త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

EPFO 3.0 | ఈపీఎఫ్‌ఓ 3.0 భారీ అప్‌డేట్‌.. యూపీఐ, ఏటీఎం ద్వారా న‌గ‌దు విత్ డ్రా.. ప్ర‌ధాన మార్పులు ఇవే..

EPFO 3.0 | దేశంలోని కోట్లాది మంది ఉద్యోగులు, ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ సభ్యులకు భారీ శుభవార్త. ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ డిజిటల్‌ మౌలిక వసతులను అప్‌గ్రేడ్‌ చేస్తూ ఈపీఎఫ్‌ఓ 3.0ను తీసుకొస్తోంది. ఈ కొత్త వ్యవస్థ అమల్లోకి వస్తే ఇప్పటివరకు ఉన్న సుదీర్ఘమైన పీఎఫ్‌ క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌ ప్రక్రియకు ముగింపు పలకనుంది.

S

Business | Published On Aug 31, 2026, 11.38 am IST

EPFO 3.0 | ఈపీఎఫ్‌ఓ 3.0 భారీ అప్‌డేట్‌.. యూపీఐ, ఏటీఎం ద్వారా న‌గ‌దు విత్ డ్రా.. ప్ర‌ధాన మార్పులు ఇవే..
Advertisement

EPFO 3.0 | దేశంలోని కోట్లాది మంది ఉద్యోగులు, ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ సభ్యులకు భారీ శుభవార్త. ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ డిజిటల్‌ మౌలిక వసతులను అప్‌గ్రేడ్‌ చేస్తూ ఈపీఎఫ్‌ఓ 3.0ను తీసుకొస్తోంది. ఈ కొత్త వ్యవస్థ అమల్లోకి వస్తే ఇప్పటివరకు ఉన్న సుదీర్ఘమైన పీఎఫ్‌ క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌ ప్రక్రియకు ముగింపు పలకనుంది. ఎలాంటి పేపర్‌వర్క్‌ లేకుండానే సభ్యులు తమ పీఎఫ్‌ నిధులను నేరుగా యూపీఐ ఖాతా ద్వారా లేదా యూపీఐ సదుపాయం ఉన్న ఏటీఎం నుంచి విత్‌డ్రా చేసుకునే అవకాశం కలగనుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్‌, వీపీఎఫ్‌పై 8.25 శాతం వడ్డీ రేటును ఆమోదించింది. ఇప్పుడు ఈపీఎఫ్‌ఓ 3.0 ద్వారా సభ్యులు తమ పీఎఫ్‌ నిధులను మరింత వేగంగా, సులభంగా పొందే అవకాశం ఏర్పడుతోంది. ఈ కొత్త వ్యవస్థలో అనేక మార్పుల‌ను అందించ‌నున్నారు.

క్లెయిమ్‌ల‌కు త‌గ్గ‌నున్న స‌మ‌యం..

పీఎఫ్‌ క్లెయిమ్‌ల పరిష్కారానికి పట్టే సమయాన్ని తగ్గించడం, సేవలను పూర్తిగా డిజిటల్‌ విధానంలో అందించడం ఈపీఎఫ్‌ఓ 3.0 ప్రధాన లక్ష్యం. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. జూలైలో ఈపీఎఫ్‌ఓ తన మొత్తం సభ్యుల డేటాబేస్‌ను సెంట్రలైజ్డ్‌ ఐటీ-ఎనేబుల్డ్‌ సిస్టమ్‌ ప్లాట్‌ఫామ్‌కు విజయవంతంగా బదిలీ చేసింది. దీంతో పాత విధానానికి ముగింపు పలికి దేశవ్యాప్తంగా ఒకే జాతీయ డేటాబేస్‌ ఏర్పాటైంది. దీని ద్వారా సభ్యులు తమకు అనుసంధానమైన బ్యాంకు ఖాతాల్లోకి యూపీఐ ద్వారా నిధులను వేగంగా బదిలీ చేసుకునే అవకాశం కలగనుంది. ఈపీఎఫ్‌ఓ 3.0 ద్వారా పీఎఫ్‌ సభ్యులకు ఐదు ప్రధాన ప్రయోజనాలు అందనున్నాయి. నిబంధనలు, అర్హతలకు అనుగుణంగా సభ్యులు తమ ఈపీఎఫ్‌ బ్యాలెన్స్‌లో 50 శాతం నుంచి 75 శాతం వరకు యూపీఐ లేదా యూపీఐ ఆధారిత ఏటీఎం ద్వారా విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. సభ్యులు తమ బ్యాంకు ఖాతాకు బదిలీ చేసుకునేందుకు అర్హత ఉన్న మొత్తాన్ని ముందుగానే స్క్రీన్‌పై చూసి తెలుసుకోవచ్చు. అనంతరం యూపీఐ పిన్‌ ద్వారా సురక్షితంగా నిధులను బదిలీ చేసుకోవచ్చు. ఆ మొత్తాన్ని డిజిటల్‌ చెల్లింపులకు ఉపయోగించుకోవడంతో పాటు ఏటీఎం నుంచి నగదుగా కూడా తీసుకోవచ్చు.

