఉదాహరణలను పోల్చినప్పుడు యులిప్‌తో పోలిస్తే నేరుగా పెట్టుబడి పెట్టడం ద్వారా సుమారు రూ.2.22 లక్షల వరకు అదనపు సంపద సమకూరే అవకాశం ఉంటుంది. అయితే ఇవి అంచనా రాబడుల ఆధారంగా రూపొందించిన లెక్కలు మాత్రమే. మార్కెట్ పనితీరు, ఫండ్ ఛార్జీలు, పన్నులు, పెట్టుబడి వ్యవధిని బట్టి వాస్తవ రాబడులు మారుతాయి. అందుకే జీవిత బీమా కోసం ప్రత్యేకంగా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుని, పెట్టుబడుల కోసం మ్యూచువల్ ఫండ్లను ఎంచుకోవడం ద్వారా ఖర్చులను నియంత్రించ‌వచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

Advertisement
Advertisement