త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold Loan | గోల్డ్ లోన్ తీసుకున్నాక ధ‌ర‌లు ప‌డిపోతే ఏం చేస్తారు..? LTV అంటే ఏమిటి..?

Gold Loan | బంగారం ధరలు పడిపోతే గోల్డ్ లోన్ తీసుకునే వారికి అందే రుణ పరిమాణం తగ్గే అవకాశం ఉంది. అంతేకాకుండా లోన్ తీసుకున్న తర్వాత కూడా ధరలు మరింత తగ్గితే మార్జిన్ కాల్ వచ్చే ప్రమాదం ఉంటుంది. గోల్డ్ లోన్లు అంటే ఆభరణాలు లేదా బంగారు నాణేలను తాకట్టు పెట్టి రుణం పొందడం.

S

Business | Published On Apr 1, 2026, 2.42 pm IST

Gold Loan | గోల్డ్ లోన్ తీసుకున్నాక ధ‌ర‌లు ప‌డిపోతే ఏం చేస్తారు..? LTV అంటే ఏమిటి..?
Advertisement

Gold Loan | బంగారం ధరలు పడిపోతే గోల్డ్ లోన్ తీసుకునే వారికి అందే రుణ పరిమాణం తగ్గే అవకాశం ఉంది. అంతేకాకుండా లోన్ తీసుకున్న తర్వాత కూడా ధరలు మరింత తగ్గితే మార్జిన్ కాల్ వచ్చే ప్రమాదం ఉంటుంది. గోల్డ్ లోన్లు అంటే ఆభరణాలు లేదా బంగారు నాణేలను తాకట్టు పెట్టి రుణం పొందడం. ఈ రుణ పరిమాణం పూర్తిగా బంగారం మార్కెట్ విలువపై ఆధారపడి ఉంటుంది. ధరలు పడిపోతే లోన్-టు-వాల్యూ (LTV) నిష్పత్తి కఠినమవుతుంది. దీని ప్రభావం రుణ అర్హతపై మాత్రమే కాకుండా, ఇప్పటికే తీసుకున్న లోన్ నిబంధనలపై కూడా పడుతుంది. ముఖ్యంగా ధరల్లో మార్పులు ఎక్కువగా ఉన్న సమయంలో ఈ ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుంది. దేశంలో బంగారాన్ని సంపదకు చిహ్నంగా పరిగణిస్తారు. ఆర్థిక అవసరాల సమయంలో బంగారాన్ని అమ్మడం కంటే తాకట్టు పెట్టడానికే ఎక్కువ మంది ప్రాధాన్యత ఇస్తారు. ఈ కారణంగా గోల్డ్ లోన్ మార్కెట్ వేగంగా పెరిగింది. జనవరి 2026 నాటికి ఈ మార్కెట్ విలువ సుమారు రూ.4 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది గత సంవత్సరం రూ.1.75 లక్షల కోట్లతో పోలిస్తే గణనీయమైన పెరుగుదల కావడం విశేషం.

వేటిని తాక‌ట్టుకు అనుమ‌తిస్తారు..?

అయితే ఇటీవల‌ బంగారం ధరల మార్పులు రుణ గ్ర‌హీత‌ల‌కు ప్రమాదాన్ని మ‌రింత పెంచాయి. పశ్చిమ ఆసియా యుద్ధం ప్రారంభమైన తర్వాత మార్చి 26, 2026 నాటికి బంగారం ధరలు భారత క‌రెన్సీలో సుమారు 13 శాతం తగ్గాయి. దీనికి కారణాలు అమెరికా డాలర్ బలపడడం, 10 ఏళ్ల ట్రెజరీ ఈల్డ్స్ పెరగడం, లాభాల బుకింగ్ కాగా వడ్డీ రేట్లపై అంచనాలు వంటి గ్లోబల్ అంశాల వల్ల సమీప కాలంలో ధరలు అస్థిరంగా ఉండే అవకాశం ఉంది. గోల్డ్ లోన్ ఒక సెక్యూర్డ్ లోన్. 22 క్యారెట్ లేదా అంతకంటే ఎక్కువ స్వచ్ఛత ఉన్న ఆభరణాలు, నాణేలు మాత్రమే తాకట్టు పెట్టడానికి అనుమతిస్తారు. గోల్డ్ బార్లు, బులియన్, గోల్డ్ ప్లేటెడ్ వస్తువులు, రత్నాలు ఉన్న ఆభరణాల‌ను అంగీక‌రించ‌రు. భారత రిజర్వ్ బ్యాంక్ ప్రకారం గరిష్టంగా 1 కిలో బంగారు ఆభరణాలు, 50 గ్రాముల మింటెడ్ నాణేల‌ను తాకట్టు పెట్టవచ్చు.

