త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mutual Funds | ఐదేళ్లలో 131, పదేళ్లలో 517 శాతం లాభం.. టాప్ మ్యూచువల్ ఫండ్స్ ఇవే..

Mutual Funds | దీర్ఘకాలిక పెట్టుబడులతో సంపద సృష్టించాలనుకునే వారికి మ్యూచువల్ ఫండ్స్ ఒక పెట్టుబడి మార్గంగా నిలుస్తున్నాయి. గత ఐదేళ్లలో ఇన్వెస్కో ఇండియా మిడ్ క్యాప్ ఫండ్ 131.85 శాతం రాబడితో అగ్రస్థానంలో నిలవగా, పదేళ్లలో నిప్పన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ 517.34 శాతం రాబడిని అందించింది. ఈ పథకాల్లో రూ.లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే ఇప్ప‌టికి అద్భుత‌మైన రాబ‌డి వ‌చ్చి ఉండేది.

S

Business | Published On Nov 27, 2026, 1.27 pm IST

Mutual Funds | ఐదేళ్లలో 131, పదేళ్లలో 517 శాతం లాభం.. టాప్ మ్యూచువల్ ఫండ్స్ ఇవే..
Advertisement

Mutual Funds | దీర్ఘకాలిక పెట్టుబడులతో సంపద సృష్టించాలనుకునే వారికి మ్యూచువల్ ఫండ్స్ ఒక పెట్టుబడి మార్గంగా నిలుస్తున్నాయి. గత ఐదేళ్లలో ఇన్వెస్కో ఇండియా మిడ్ క్యాప్ ఫండ్ 131.85 శాతం రాబడితో అగ్రస్థానంలో నిలవగా, పదేళ్లలో నిప్పన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ 517.34 శాతం రాబడిని అందించింది. ఈ పథకాల్లో రూ.లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే ఇప్ప‌టికి అద్భుత‌మైన రాబ‌డి వ‌చ్చి ఉండేది.

అధిక రాబ‌డి ఇచ్చిన ఫండ్స్ ఇవే..

మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే విషయంలో ఒక్కొక్కరి ఆలోచనా విధానం ఒక్కోలా ఉంటుంది. కొందరు అధిక రాబడుల కోసం రిస్క్ తీసుకుంటే, మరికొందరు పెట్టుబడికి భద్రతతోపాటు స్థిరమైన ఆదాయాన్ని కోరుకుంటారు. ఇంకొందరు రిస్క్, రాబడుల మధ్య సమతుల్యత పాటిస్తారు. అయితే సరైన పెట్టుబడి ప్రణాళిక లేక చాలామంది తమ పొదుపు మొత్తాలను బ్యాంకు ఖాతాల్లోనే ఉంచుతున్నారు. ఆర్థిక నిపుణుల సలహాతో దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడులు పెట్టినప్పుడు కాంపౌండింగ్ ప్రయోజనంతో సంపద పెరిగే అవకాశం ఉంటుంది. స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులకు లోనైనప్పటికీ, దీర్ఘకాలిక పెట్టుబడుల ద్వారా మెరుగైన రాబడులు పొందేందుకు మ్యూచువల్ ఫండ్స్ అవకాశం కల్పిస్తాయి. లార్జ్ అండ్ మిడ్ క్యాప్, మిడ్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్, వాల్యూ, ఫోకస్డ్, మల్టీ క్యాప్, స్మాల్ క్యాప్ విభాగాల్లో గత ఐదేళ్లు, పదేళ్ల పనితీరును పరిశీలిస్తే ఆసక్తికరమైన వివరాలు వెల్లడవుతున్నాయి. ఐదేళ్లలో మిడ్ క్యాప్ ఫండ్స్, పదేళ్లలో స్మాల్ క్యాప్ ఫండ్స్ మెరుగైన పనితీరు కనబరిచాయి.

ఐదేళ్ల రాబ‌డుల‌లో ఏవి టాప్‌..?

గత ఐదేళ్ల రాబడులను పరిశీలిస్తే ఇన్వెస్కో ఇండియా మిడ్ క్యాప్ ఫండ్ 131.85 శాతం అబ్సల్యూట్ రిటర్న్స్‌తో మొదటి స్థానంలో నిలిచింది. ఇందులో ఐదేళ్ల క్రితం రూ.లక్ష పెట్టుబడి పెట్టినట్లయితే ప్రస్తుతం దాని విలువ రూ.2.31 లక్షలకు పైగా చేరేది. మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ 129.69 శాతం రాబడితో రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఈ పథకంలో రూ.లక్ష పెట్టుబడి విలువ ఐదేళ్లలో రూ.2.29 లక్షలకు పైగా పెరిగింది. ఇక హెచ్‌డీఎఫ్‌సీ మిడ్ క్యాప్ ఫండ్ 128.76 శాతం రాబడిని అందించింది. ఇందులో పెట్టిన రూ.లక్ష ఐదేళ్ల తర్వాత సుమారు రూ.2.28 లక్షలుగా మారింది. ఈ గణాంకాలు ఐదేళ్ల కాలంలో మిడ్ క్యాప్ విభాగం ఎంతటి రాబడులను అందించిందో స్పష్టం చేస్తున్నాయి.

ప‌దేళ్ల రాబ‌డులు అయితే..

పదేళ్ల పెట్టుబడి కాలాన్ని పరిశీలిస్తే నిప్పన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ 517.34 శాతం అబ్సల్యూట్ రిటర్న్స్‌తో అగ్రస్థానంలో నిలిచింది. ఇందులో పదేళ్ల క్రితం రూ.లక్ష పెట్టుబడి పెట్టిన వారికి ప్రస్తుతం సుమారు రూ.6.17 లక్షల విలువైన పెట్టుబడి ఉండేది. అంటే అసలు పెట్టుబడిపై రూ.5.17 లక్షలకు పైగా లాభం వచ్చేది. ఇన్వెస్కో ఇండియా మిడ్ క్యాప్ ఫండ్ పదేళ్లలో 477.29 శాతం రాబడిని అందించి రెండో స్థానంలో నిలిచింది. ఈ పథకంలో రూ.లక్ష పెట్టుబడి విలువ రూ.5.77 లక్షలకు చేరేది. ఇక క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ 468.38 శాతం రాబడితో టాప్ మూడు పథకాల్లో చోటు దక్కించుకుంది. ఇందులో రూ.లక్ష పెట్టుబడి పదేళ్లలో సుమారు రూ.5.68 లక్షలుగా మారేది. అయితే మ్యూచువల్ ఫండ్ రాబడులు మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. గతంలో వచ్చిన రాబడులు భవిష్యత్తులోనూ వస్తాయని హామీ లేదు. పెట్టుబడి పెట్టే ముందు ఫండ్ రిస్క్, పెట్టుబడి లక్ష్యాలు, ఆర్థిక స్థితిగతులను పరిశీలించడం అవసరం.

Advertisement
Advertisement