త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Suta | రూ.6 లక్షలతో మొదలు.. రూ.73.5 కోట్లకు చేరిన సోదరీమణుల వ్యాపారం..

Suta | దశాబ్దం క్రితం వరకు సుజాత, తనియా అనే ఇద్దరు సోదరీమణులు కార్పొరేట్‌ సంస్థల్లో స్థిరమైన ఉద్యోగాలు చేస్తూ నెలవారీ జీతాలు అందుకునేవారు. అయితే, తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవాలనే లక్ష్యంతో వారు ఉద్యోగాలకు స్వస్తి చెప్పి వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. కేవలం రూ.6 లక్షల వ్యక్తిగత పొదుపుతో ప్రారంభించిన వారి ప్రయాణం ప్ర‌స్తుతం కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించే స్థాయికి చేరింది.

S

Business | Published On Oct 12, 2026, 1.53 pm IST

Suta | రూ.6 లక్షలతో మొదలు.. రూ.73.5 కోట్లకు చేరిన సోదరీమణుల వ్యాపారం..
Advertisement

Suta | దశాబ్దం క్రితం వరకు సుజాత, తనియా అనే ఇద్దరు సోదరీమణులు కార్పొరేట్‌ సంస్థల్లో స్థిరమైన ఉద్యోగాలు చేస్తూ నెలవారీ జీతాలు అందుకునేవారు. అయితే, తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవాలనే లక్ష్యంతో వారు ఉద్యోగాలకు స్వస్తి చెప్పి వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. కేవలం రూ.6 లక్షల వ్యక్తిగత పొదుపుతో ప్రారంభించిన వారి ప్రయాణం ప్ర‌స్తుతం కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించే స్థాయికి చేరింది. భారతీయ చేనేత వస్త్రాలు, సంప్రదాయ కళాకారుల నైపుణ్యాన్ని ప్రోత్సహిస్తున్న వారి బ్రాండ్‌ సూతా (సూటా) ఫ్యాషన్‌ రంగంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.

2016లో వ్యాపారానికి శ్రీకారం..

సుజాత, తనియాలు 2016లో తమ కార్పొరేట్‌ ఉద్యోగాలను వదిలి సూటా వ్యాపారాన్ని ప్రారంభించారు. బయటి వ్యక్తుల నుంచి పెట్టుబడులు సమీకరించకుండా, తమ సొంత పొదుపుతోనే సంస్థను అభివృద్ధి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని శాంతిపూర్‌లో కేవలం రూ.6 లక్షల పెట్టుబడితో ఈ వ్యాపారానికి శ్రీకారం చుట్టారు. తొలినాళ్లలో ఒక చేనేత కార్మిక దంపతులతో కలిసి పనిచేశారు. ఉత్పత్తుల సేకరణ నుంచి ఆర్డర్లను ప్యాకింగ్‌ చేసి వినియోగదారులకు పంపించే వరకు అన్ని పనులను వారే స్వయంగా నిర్వహించారు. ఫ్యాషన్‌, ఈ-కామర్స్‌ రంగాల్లో ఎలాంటి అధికారిక విద్యా నేపథ్యం లేకపోయినా, చేనేతపై తమకున్న ఆసక్తినే వ్యాపారంగా మలుచుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని చేనేత కార్మికులు, వారి కళానైపుణ్యాన్ని దేశవ్యాప్తంగా మరింత మందికి పరిచయం చేయాలనే లక్ష్యంతో సంస్థను అభివృద్ధి చేశారు. ఈ వివరాలను సూటా సంస్థ తన అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించింది.

17 వేల మందికి పైగా చేనేత కార్మికులతో అనుబంధం..

ముంబై కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సూటా సంస్థ ప్రస్తుతం 17 వేల మందికి పైగా చేనేత కార్మికులతో కలిసి పనిచేస్తోంది. వివిధ నివేదికల ప్రకారం, ఆరేళ్ల వ్యవధిలో సంస్థ ఆదాయం 1,200 శాతం పెరిగింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.5.5 కోట్లుగా ఉన్న ఆదాయం, 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.73.5 కోట్లకు చేరింది. సంప్రదాయ చేనేత వస్త్రాలకు ఆధునిక డిజైన్లను జోడిస్తూ వినియోగదారులకు చేరువ కావడం సంస్థ ఎదుగుదలకు దోహదపడింది. సుజాత భువనేశ్వర్‌లోని సీఈటీ కళాశాలలో చదువుకున్నారు. అనంతరం ఢిల్లీలోని ఐఐఎఫ్‌టీ నుంచి విద్యాభ్యాసం పూర్తి చేశారు. వ్యాపార రంగంలోకి రాకముందు ఎస్సార్‌, జిందాల్‌ గ్రూపుల్లో పనిచేశారు. కార్పొరేట్‌ ఉద్యోగ జీవితంతోపాటు ఐఐటీ బాంబేలో పీహెచ్‌డీ చేసే ప్రయత్నాన్ని కూడా పక్కనపెట్టి సూటా బ్రాండ్‌ అభివృద్ధిపై దృష్టి సారించారు.

ఆమె సోదరి తనియా బిశ్వాస్‌ ఇంజినీరింగ్‌ పట్టభద్రురాలు. లక్నోలోని ఐఐఎం నుంచి విద్యను అభ్యసించారు. గతంలో టాటా గ్రూప్‌, ఐబీఎం సంస్థల్లో పనిచేశారు. ఇద్దరూ తమకు ఉన్న విద్యార్హతలు, కార్పొరేట్‌ అనుభవాన్ని ఉపయోగించుకుని సొంత వ్యాపారాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు.

తొలుత ఆన్‌లైన్‌ విక్రయాలపై దృష్టి..

ఇన్‌స్టాగ్రామ్‌లో తొమ్మిది లక్షల మందికి పైగా ఫాలోవ‌ర్ల‌ను సంపాదించుకున్న సూటా, డిజిటల్‌ వేదికల ద్వారా ఎదిగిన ప్రజాదరణ పొందిన బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకుంది. సరళమైన డిజైన్లు, ధరించేందుకు సౌకర్యవంతమైన వస్త్రాలు, సంప్రదాయ విలువలకు ప్రాధాన్యమివ్వడం ఈ బ్రాండ్‌ ప్రత్యేకతలుగా నిలిచాయి. వినియోగదారులతో భావోద్వేగ అనుబంధాన్ని ఏర్పరచుకోవడంలోనూ సంస్థ విజయవంతమైంది. అహ్మదాబాద్‌లోని ఐఐఎం సమర్పించిన ఒక కేస్‌ స్టడీ ప్రకారం, 2021 నాటికి సూటా సంస్థ మొత్తం ఆదాయంలో 98 శాతానికి పైగా ఈ-కామర్స్‌ విక్రయాల ద్వారానే వచ్చేది. ఆన్‌లైన్‌ విక్రయాలతో ప్రారంభమైన వ్యాపారాన్ని తర్వాత ఇతర ఫ్యాషన్‌ విభాగాలకు విస్తరించారు. పురుషుల దుస్తులు, ఆభరణాలు, ఫ్యాషన్‌ ఉపకరణాల విక్రయాల్లోకి కూడా ప్రవేశించారు. చిన్న పెట్టుబడితో ప్రారంభమైన ఈ సంస్థ ప్రయాణం సంప్రదాయ చేనేతకు ఆధునిక వ్యాపార విధానాలను జోడిస్తే ఎంతటి అవకాశాలను సృష్టించవచ్చో నిరూపిస్తోంది.

Advertisement
Advertisement