త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

UPI | ఆగస్టులో యూపీఐ రికార్డు.. ఒక్క నెలలోనే 24.51 బిలియన్‌ లావాదేవీలు..

UPI | దేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ మరోసారి సరికొత్త రికార్డు సృష్టించింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ఆగస్టు నెలలో ఇప్పటివరకు ఎన్నడూ లేనంత అత్యధిక లావాదేవీలను నమోదు చేసింది. రక్షాబంధన్ సందర్భంగా పెరిగిన డిజిటల్ బహుమతులు, నగదు బదిలీలు కూడా ఈ వృద్ధికి అదనపు ఊతమిచ్చాయి.

S

Business | Published On Sep 2, 2026, 10.48 am IST

UPI | ఆగస్టులో యూపీఐ రికార్డు.. ఒక్క నెలలోనే 24.51 బిలియన్‌ లావాదేవీలు..
Advertisement

UPI | దేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ మరోసారి సరికొత్త రికార్డు సృష్టించింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ఆగస్టు నెలలో ఇప్పటివరకు ఎన్నడూ లేనంత అత్యధిక లావాదేవీలను నమోదు చేసింది. రక్షాబంధన్ సందర్భంగా పెరిగిన డిజిటల్ బహుమతులు, నగదు బదిలీలు కూడా ఈ వృద్ధికి అదనపు ఊతమిచ్చాయి. ఆగస్టులో యూపీఐ ద్వారా 24.51 బిలియన్ లావాదేవీలు జరిగాయి. వీటి మొత్తం విలువ రూ.29.82 లక్షల కోట్లుగా నమోదైంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. జూలైలో నమోదైన 23.66 బిలియన్ లావాదేవీలతో పోలిస్తే ఆగస్టులో యూపీఐ లావాదేవీల పరిమాణం 3.6 శాతం పెరిగింది. గతేడాది ఆగస్టులో నమోదైన 19.63 బిలియన్ లావాదేవీలతో పోలిస్తే ఈసారి దాదాపు 22 శాతం వార్షిక వృద్ధి నమోదైంది.

రూ.29.82 ల‌క్ష‌ల కోట్ల లావాదేవీలు..

లావాదేవీల విలువ పరంగా కూడా యూపీఐ గణనీయమైన వృద్ధిని సాధించింది. గతేడాది ఆగస్టులో రూ.24.85 లక్షల కోట్లుగా ఉన్న యూపీఐ లావాదేవీల విలువ ఈ ఏడాది ఆగస్టులో రూ.29.82 లక్షల కోట్లకు చేరింది. అంటే ఏడాది వ్యవధిలో సుమారు 20 శాతం వృద్ధి నమోదైంది. అయితే మే, జూలైలో నమోదైన సుమారు రూ.29.9 లక్షల కోట్ల రికార్డు నెలవారీ విలువతో పోలిస్తే ఆగస్టు విలువ స్వల్పంగా తక్కువగా ఉంది. ఈ ఏడాది మొత్తం యూపీఐ లావాదేవీల్లో బలమైన వృద్ధి కొనసాగుతోంది. జూన్‌లో 22.72 బిలియన్ లావాదేవీలు నమోదవగా, జూలైలో ఈ సంఖ్య 23.66 బిలియన్లకు పెరిగింది. ఆగస్టులో మరోసారి పెరిగి 24.51 బిలియన్ల సరికొత్త గరిష్ఠానికి చేరింది. రోజువారీ చెల్లింపులతోపాటు తక్కువ మొత్తాల్లో వ్యక్తుల మధ్య జరిగే నగదు బదిలీల్లో కూడా యూపీఐ వినియోగం పెరుగుతున్న విషయాన్ని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

ర‌క్షాబంధ‌న్ ఊతం..

