త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

UPI | యూపీఐపై ఛార్జీలకు రంగం సిద్ధం..? వ‌సూలు చేసేందుకే కేంద్రం మొగ్గు..?

UPI | యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) నిర్వహణతో పెరుగుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించే మార్గాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న జీరో ఎండీఆర్ విధానంలో మార్పులు తీసుకురావడంపై ఆర్థిక సేవల విభాగం పరిశీలన చేస్తోంది. బిజినెస్ స్టాండర్డ్ నివేదిక ప్రకారం.. ప్రభుత్వం ప్రధానంగా రెండు మార్గాలను పరిశీలిస్తోంది.

S

Business | Published On Aug 13, 2026, 3.48 pm IST

UPI | యూపీఐపై ఛార్జీలకు రంగం సిద్ధం..? వ‌సూలు చేసేందుకే కేంద్రం మొగ్గు..?
Advertisement

UPI | యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) నిర్వహణతో పెరుగుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించే మార్గాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న జీరో ఎండీఆర్ విధానంలో మార్పులు తీసుకురావడంపై ఆర్థిక సేవల విభాగం పరిశీలన చేస్తోంది. బిజినెస్ స్టాండర్డ్ నివేదిక ప్రకారం.. ప్రభుత్వం ప్రధానంగా రెండు మార్గాలను పరిశీలిస్తోంది. అధిక విలువ కలిగిన కొన్ని యూపీఐ లావాదేవీలు లేదా నిర్దిష్ట వ్యాపారులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్‌ను తిరిగి ప్రవేశపెట్టడం ఒక మార్గం కాగా, రానున్న కొన్ని సంవత్సరాల్లో ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని క్రమంగా తగ్గించేలా దశలవారీ ప్రోత్సాహక విధానాన్ని అమలు చేయడం రెండో మార్గంగా ఉంది. యూపీఐ లావాదేవీలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ అంశానికి ప్రాధాన్యం పెరిగింది. ఒకవైపు డిజిటల్ చెల్లింపుల వినియోగం వేగంగా విస్తరిస్తుండగా, మరోవైపు బ్యాంకులు, చెల్లింపు సంస్థలు లావాదేవీలను ప్రాసెస్ చేసేందుకు అయ్యే ఖర్చును భరిస్తున్నాయి.

ప్రభుత్వ‌ పరిశీల‌న‌లో రెండు మార్గాలు..

యూపీఐ వ్యవస్థను దీర్ఘకాలంలో ఆర్థికంగా స్థిరంగా కొనసాగించేందుకు రెండు మార్గాలను పరిశీలిస్తున్నట్లు ఆర్థిక సేవల విభాగం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ ఫైనాన్స్‌కు తెలిపింది. యూపీఐ వ్యవస్థ స్థిరత్వం, ప్రభుత్వ ఖజానాపై పడుతున్న భారాన్ని దృష్టిలో ఉంచుకుని రెండు మార్గాలను పరిశీలిస్తున్నామ‌ని, అధిక పరిమితి కలిగిన లావాదేవీలు లేదా వ్యాపారులకు మర్చంట్ డిస్కౌంట్ రేట్‌ను తిరిగి అమలు చేసే అవకాశాన్ని పరిశీలించడం, అలాగే రానున్న కొన్ని సంవత్సరాల్లో ప్రభుత్వ సహాయాన్ని దశలవారీగా తగ్గించే ప్రోత్సాహక విధానాన్ని తీసుకురావడం వంటి ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ స‌ద‌రు కమిటీకి ఇచ్చిన సమాధానంలో పేర్కొంది. అయితే దీన‌ర్థం యూపీఐ వినియోగదారులు వెంటనే ఛార్జీలు చెల్లించాల్సి వస్తుందని కాదు. ప్రస్తుతం పరిశీలిస్తున్న ప్రతిపాదన అధిక విలువ కలిగిన నిర్దిష్ట వ్యాపార లావాదేవీలకు మాత్రమే సంబంధించింది. సాధారణ వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే యూపీఐ చెల్లింపులపై ఛార్జీ విధించే ప్రతిపాదన ఇందులో లేదు.

ఎండీఆర్ అంటే..?

