త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | మహిళా శక్తే నా శక్తి.. మీ ఆశీర్వాదమే నన్ను ఈ స్థాయికి చేర్చింది

CM Revanth Reddy | రాష్ట్రంలోని కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. 2034 నాటికి మహిళా స్వయం సహాయక సంఘాల్లో సభ్యుల సంఖ్యను కోటికి పెంచడంతోపాటు వారందరినీ ఆర్థికంగా బలోపేతం చేయాలని సంకల్పించినట్లు తెలిపారు. మహిళలు వ్యాపారవేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు.

P

Telangana | Published On Nov 8, 2026, 2.50 pm IST

CM Revanth Reddy | మహిళా శక్తే నా శక్తి.. మీ ఆశీర్వాదమే నన్ను ఈ స్థాయికి చేర్చింది
Advertisement
  • 2034 నాటికి కోటి కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం
  • మహిళా స్వయం సహాయక సంఘాలతో సీఎం రేవంత్‌రెడ్డి ముఖాముఖి..
  • పుట్టినరోజును ఆడబిడ్డలకు అంకితం చేస్తున్నాన్న సీఎం

CM Revanth Reddy | రాష్ట్రంలోని కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. 2034 నాటికి మహిళా స్వయం సహాయక సంఘాల్లో సభ్యుల సంఖ్యను కోటికి పెంచడంతోపాటు వారందరినీ ఆర్థికంగా బలోపేతం చేయాలని సంకల్పించినట్లు తెలిపారు. మహిళలు వ్యాపారవేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. మహిళా శక్తే తన శక్తి అని, వారి ఆశీర్వాదమే తనను ఈ స్థాయికి చేర్చిందని పేర్కొన్నారు. లగచర్ల ఇండస్ట్రియల్‌ హబ్‌లో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముఖాముఖి నిర్వహించారు. దీపావళి పండుగ ఉన్నప్పటికీ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన మహిళలందరికీ ధన్యవాదాలు తెలిపారు. తన పుట్టినరోజును ఆడబిడ్డలకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘మీరే నా కుటుంబం.. నా ఆత్మబంధువులు. మా ఆడపడుచుల ఆశీర్వాదంతోనే ఇంతటి ఉన్నత స్థానానికి ఎదిగాను. నేను అడిగినదానికంటే ఎక్కువగా మీరు నాకు అందించారు. ఇక జీవితంలో నేను ఆశించేది ఏమీ లేదు. మీ అందరినీ ఆర్థికంగా ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే నా లక్ష్యం. మీ అన్నగా, తమ్ముడిగా సేవలందించే అవకాశం దేవుడు ఇచ్చాడు. మీ మధ్య పుట్టినరోజు జరుపుకోవాలని ఇక్కడికి వచ్చాను’ అని పేర్కొన్నారు.

మహిళలకు రూ.79 వేల కోట్ల రుణాలు

మహిళా స్వయం సహాయక సంఘాల్లో ప్రస్తుతం 70 లక్షల మంది సభ్యులుగా ఉన్నారని, 2034 నాటికి ఈ సంఖ్య కోటికి చేరాలని సీఎం ఆకాంక్షించారు. కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులుగా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. గత 34 నెలల్లో మహిళలకు రూ.79 వేల కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు అందించామని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల యూనిఫామ్‌ కుట్టే బాధ్యతలను మహిళా సంఘాలకే అప్పగించామని చెప్పారు. తద్వారా మహిళలు ఏటా రూ.15 నుంచి రూ.20 కోట్ల వ్యాపారం చేసుకోగలుగుతున్నారని వివరించారు. పెట్రోల్‌ బంకులు, సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తిలోనూ మహిళలను భాగస్వాములను చేశామన్నారు. సచివాలయంతోపాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇందిరమ్మ క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతలను మహిళలకే అప్పగించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల అమలులో కీలకంగా వ్యవహరిస్తున్న మంత్రి సీతక్కను సీఎం అభినందించారు.

మహిళల కోసమే సంక్షేమ పథకాలు

మహిళల ఆర్థిక, సామాజిక భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రేవంత్‌రెడ్డి తెలిపారు. తాజాగా మంజూరు చేసిన 4.5 లక్షల కొత్త పెన్షన్లలో 3.5 లక్షలు ఒంటరి మహిళలు, వితంతువులకే కేటాయించినట్లు చెప్పారు. నేత, గీత కార్మికులకు కూడా కొత్త పెన్షన్లు సంతృప్త స్థాయిలో మంజూరు చేశామన్నారు. ‘మీ ధైర్యం ఇందిరమ్మ ఇళ్లు.. మీ ధైర్యం 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌. ప్రతిరోజూ 37 లక్షల మంది ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. మహిళల కోసం ఆర్టీసీకి ప్రభుత్వం నిధులు చెల్లించి సంస్థను లాభాల బాటలోకి తీసుకొచ్చాం. సన్నబియ్యం పంపిణీ వంటి కార్యక్రమాలతో పేదల సంతోషానికి ప్రాధాన్యమిస్తున్నాం. మీ సంతోషమే నా సంతోషం.. మీ కోసమే నేను కష్టపడుతున్నా’ అని సీఎం పేర్కొన్నారు.

మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి
మహిళలు ఆర్థికంగా ఎదగడమే కాకుండా పారిశ్రామికవేత్తలుగా మారాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దితే తన జన్మ ధన్యమవుతుందని అన్నారు. ఆడబిడ్డలకు పుట్టినరోజు కానుకగా చీరలు అందించినట్లు తెలిపారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, ఆర్థికంగా నిలదొక్కుకోవాలని సూచించారు.

పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి

మహిళలు తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని సీఎం సూచించారు. ‘మీరు పడిన కష్టాలు మీ పిల్లలు పడొద్దు. చదువే మీ జీవితాలను మారుస్తుంది. ఆడబిడ్డలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దండి. మీ పిల్లల చదువులపై మీకు ఎంత శ్రద్ధ ఉందో.. నాకు కూడా అంతే శ్రద్ధ ఉంది. మీ ఆడబిడ్డలను ఉన్నత చదువులు చదివిస్తామని నా పుట్టినరోజు సందర్భంగా నాకు మాట ఇవ్వండి. మీకు ఈ ప్రభుత్వం అండగా నిలుస్తుంది. ఆడబిడ్డలారా.. నిలబడండి.. నిలదొక్కుకోండి.. పారిశ్రామికవేత్తలుగా మారండి’ అని పిలుపునిచ్చారు.

కేటీఆర్‌పై విమర్శలు

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి విమర్శలు చేశారు. సొంత చెల్లెలినే ఇంటి నుంచి బయటకు గెంటేసిన వ్యక్తి మహిళల అభ్యున్నతి గురించి మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు మహిళల కోసం ఏం చేశారో, వారికి ఏం ఇచ్చారో ప్రజలు ప్రశ్నించాలని అన్నారు. మహిళల పట్ల నిజమైన గౌరవం, అభిమానం మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌, మంత్రులు సీతక్క, దామోదర రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement
Advertisement