త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gig Workers | గిగ్‌ వర్కర్ల కోసం హైదరాబాద్‌లో ‘ప్రగతి’ కేంద్రాలు

Gig Workers | గిగ్‌, ప్లాట్‌ఫామ్‌ వర్కర్లకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం, క్విక్‌ కామర్స్‌ సంస్థ జెప్టో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో ఐదు ‘ప్రాజెక్ట్‌ ప్రగతి’ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

P

Telangana | Published On Sep 9, 2026, 7.17 pm IST

Gig Workers | గిగ్‌ వర్కర్ల కోసం హైదరాబాద్‌లో ‘ప్రగతి’ కేంద్రాలు
Advertisement
  • ఐదుచోట్ల ఏర్పాటుకు ప్ర‌భుత్వం ఎంవోయూ
  • జెప్టోతో ఒప్పందం
  • విశ్రాంతి తీసుకునేలా ఏర్పాట్లు

Gig Workers | గిగ్‌, ప్లాట్‌ఫామ్‌ వర్కర్లకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం, క్విక్‌ కామర్స్‌ సంస్థ జెప్టో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో ఐదు ‘ప్రాజెక్ట్‌ ప్రగతి’ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. క్విక్‌ కామర్స్‌, ఫుడ్‌ డెలివరీ, ఈ-కామర్స్‌, దుస్తుల విక్రయాలు, ఇతర లాస్ట్ మైల్‌ డెలివరీ రంగాల్లో పనిచేసే కార్మికులు పని వేళల్లో విశ్రాంతి తీసుకునేందుకు ఈ కేంద్రాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. రోడ్డుపైనే ఎక్కువ సమయం గడిపే గిగ్‌ వర్కర్లు ఎదుర్కొంటున్న మౌలిక వసతుల కొరతను దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని ప్ర‌భుత్వం చేప‌డుతోంది. 2024లో హైదరాబాద్‌లో 166 మంది గిగ్‌, ప్లాట్‌ఫామ్‌ వర్కర్లపై హీట్‌వాచ్‌ నిర్వహించిన సర్వేలో.. దాదాపు 69 శాతం మందికి పరిశుభ్రమైన మరుగుదొడ్లు అందుబాటులో లేవని తేలింది. 80 శాతానికి పైగా కార్మికులకు పనిచేసే సమయంలో నీడనిచ్చే విశ్రాంతి ప్రదేశాలు, చల్లదనం కల్పించే సదుపాయాలు లేవని తేలింది.

ఇవీ సదుపాయాలు

ప్రతి ప్రగతి కేంద్రంలో అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ విశ్రాంతి తీసుకునే సదుపాయం, తాగునీరు, మరుగుదొడ్లు, ప్రథమ చికిత్స, మొబైల్‌ ఛార్జింగ్‌ పాయింట్లు, వై-ఫై సదుపాయం కల్పించనున్నారు. ఎప్పటికప్పుడు ఆరోగ్య శిబిరాలు నిర్వహించడంతో పాటు అర్హులైన గిగ్‌, అసంఘటిత కార్మికులకు ఈ-శ్రమ్‌ నమోదుపై అవగాహన కల్పిస్తారు. ఈ కేంద్రాలకు అవసరమైన నిధులను జెప్టో సమకూర్చడంతో పాటు నిరంతరం నిర్వహించనుంది. కేంద్రాల ఏర్పాటుకు అనువైన ప్రాంతాలను ప్రభుత్వం, జెప్టో సంయుక్తంగా గుర్తించనున్నాయి. ప్రాంతాన్ని బట్టి ఒక్కో కేంద్రానికి వందల సంఖ్యలో కార్మికులు రాకపోకలు సాగించే అవకాశం ఉంది. ఎంవోయూ అనంతరం మెట్రోపాలిటన్‌ ఏరియా, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ పట్టణ ఆర్థిక వ్యవస్థలో గిగ్‌, ప్లాట్‌ఫామ్‌ వర్కర్లు కీలకంగా మారుతున్నారన్నారు. వారి రోజువారీ మౌలిక వసతుల అవసరాలకు నగరం తగిన విధంగా స్పందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జెప్టో చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ వికాస్‌ శర్మ మాట్లాడుతూ.. తమ స్టోర్‌ నెట్‌వర్క్‌లో డెలివరీ భాగస్వాములకు ఇప్పటికే అందుబాటులో ఉన్న సదుపాయాలను ‘ప్రాజెక్ట్‌ ప్రగతి’ ద్వారా అన్ని ప్లాట్‌ఫామ్‌లకు చెందిన గిగ్‌ వర్కర్లకు విస్తరిస్తున్నామని తెలిపారు.

Advertisement
Advertisement