రక్షాబంధన్ సందర్భంగా యూపీఐ వినియోగం పెరగడం కూడా ఆగస్టు వృద్ధికి ఒక కారణంగా నిలిచింది. ఈ పండుగ సమయంలో డిజిటల్ బహుమతులు పంపడం, డబ్బు బదిలీ చేయడం సాధారణంగా పెరుగుతుంది. క్యాష్‌ఫ్రీ పేమెంట్స్ సహ వ్యవస్థాపకుడు రీజూ దత్తా మాట్లాడుతూ లావాదేవీల సంఖ్య పెరుగుతున్నప్పటికీ మొత్తం లావాదేవీల విలువలో పెద్ద మార్పులు లేకపోవడం యూపీఐ పరిధి, వినియోగం రెండూ విస్తరిస్తున్నాయనడానికి సంకేతమని పేర్కొన్నారు. భారత్‌లో విస్తృతమైన పండుగల సీజన్ ప్రారంభం కావడంతో రానున్న నెలల్లో డిజిటల్ చెల్లింపుల కార్యకలాపాలు మరింత బలంగా ఉంటాయ‌ని చెల్లింపు సంస్థలు అంచనా వేస్తున్నాయి. క్రెడిట్ ఆన్ యూపీఐ వంటి కొత్త వినియోగ విధానాలు, పండుగల సందర్భంగా పెరిగే డిజిటల్ చెల్లింపుల డిమాండ్ కలిసి యూపీఐ వృద్ధికి మరో దశను అంస్తాయ‌ని ఎన్‌పీఎస్‌టీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో దీపక్ చంద్ర ఠాకూర్ తెలిపారు. అదే సమయంలో, డిజిటల్ చెల్లింపుల మౌలిక వసతులను మరింత పటిష్ఠంగా, అంతరాయాలను తట్టుకునే విధంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

విదేశాల్లోనూ సేవ‌లు..

యూపీఐ విస్తరణ భారత్‌కే పరిమితం కాకుండా విదేశాలకు కూడా కొనసాగుతోంది. ప్రస్తుతం 11 దేశాల్లో యూపీఐని వినియోగించుకునే అవకాశం ఉంది. ఉజ్బెకిస్థాన్ తాజాగా ఈ జాబితాలో చేరింది. సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఫ్రాన్స్, మారిషస్, నేపాల్, భూటాన్, ఖతార్, శ్రీలంక, కంబోడియా, గ్రీస్ దేశాల్లోనూ యూపీఐ ఆమోదం పొందుతోంది. 2016 ఆగస్టులో ప్రారంభమైన యూపీఐ, తక్కువ స్థాయి డిజిటల్ చెల్లింపుల వేదిక నుంచి దేశ రిటైల్ చెల్లింపుల వ్యవస్థకు వెన్నెముకగా మారింది. ఆర్థిక సంవత్సరం 2016-17లో యూపీఐ ద్వారా జరిగిన వార్షిక లావాదేవీల విలువ కేవలం రూ.0.07 లక్షల కోట్లు ఉండగా, 2025-26 ఆర్థిక సంవత్సరంలో అది సుమారు రూ.314 లక్షల కోట్లకు చేరింది. అంటే దశాబ్ద కాలంలో లావాదేవీల విలువ 4వేల రెట్లకు పైగా పెరిగింది.

గ‌ణ‌నీయంగా వార్షిక వృద్ధి..

వార్షిక లావాదేవీల సంఖ్యలో వృద్ధి మరింత వేగంగా నమోదైంది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో 1.78 కోట్లుగా ఉన్న వార్షిక యూపీఐ లావాదేవీలు 2025-26లో 24,162 కోట్లకు పైగా పెరిగాయి. ఇక నెలవారీ యూపీఐ లావాదేవీలు ఈ ఏడాది మేలో తొలిసారి 2,300 కోట్ల మార్కును దాటాయి. ఆ నెలలో మొత్తం 2,320 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. తాజా ఆగస్టు రికార్డు చూస్తే, దేశంలో రోజువారీ డిజిటల్ చెల్లింపులపై యూపీఐ ఆధిపత్యం మరింత బలపడుతున్నట్లు స్పష్టమవుతోంది.

Advertisement
Advertisement