ఎండీఆర్ అంటే మర్చంట్ డిస్కౌంట్ రేట్. డిజిటల్ చెల్లింపులను స్వీకరించే సందర్భంలో కొన్ని రకాల లావాదేవీలపై వ్యాపారుల నుంచి వసూలు చేసే రుసుమునే ఎండీఆర్ అంటారు. ఈ మొత్తాన్ని చెల్లింపు వ్యవస్థలో భాగస్వాములైన వివిధ సంస్థల మధ్య పంచుకుంటారు. యూపీఐ వ్యాపార లావాదేవీలపై 2019 వరకు గరిష్ఠంగా 0.30 శాతం వరకు ఎండీఆర్ అమల్లో ఉండేది. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడం, నగదు వినియోగంపై ఆధారపడటాన్ని తగ్గించడం కోసం 2020 జనవరి నుంచి ప్రభుత్వం యూపీఐపై జీరో ఎండీఆర్ విధానాన్ని అమలు చేసింది. జీరో ఎండీఆర్ విధానం వల్ల యూపీఐ చెల్లింపులను స్వీకరించే వ్యాపారులు లావాదేవీ రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే యూపీఐ వ్యవస్థను నిర్వహించడం, సాంకేతిక మౌలిక సదుపాయాలను కొనసాగించడం వంటి వాటికి బ్యాంకులు, చెల్లింపు సేవల సంస్థలకు ఖర్చులు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.

యూపీఐ ఛార్జీలపై చర్చ ఎందుకు?

యూపీఐ వ్యవస్థ నిర్వహణకు పెరుగుతున్న వ్యయమే ప్రస్తుతం ప్రధాన చర్చగా మారింది. జీరో ఎండీఆర్ వల్ల కలిగే నష్టాలను భర్తీ చేయడంతోపాటు యూపీఐ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రూ.2వేల‌ కోట్లను కేటాయించినట్లు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ ఫైనాన్స్ పేర్కొంది. అయితే పరిశ్రమ అంచనా ప్రకారం యూపీఐ వ్యవస్థ నిర్వహణకు అయ్యే వ్యయం సుమారు రూ.20,700 కోట్లుగా ఉంది. యూపీఐ వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుత ప్రోత్సాహక విధానం దీర్ఘకాలంలో వ్యవస్థకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తుందా అనే అంశంపై కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. అధిక విలువ కలిగిన లావాదేవీలపై నియంత్రిత విధానంలో ఎండీఆర్ విధించేందుకు చట్టపరమైన అవకాశం ప్రస్తుతం ఉన్నప్పటికీ, దానిని అమలు చేయడంలో ఆలస్యం జరిగితే చెల్లింపు సేవల సంస్థలు తగినంతగా లేని ప్రభుత్వ సబ్సిడీలపై ఆధారపడాల్సి వస్తుందని కమిటీ పేర్కొంది. దీని వల్ల సైబర్ భద్రత, మోసాల నివారణ, నెట్‌వర్క్ మౌలిక సదుపాయాలపై కీలక పెట్టుబడులు దెబ్బతినే ప్రమాదం ఉంటుందని తెలిపింది. డిజిటల్ చెల్లింపుల పరిమాణం పెరుగుతున్న కొద్దీ వాటిని నిర్వహించేందుకు అవసరమైన సాంకేతికత, భద్రతా వ్యవస్థలపై పెట్టుబడులు కొనసాగించేందుకు చెల్లింపు సంస్థలకు స్థిరమైన ఆదాయ మార్గం అవసరమనే అభిప్రాయం బలపడుతోంది.

దశలవారీ ప్రోత్సాహక విధానం అంటే..

ప్రభుత్వం పరిశీలిస్తున్న రెండో మార్గం దశలవారీ ప్రోత్సాహక విధానం. ఈ విధానంలో ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని ఒక్కసారిగా నిలిపివేయకుండా రానున్న కొన్ని సంవత్సరాల్లో క్రమంగా తగ్గించే అవకాశం ఉంటుంది. అయితే ఈ విధానం కింద ఎంత మొత్తంలో ప్రోత్సాహకాలు అందించాలి, ఏ తరహా లావాదేవీలకు అవి వర్తించాలి వంటి అంశాలపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. చెల్లింపు పరిశ్రమ ప్రభుత్వ పరిహారంపై ఆధారపడడాన్ని క్రమంగా తగ్గించడంతోపాటు యూపీఐ వృద్ధికి ఎలాంటి అంతరాయం కలగకుండా మార్పులను అమలు చేయాలన్నదే ఈ ప్రతిపాదన ఉద్దేశంగా కనిపిస్తోంది. ప్రస్తుతం వినియోగదారులు యూపీఐ ద్వారా చెల్లింపులు చేసిన ప్రతిసారీ సాధారణ ఛార్జీ విధించాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నట్లు ఎలాంటి సంకేతాలు లేవు. భవిష్యత్తులో ఏదైనా రుసుము విధించినా అది అధిక పరిమితిని మించిన పరిమిత సంఖ్యలోని వ్యాపార లావాదేవీలకు మాత్రమే వర్తిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇదివ‌ర‌కే స్ప‌ష్టం చేశారు. అంటే వినియోగదారులు సాధారణంగా యూపీఐ ద్వారా తక్షణ డిజిటల్ చెల్లింపులు ఎలాంటి లావాదేవీ రుసుము లేకుండానే కొనసాగించే అవకాశం ఉంది. ఇక ఇక్క‌డ‌ కీలకమైన విషయం ఏంటంటే.. అధిక విలువ కలిగిన కొన్ని వ్యాపార లావాదేవీలపై రుసుము విధించడం, ఒక వ్యక్తి మరో వ్యక్తికి డబ్బు పంపిన ప్రతిసారీ లేదా చిన్న మొత్తంలో కొనుగోలు చేసిన ప్రతిసారీ ఛార్జీ వసూలు చేయడం రెండూ పూర్తిగా భిన్నమైన అంశాలు.

