త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

US-India Trade Deal | భారత్-అమెరికా ట్రేడ్ డీల్ ఎఫెక్ట్‌: నిఫ్టీ భారీ గ్యాప్-అప్ సంకేతాలు..

US-India Trade Deal | మంగళవారం (ఫిబ్ర‌వ‌రి 3, 2026) దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద గ్యాప్-అప్‌కు నిఫ్టీ, సెన్సెక్స్‌ వేదిక కావచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. భారత్-అమెరికా మధ్య కుదిరిన కీలక వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో నిఫ్టీ 50 భారీ లాభాలతో ప్రారంభమయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

S

Business | Published On Feb 3, 2026, 8.22 am IST

US-India Trade Deal | భారత్-అమెరికా ట్రేడ్ డీల్ ఎఫెక్ట్‌: నిఫ్టీ భారీ గ్యాప్-అప్ సంకేతాలు..
Advertisement

US-India Trade Deal | మంగళవారం (ఫిబ్ర‌వ‌రి 3, 2026) దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద గ్యాప్-అప్‌కు నిఫ్టీ, సెన్సెక్స్‌ వేదిక కావచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. భారత్-అమెరికా మధ్య కుదిరిన కీలక వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో నిఫ్టీ 50 భారీ లాభాలతో ప్రారంభమయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కొత్త ట్రేడ్ డీల్ ప్రకారం, అమెరికా భారత ఉత్పత్తులపై విధిస్తున్న మొత్తం టారిఫ్‌ను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది. అంతేకాదు, రష్యా నుంచి భార‌త్ చేప‌డుతున్న ముడి చ‌మురు కొనుగోళ్ల‌ను కూడా నిలిపివేస్తామ‌ని మోదీ త‌న‌కు తెలిపార‌ని ట్రంప్ అన్నారు. అయితే ఇది భ‌విష్య‌త్తులో జ‌రిగే అవ‌కాశం ఉంది క‌నుక భార‌త్‌పై విధిస్తున్న మ‌రో 25 శాతం పెనాల్టీ ప‌న్నును కూడా తొల‌గిస్తాన‌ని ట్రంప్‌ హామీ ఇచ్చారు. ఈ నిర్ణయం భారత ఎగుమతిదారులకు, అలాగే మార్కెట్ భావోద్వేగాలకు భారీ ఊతమిచ్చింది.

800 పాయింట్ల గ్యాప్-అప్..?

ఈ ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ అధికారికంగా ప్రకటించిన వెంటనే గ్లోబల్ మార్కెట్లలో సానుకూల స్పందన కనిపించింది. సోమవారం రాత్రి GIFT Nifty ఫ్యూచర్స్ దాదాపు 600 పాయింట్లు ఎగబాకడం మార్కెట్ అంచనాలకు బలమిచ్చింది. GIFT Nifty సూచనల ప్రకారం, మంగళవారం ఉదయం నిఫ్టీ 50 సుమారు 25,900 స్థాయిలో (దాదాపుగా 800 పాయింట్ల గ్యాప్ అప్‌తో) ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇది ఇటీవలి కాలంలోనే కాకుండా, చరిత్రలోనే అతిపెద్ద గ్యాప్-అప్ ఓపెనింగ్‌లలో ఒకటిగా మారవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ రంగాల్లో భారీగా కొనుగోళ్లు..?

వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గడం, టారిఫ్ భారం సడలించడం, అలాగే భారత్-అమెరికా సంబంధాల్లో కొత్త అధ్యాయం మొదలవడం.. ఈ మూడు అంశాలు కలిసి మార్కెట్ సెంటిమెంట్‌ను ఒక్కసారిగా బలపరిచాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఐటీ, మెటల్స్, ఎనర్జీ రంగాల్లో బలమైన కొనుగోళ్లు కనిపించే అవకాశముందని అంచనా వేస్తున్నారు. కాగా ఈ ట్రేడ్ డీల్ ప్రభావం మంగళవారం మార్కెట్ ప్రారంభంలోనే స్పష్టంగా కనిపించే అవకాశముండగా, నిఫ్టీ తదుపరి దిశపై పెట్టుబడిదారుల దృష్టి కేంద్రీకృతం కానుంది. ఆ త‌రువాత మార్కెట్లు ఏ దిశ‌లో వెళ్తాయో చూడాలి.

Advertisement
Advertisement