త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

UPI | యూపీఐకి ప‌దేళ్లు.. వృద్ధి ప్ర‌యాణంలో 2026 ఏడాది కీల‌కం

UPI | భారత డిజిటల్ చెల్లింపుల (Digital Payments) వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) సేవ‌లు ప్రారంభ‌మై ప‌దేళ్లు పూర్త‌వుతోంది. 2016-17లో 1.78 కోట్లుగా ఉన్న వార్షిక యూపీఐ లావాదేవీల సంఖ్య‌.. 2025-26 నాటికి 24,162 కోట్లకు చేర‌డం విశేషం. అంటే ఈ ప‌దేళ్ల‌లో లావాదేవీల పరిమాణం దాదాపు 13,000 రెట్లు పెరిగింది. అదే స‌మ‌య‌మంలో లావాదేవీల విలువ కూడా భారీగా పెరిగింది. 2016-17లో రూ.0.07 లక్షల కోట్లుగా ఉన్న యూపీఐ లావాదేవీల మొత్తం విలువ.. 2025-26 నాటికి సుమారు రూ.314 లక్షల కోట్లకు చేరింది.

D

Business | Published On Aug 24, 2026, 4.27 pm IST

UPI | యూపీఐకి ప‌దేళ్లు.. వృద్ధి ప్ర‌యాణంలో 2026 ఏడాది కీల‌కం
Advertisement

UPI | త్రినేత్ర‌.న్యూస్ : యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) సేవ‌లు అందుబాటులోకి వచ్చి 10 ఏళ్లు పూర్తి అవుతోంది. 2016 ఆగస్టు 25న ప్రారంభమైన యూపీఐ సేవ‌లు ప‌దేళ్ల‌లోనే భారత డిజిటల్ చెల్లింపుల (Digital Payments) వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. యూపీఐ ఇప్పుడు దేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తోంది. నేడు కోట్లాది మంది రోజువారీ చెల్లింపులకు దీన్నే ఉప‌యోగిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత పెద్ద రియల్‌టైమ్ పేమెంట్ సిస్టమ్‌గా యూపీఐకి అంతర్జాతీయ గుర్తింపు కూడా వచ్చింది.

2016-17లో 1.78 కోట్లుగా ఉన్న వార్షిక యూపీఐ లావాదేవీల సంఖ్య‌.. 2025-26 నాటికి 24,162 కోట్లకు చేర‌డం విశేషం. అంటే ఈ ప‌దేళ్ల‌లో లావాదేవీల పరిమాణం దాదాపు 13,000 రెట్లు పెరిగింది. అదే స‌మ‌యంలో లావాదేవీల విలువ కూడా భారీగా పెరిగింది. 2016-17లో రూ.0.07 లక్షల కోట్లుగా ఉన్న యూపీఐ లావాదేవీల మొత్తం విలువ.. 2025-26 నాటికి సుమారు రూ.314 లక్షల కోట్లకు చేరింది. అంటే విలువ పరంగా 4,000 రెట్లకు పైగా వృద్ధి నమోదైంది. ఈ విష‌యాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ), రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) పర్యవేక్షణలో 2016 ఆగస్టు 25న ప్రారంభ‌మైన యూపీఐ సేవ‌లు.. గ‌త ప‌దేళ్ల కాలంలో లావాదేవీల సంఖ్య‌, విలువ‌ ఊహించని స్థాయిలో పెరిగింద‌ని పేర్కొంది.

2026 సంవ‌త్స‌రంలో కీల‌క మైలురాయి..

యూపీఐ వృద్ధి ప్ర‌యాణంలో 2026 సంవ‌త్స‌రం కీల‌క మైలురాయిగా నిలిచింద‌ని మంత్రిత్వ శాఖ తెలిపింది. 2026 మే నెలలో నెలవారీ లావాదేవీల సంఖ్య తొలిసారిగా 2,300 కోట్లను దాటి 2,320 కోట్లకు చేరుకుందని తెలిపింది. ఆ త‌ర్వాత జులైలో 2,366 కోట్ల లావాదేవీలు న‌మోదైన‌ట్లు వివ‌రించింది. అంతేకాదు, UPI వ్యవస్థలో బ్యాంకుల భాగస్వామ్యం అద్భుతంగా పెరిగిన‌ట్లు చెప్పింది. కార్యకలాపాలు మొదలైన తొలి ఏడాది అంటే 2016-17లో 44 బ్యాంకులు మాత్ర‌మే యూపీఐ సేవ‌ల‌ను అందించ‌గా.. 2025-26 నాటికి ఆ సంఖ్య 703కు చేరిన‌ట్లు వివ‌రించింది.

49% వాటా యూపీఐదే..

2026లో యూపీఐ ద్వారా స‌గ‌టున రోజుకు సుమారు 66 కోట్ల లావాదేవీలు జ‌రుగుతున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో జరిగిన మొత్తం డిజిటల్ పేమెంట్స్‌లో యూపీఐ వాటా 84 శాతంగా ఉంది. 2025లో ప్రపంచవ్యాప్తంగా జరిగిన రియల్‌టైమ్ పేమెంట్ లావాదేవీల సంఖ్యలో యూపీఐ వాటా 49 శాతంగా ఉంది. లావాదేవీల పరిమాణం ప‌రంగా యూపీఐని ప్ర‌పంచంలోనే అతిపెద్ద రియ‌ల్ టైమ్ చెల్లింపుల వ్య‌వ‌స్థ‌గా అంత‌ర్జాతీయ ద్ర‌వ్య నిధి (IMF) గుర్తించింది.

ప్రపంచవ్యాప్తంగా 11 దేశాల్లో..

భార‌త్ వెలుప‌లా యూపీఐ వినియోగం పెరుగుతోంది. ప్ర‌స్తుతం 11 దేశాల్లో యూపీఐ సేవ‌లు అందుబాటులో ఉన్నాయి. భూటాన్‌, ఫ్రాన్స్, మారిష‌స్‌, నేపాల్‌, ఖ‌తార్‌, సింగ‌పూర్‌, శ్రీ‌లంక‌, యూఏఈ, కంబోడియా, గ్రీస్‌, మాల్దీవుల్లో యూపీఐ సేవ‌లు అందుబాటులో ఉన్నాయి. యూపీఐని అంత‌ర్జాతీయంగా విస్త‌రించేందుకు ప్ర‌భుత్వం, రిజ‌ర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకుంటోంది.

Also Read..

ఔను వాళ్లిద్ద‌రు ఇష్ట‌ప‌డ్డారు..! చ‌ర్చ‌నీయాంశ‌మైన ఇద్ద‌రు మహిళా కానిస్టేబుళ్ల పెళ్లి..!

మైథ‌లాజిక‌ల్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇస్తోన్న టాలీవుడ్ క‌మెడియ‌న్

ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌నంటూ బెదిరింపులు.. నకిలీ 'డీఎస్పీ'కి చెక్ పెట్టిన హైదరాబాద్ పోలీసులు

Advertisement
Advertisement