రూ.5 ల‌క్ష‌ల వ‌ర‌కు ఆటో-సెటిల్‌మెంట్‌..

ఈపీఎఫ్‌ఓ ఆటో-సెటిల్‌మెంట్‌ పరిమితిని రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచింది. దీంతో అనారోగ్యం, పిల్లల విద్య, వివాహం, ఇల్లు కొనుగోలు లేదా నిర్మాణం వంటి అవసరాల కోసం చేసే అర్హత కలిగిన క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా ప్రాసెస్‌ అవుతాయి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత కేవలం మూడు రోజుల్లోనే సభ్యుల ఖాతాల్లో మొత్తం జమ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఉమంగ్‌ యాప్‌లో ఫేస్‌ ఆథెంటికేషన్‌ టెక్నాలజీ ద్వారా సభ్యులు తమ యూఏఎన్‌ను రూపొందించుకోవడం లేదా యాక్టివేట్‌ చేసుకోవడం సాధ్యమవుతుంది. దీంతోపాటు పీఎఫ్‌ పాస్‌బుక్‌ను వెంటనే చూసుకోవడం, తప్పుగా ఉన్న వ్యక్తిగత వివరాలను సరిచేయడం, ఆన్‌లైన్‌లోనే క్లెయిమ్‌లు సమర్పించడం వంటి సేవలను ఇంటి నుంచే పొందవచ్చు.

త‌గ్గ‌నున్న క్లెయిమ్ రిజెక్ష‌న్ స‌మ‌స్య‌..

ఇక కొత్త వ్య‌వ‌స్థ‌లో క్లెయిమ్‌ రిజెక్షన్‌ సమస్య తగ్గనుంది. పాత విధానంలో సభ్యులు తాము ఎంత మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవడానికి అర్హులో స్పష్టంగా తెలియకపోవడంతో క్లెయిమ్‌లు తిరస్కరణకు గురయ్యేవి. అయితే ఈపీఎఫ్‌ఓ 3.0లో సభ్యుడి పరిస్థితులు, నిబంధనల ఆధారంగా విత్‌డ్రా చేసుకునేందుకు అర్హత ఉన్న మొత్తాన్ని ముందుగానే స్క్రీన్‌పై చూపిస్తారు. దీంతో అర్హతకు మించి క్లెయిమ్‌ చేయడం వల్ల ఎదురయ్యే తిరస్కరణలు తగ్గనున్నాయి. అలాగే ఆన్‌లైన్‌ ఫిర్యాదులు, క్లెయిమ్‌ల విషయంలో డిజిటల్‌ స్పందనకు అవకాశం కల్పించారు. క్లెయిమ్‌ను ప్రాసెస్‌ చేసే సమయంలో పీఎఫ్‌ కార్యాలయానికి అదనపు సమాచారం అవసరమైతే, సభ్యులు ఆ వివరాలను ఆన్‌లైన్‌లోనే డిజిటల్‌ విధానంలో సమర్పించవచ్చు. గతంలో ఇలాంటి అదనపు వివరణలను ఆన్‌లైన్‌లో సమర్పించే సదుపాయం అందుబాటులో ఉండేది కాదు. దీంతో ఈపీఎఫ్‌ఓ 3.0 ద్వారా పీఎఫ్‌ సేవలు మరింత వేగంగా, పారదర్శకంగా, డిజిటల్‌ విధానంలో అందుబాటులోకి రానున్నాయి.

Advertisement
Advertisement