త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

GST Collection | పండగ జోష్‌తో ఆర్థిక వ్యవస్థకు ఊపు

GST Collection | దేశీయ ఆర్థిక వ్యవస్థకు పండగల సీజన్‌ ఊపునిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నప్పటికీ.. దేశంలో మాత్రం వ్యాపార కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయి. దీనికి తాజా నిదర్శనంగా ఆగస్టు నెల జీఎస్టీ వసూళ్లు దాదాపు రూ.2 లక్షల కోట్లకు చేరగా.. యూపీఐ లావాదేవీలు సరికొత్తగా గ‌రిష్టాన్ని తాకాయి.

P

Business | Published On Sep 1, 2026, 2.44 pm IST

GST Collection | పండగ జోష్‌తో ఆర్థిక వ్యవస్థకు ఊపు
Advertisement
  • ఆగస్ట్ మాసంలో రూ.1.99 లక్షల కోట్లకు జీఎస్టీ వసూళ్లు..
  • యూపీఐ లావాదేవీల్లో సరికొత్త రికార్డు

GST Collection | దేశీయ ఆర్థిక వ్యవస్థకు పండగల సీజన్‌ ఊపునిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నప్పటికీ.. దేశంలో మాత్రం వ్యాపార కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయి. దీనికి తాజా నిదర్శనంగా ఆగస్టు నెల జీఎస్టీ వసూళ్లు దాదాపు రూ.2 లక్షల కోట్లకు చేరగా.. యూపీఐ లావాదేవీలు సరికొత్తగా గ‌రిష్టాన్ని తాకాయి.

రూ.1.99 లక్షల కోట్ల జీఎస్టీ

ఆగస్టులో స్థూల జీఎస్టీ వసూళ్లు గతేడాది ఇదే నెలతో పోలిస్తే 14.8 శాతం పెరిగి రూ.1,99,853 కోట్లకు చేరాయి. దేశీయ లావాదేవీల ద్వారా వచ్చిన జీఎస్టీ ఆదాయం 9.3 శాతం వృద్ధితో రూ.1.37 లక్షల కోట్లకు పైగా నమోదైంది. దిగుమతులపై జీఎస్టీ ఆదాయం ఏకంగా 29 శాతం పెరిగి రూ.62,604 కోట్లకు చేరింది. వసూళ్లలో సీజీఎస్టీ వాటా రూ.38,413 కోట్లు కాగా.. ఎస్‌జీఎస్టీ రూ.46,316 కోట్లుగా ఉంది. ఆగస్టులో రూ.31,795 కోట్ల మేర రిఫండ్స్ జారీ చేశారు. గతేడాదితో పోలిస్తే రీఫండ్స్ 68 శాతం పెరిగాయి. రిఫండ్స్‌ను మినహాయించిన తర్వాత నికర జీఎస్టీ వసూళ్లు 8.3 శాతం పెరిగి రూ.1.68 లక్షల కోట్లకు చేరాయి. అయితే, జీఎస్టీ వసూళ్లలో ఇప్పటివరకు ఆల్‌టైమ్ రికార్డు స్థాయిలో ఈ ఏడాది ఏప్రిల్‌లో దాదాపు రూ.2.43 లక్షల కోట్ల జీఎస్టీ వసూల‌య్యాయి.

యూపీఐలో ఆల్‌టైమ్‌ రికార్డు

డిజిటల్‌ చెల్లింపుల విషయంలోనూ ఆగస్టు నెల రికార్డులు నెల‌కొల్పింది. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) గణాంకాల ప్రకారం.. ఆగస్టులో యూపీఐ ద్వారా 2,451 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఒక నెలలో నమోదైన లావాదేవీల పరిమాణంలో ఇదే సరికొత్త రికార్డు. లావాదేవీల విలువ కూడా రూ.29.82 లక్షల కోట్లకు చేరింది. మే-జులై 2026 మధ్య నమోదైన రూ.29.9 లక్షల కోట్ల రికార్డుకు ఇది అత్యంత చేరువగా ఉంది. గతేడాది ఆగస్టుతో పోలిస్తే యూపీఐ లావాదేవీల విలువ 20 శాతం పెరిగింది. అప్పట్లో రూ.24.85 లక్షల కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. లావాదేవీల సంఖ్య 22 శాతం పెరిగింది.

రాఖీ పండగ ప్రభావం..

ఆగస్టులో డిజిటల్‌ చెల్లింపులు భారీగా పెరగడానికి రక్షాబంధన్‌ సహా పండగల సీజన్‌ ప్రధాన కారణంగా ఆర్థిక విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. బ‌హుమ‌తులు, వ‌స్తువుల కొనుగోళ్లు, చెల్లింపులు, నగదు బదిలీలకు యూపీఐను విస్తృతంగా వినియోగించ‌డంతో.. పండగల సందడి డిజిటల్‌ లావాదేవీల్లోనూ స్పష్టంగా కనిపించింది. గత దశాబ్ద కాలంలో యూపీఐ దేశ డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థను పూర్తిగా మార్చేసింది. 2017 ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ.0.07 లక్షల కోట్లుగా ఉన్న యూపీఐ లావాదేవీల విలువ.. 2026 ఆర్థిక సంవత్సరానికి దాదాపు రూ.314 లక్షల కోట్లకు చేరింది.

11 దేశాలకు విస్తరణ

దేశీయంగా అత్యంత ప్రజాదరణ పొందిన డిజిటల్‌ చెల్లింపు వ్యవస్థగా ఎదిగిన యూపీఐ అంతర్జాతీయంగానూ విస్తరిస్తోంది. ప్రస్తుతం 11 దేశాల్లో యూపీఐ ఆధారిత చెల్లింపులు అందుబాటులో ఉన్నాయి. తాజాగా ఉజ్బెకిస్థాన్‌ ఈ జాబితాలో చేరింది. సింగపూర్‌, యూఏఈ, ఫ్రాన్స్‌, మారిషస్‌, నేపాల్‌, భూటాన్‌, ఖతార్‌, శ్రీలంక, కంబోడియా, గ్రీస్‌ తదితర దేశాల్లోనూ యూపీఐ ఆధారిత రియల్‌టైమ్‌ చెల్లింపులు అందుబాటులోకి వ‌చ్చాయి.

Advertisement
Advertisement