నెలకు 150 బిలియన్ల‌ లావాదేవీలు..

యూపీఐ విస్తరిస్తున్న స్థాయి కూడా ప్రభుత్వం దీర్ఘకాలిక ఆర్థిక నమూనాను పరిశీలించడానికి మరో ప్రధాన కారణంగా మారింది. భవిష్యత్తులో యూపీఐ నెలకు 150 బిలియన్ల‌ లావాదేవీలను నిర్వహించే స్థాయికి చేరుకోవచ్చని, మరో 600 మిలియన్ల మంది కొత్త వినియోగదారులను చేర్చుకునే అవకాశం ఉందని పార్లమెంటరీ కమిటీ పేర్కొంది. ఈ స్థాయిలో లావాదేవీలు జరిగినప్పుడు ఒక్కో లావాదేవీకి అయ్యే స్వల్ప వ్యయం కూడా బ్యాంకులు, చెల్లింపు సేవల సంస్థలు, యూపీఐ వ్యవస్థలోని ఇతర భాగస్వాములపై భారీ ఆర్థిక భారంగా మారే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు పరిశ్రమకు వాస్తవంగా అయ్యే ఖర్చులో కేవలం 11 శాతం మేరకు మాత్రమే సరిపోతున్నాయని, అలాగే సాధ్యమయ్యే ఎండీఆర్ వసూళ్లలో సుమారు 14 శాతానికి మాత్రమే సమానమని కమిటీ పేర్కొన్నట్లు నివేదిక తెలిపింది.

ఇకపై ఏం జరగనుంది?

యూపీఐపై ఎండీఆర్‌కు సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు తుది నిర్ణయాన్ని ప్రకటించలేదు. బిజినెస్ స్టాండర్డ్ ప్రకారం.. ఏ తరహా ఎండీఆర్ విధించాలి, ఎంత మొత్తానికి పైబడిన లావాదేవీలపై రుసుము వర్తించాలి అనే అంశాలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని యూపీఐ అండ్ సర్వీసెస్ స్టీరింగ్ కమిటీ నిర్ణయించనుంది. అధిక పరిమితిని మించిన పరిమిత సంఖ్యలోని వ్యాపార లావాదేవీలకు మాత్రమే ఎండీఆర్ వర్తిస్తుందని, అది నామమాత్రంగా ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. డెబిట్ లేదా క్రెడిట్ కార్డులపై సాధారణంగా వసూలు చేసే రుసుములతో పోలిస్తే ఈ ఛార్జీ తక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. అందువల్ల వినియోగదారులు ప్రస్తుతం యూపీఐపై అన్ని లావాదేవీలకు ఛార్జీలు విధించే నిర్ణయం తీసుకోలేద‌ని గుర్తుంచుకోవాలి. లావాదేవీల పరిమాణం నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో యూపీఐ వ్యవస్థను ఆర్థికంగా స్థిరంగా కొనసాగించేందుకు ప్రభుత్వం మార్గాలను అన్వేషిస్తోంది. యూపీఐ విస్తరణ కారణంగా ప్రభుత్వ బడ్జెట్‌పై నిరంతరం భారీ భారం పడకుండా ఉండాలంటే వ్యవస్థకు ఆచరణాత్మకమైన ఆదాయ నమూనా అవసరమని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడా స్పష్టం చేసింది.

Advertisement
Advertisement