LTV ప‌రిమితులు ఇవే..

ఇక LTV పరిమితుల‌ను కూడా నిర్ణయించారు. రూ.2.50 ల‌క్ష‌ల రుణం అయితే బంగారం విలువ‌లో 85 శాతం వ‌ర‌కు పొంద‌వ‌చ్చు. అదే రూ.2.50 ల‌క్ష‌ల నుంచి రూ.5 ల‌క్ష‌ల వ‌ర‌కు రుణం అయితే బంగారం విలువ‌లో 80 శాతం మేర ఇస్తారు. రూ.5 ల‌క్ష‌లకు పైగా రుణం అయితే బంగారం విలువ‌లో 75 శాతం మేర ఇస్తారు. ఈ పరిమితులు మొత్తం లోన్ కాలంలో వర్తిస్తాయి. ఇందులో వడ్డీని కూడా కలిపి పరిగణన‌లోకి తీసుకుంటారు. పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు సాధారణంగా 8.50 శాతం నుంచి 9.00 శాతం మధ్య ఉంటాయి. ప్రైవేట్ బ్యాంకులు, NBFCల‌లో ఇవి ఎక్కువగా ఉంటాయి. బంగారం స్వచ్ఛత, క్రెడిట్ స్కోర్, రీపేమెంట్ విధానం వంటి అంశాలపై తుది వడ్డీ రేటును నిర్ణ‌యిస్తారు.

బంగారం ధ‌ర‌లు ప‌డిపోతే..

బంగారం ధరలు పడిపోతే తాకట్టు పెట్టిన ఆస్తి విలువ తగ్గుతుంది. దీంతో LTV నిష్పత్తి దెబ్బతింటుంది. ఫలితంగా రుణ పరిమాణం తగ్గుతుంది. లోన్ తీసుకున్న తర్వాత ధరలు పడిపోతే అనుమతించిన LTV మించిపోతే, బ్యాంకులు మార్జిన్ కాల్ జారీ చేస్తాయి. అంటే రుణగ్ర‌హీత‌ కొంత లోన్ ను చెల్లించాలి లేదా అదనంగా బంగారాన్ని తాకట్టు పెట్టాలి. ఈ నిబంధనలను పాటించకపోయినా, 90 రోజులకు పైగా చెల్లింపులు లేకపోయినా, బ్యాంకులు తాకట్టు పెట్టిన బంగారాన్ని వేలం వేసే అధికారం క‌లిగి ఉంటాయి. వేలం ద్వారా వచ్చిన మొత్తం లోన్‌కు సరిపోకపోతే మిగిలిన మొత్తాన్ని కూడా వసూలు చేస్తారు. అయితే ఎక్కువగా వచ్చిన మొత్తాన్ని తిరిగి రుణగ్ర‌హీత‌కి ఇవ్వాలి. బంగారం ధరలు పెరిగితే LTV నిష్పత్తి మెరుగుపడుతుంది. దీంతో మార్జిన్ కాల్ ప్రమాదం తగ్గుతుంది. అంతేకాకుండా రుణగ్ర‌హీత‌కు ప్రయోజనం కూడా ఉంటుంది. తాకట్టు విలువ పెరగడంతో వడ్డీ తగ్గించే అవకాశం ఉంటుంది. అలాగే కొంత బంగారం విడుదల చేయాలని కోరితే బ్యాంకులు పరిగణన‌లోకి తీసుకునే అవకాశం ఉంటుంది.

ధ‌ర‌ల‌ను ప‌రిశీలిస్తుండాలి..

గోల్డ్ లోన్లు సాధారణంగా 3 నెలల నుంచి 36 నెలల వరకు ఉంటాయి. కొన్ని సంస్థలు 60 నెలల వరకు కూడా ఇస్తాయి. ముందుగానే లోన్ చెల్లించడం ద్వారా ధరల మార్పుల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. అయితే గోల్డ్ లోన్ తీసుకునే ముందు లేదా తీసుకున్న తర్వాత కూడా బంగారం ధరలను గమనించడం అత్యంత అవసరం. రుణ సమయం, తిరిగి చెల్లించే విధానం ఇవన్నీ బంగారం ధరల మార్పులతో నేరుగా ప్రభావితమవుతాయి. క‌నుక గోల్డ్ లోన్ ఉన్న‌వారు బంగారం ధ‌ర‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుంటూ ఉండాలి.

Advertisement
Advertisement