త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mutual Funds | రూ.1 ల‌క్ష పెట్టుబ‌డికి రూ.2 ల‌క్ష‌ల రిట‌ర్న్స్.. మోతీలాల్ ఓస్వాల్ టాప్ 3 మ్యుచువ‌ల్ ఫండ్స్‌..

Mutual Funds | అధునాత‌న సాంకేతిక ప‌రిజ్ఙానం ప్ర‌తి ఒక్క‌రికి అందుబాటులో ఉండ‌డంతో ప్ర‌స్తుతం చాలా మందికి మ్యుచువ‌ల్ ఫండ్స్‌పై అవ‌గాహ‌న పెరిగింది. దీంతో ఒక‌ప్పుడు ఎఫ్‌డీ, ఎన్‌పీఎస్‌, పీపీఎఫ్ వంటి సంప్ర‌దాయ ప‌ద్ధ‌తుల్లో పెట్టుబ‌డి పెట్టిన వారు ఇప్పుడు మ్యుచువ‌ల్ ఫండ్స్‌లో భారీగా పెట్టుబ‌డులు పెడుతున్నారు.

S

Business | Published On Apr 18, 2026, 11.02 am IST

Mutual Funds | రూ.1 ల‌క్ష పెట్టుబ‌డికి రూ.2 ల‌క్ష‌ల రిట‌ర్న్స్.. మోతీలాల్ ఓస్వాల్ టాప్ 3 మ్యుచువ‌ల్ ఫండ్స్‌..
Advertisement

Mutual Funds | అధునాత‌న సాంకేతిక ప‌రిజ్ఙానం ప్ర‌తి ఒక్క‌రికి అందుబాటులో ఉండ‌డంతో ప్ర‌స్తుతం చాలా మందికి మ్యుచువ‌ల్ ఫండ్స్‌పై అవ‌గాహ‌న పెరిగింది. దీంతో ఒక‌ప్పుడు ఎఫ్‌డీ, ఎన్‌పీఎస్‌, పీపీఎఫ్ వంటి సంప్ర‌దాయ ప‌ద్ధ‌తుల్లో పెట్టుబ‌డి పెట్టిన వారు ఇప్పుడు మ్యుచువ‌ల్ ఫండ్స్‌లో భారీగా పెట్టుబ‌డులు పెడుతున్నారు. కార‌ణం ఆయా పెట్టుబ‌డి మార్గాల క‌న్నా మ్యుచువ‌ల్ ఫండ్స్ అధిక శాతం రాబ‌డిని ఇస్తాయ‌న్న ధీమానే. ఇది వాస్త‌వ‌మే అయిన‌ప్ప‌టికీ మ్యుచువ‌ల్ ఫండ్స్ అంటే అవి దీర్ఘ‌కాల సంప‌ద సృష్టి కోసం ప్ర‌వేశ‌పెట్ట‌బ‌డ్డాయి. కానీ చాలా మంది వాటిల్లో పెట్టుబ‌డులు పెట్ట‌గానే పోర్ట్ ఫోలియో లాభాల్లో కొన‌సాగాల‌ని ఆశిస్తారు. అది స‌రి కాదు. మ్యుచువ‌ల్ ఫండ్స్‌లో పెట్టుబ‌డులు పెట్టేవారు క‌చ్చితంగా దీర్ఘ‌కాల దృక్ప‌థంతో పొదుపు చేయాలి. అప్పుడే ఆ ఫండ్స్ చ‌క్క‌ని లాభాలను అందిస్తాయి. ఇక కొన్ని ర‌కాల ఫండ్స్ కేవ‌లం 3 నుంచి 5 ఏళ్ల‌లోనే మంచి రాబ‌డుల‌ను అందిస్తాయి. అలాంటి ఫండ్స్ గురించి చాలా మందికి తెలియ‌దు. వాటిల్లో మోతీలాల్ ఓస్వాల్‌కు చెందిన ఈ మూడు ర‌కాల ఫండ్స్ ఉన్నాయి. వీటిల్లో గ‌త 5 ఏళ్ల కింద‌ట రూ.1 ల‌క్ష పెట్టుబ‌డి పెట్టి ఉంటే ఇప్పుడ‌ది ఏకంగా రూ.3 ల‌క్ష‌లు అయి ఉండేది. అంత‌టి రిట‌ర్న్స్ ను ఈ ఫండ్స్ ఇచ్చాయి. మోతీలాల్ ఓస్వాల్‌కు చెందిన మిడ్ క్యాప్‌, లార్జ్ అండ్ మిడ్ క్యాప్‌, ELSS ఫండ్స్ లో చ‌క్క‌ని రిట‌ర్న్స్ ను పొంద‌వ‌చ్చ‌ని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

మిడ్ క్యాప్ ఫండ్‌..

మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ (డైరెక్ట్‌) గ‌త 5 ఏళ్ల కాలంలో సుమారుగా 24.76 శాతం వార్షిక రిట‌ర్న్స్ ను అందించింది. అంటే ఇందులో 5 ఏళ్ల కింద‌ట రూ.1 ల‌క్ష పెట్టి ఉంటే ఇప్పుడు అది రూ. 2 ల‌క్ష‌ల మేర రిట‌ర్న్స్ ను అందించి ఉండేది. దీంతో పెట్టుబ‌డి, రిట‌ర్న్స్ క‌లిపి మొత్తం విలువ రూ.3 ల‌క్ష‌లు చేతిలో ఉంటాయి. ఇలా ఈ ఫండ్ పెట్టుబ‌డిదారుల‌కు గ‌రిష్ట ప్ర‌యోజ‌నాన్ని ఇస్తుంది. అంటే ఇందులో పెట్టిన మొత్తం ఆ కాలవ్య‌వ‌ధిలో రెట్టింపు క‌న్నా అధిక మొత్తంలోనే లాభాల‌ను అందించింద‌న్న‌మాట‌. అయితే మిడ్ క్యాప్ ఫండ్స్‌లో ఉండే మిడ్ క్యాప్ కంపెనీల స్టాక్స్ పెరిగిన‌ప్పుడు ఎంత వేగంగా పెరుగుతాయో, ప‌త‌న‌మైతే అంతే వేగంగా కింద‌కు వ‌స్తాయి. అందువ‌ల్ల ఈ ఫండ్స్ లో అస్థిర‌త ఎక్కువ‌గా ఉంటుంది. అయితే దీర్ఘ‌కాలంలో మాత్రం మేలే చేస్తుంది. అందువ‌ల్ల‌నే మ్యుచువ‌ల్ ఫండ్స్‌ను దీర్ఘ‌కాల దృష్టితో చూడాల‌ని ఆర్థిక నిపుణులు చెబుతుంటారు. ఇక మిడ్ క్యాప్ ఫండ్స్‌లో ఫైనాన్షియ‌ల్స్‌, టెక్నాల‌జీ వంటి రంగాల‌కు చెందిన స్టాక్స్ కు అధిక ప్రాధాన్య‌త ఇచ్చారు. ఈ ఫండ్స్‌లో క‌ల్యాణ్ జువెల్ల‌ర్స్‌, పేటీఎం (వ‌న్‌97), ప‌ర్సిస్టెంట్ సిస్ట‌మ్స్ వంటి స్టాక్స్ ప్ర‌ధానంగా ఉన్నాయి.

లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్‌..

మిడ్ క్యాప్ ఫండ్స్‌తో రిస్క్ వ‌ద్దు అనుకునే వారు లార్జ్ అండ్ మిడ్ క్యాప్ క‌లిపిన ఫండ్‌లో పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. వీటిల్లో స్థిరంగా ఉండే పెద్ద కంపెనీల స్టాక్స్ ఉంటాయి. అలాగే ఎక్కువ‌గా లాభాల‌ను అందించే మిడ్ క్యాప్ స్టాక్స్ కూడా ఉంటాయి. అందువ‌ల్ల ఈ ఫండ్స్ కూడా పెట్టుబ‌డిదారుల‌కు ఎక్కువ రిట‌ర్న్స్ నే అందిస్తాయి. 2019లో మోతీలాల్ ఓస్వాల్ ఈ ఫండ్‌ను ప్రారంభించ‌గా త‌క్కువ కాలంలోనే ఇది 22 శాతానికి పైగా వార్షిక రిట‌ర్న్స్ ను ఇచ్చింది. అందువ‌ల్ల ఈ ఫండ్‌కు పెట్టుబ‌డిదారుల నుంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. ఇందులో 5 ఏళ్ల కింద‌ట రూ.1 ల‌క్ష పెట్టి ఉంటే ఇప్పుడ‌ది రూ.1.70 ల‌క్ష‌ల మేర రిట‌ర్న్స్ ను అందించి ఉండేది. అయితే మిడ్ క్యాప్ ఫండ్ తో పోలిస్తే రిట‌ర్న్స్ స్వ‌ల్పంగా త‌గ్గినా బెంచ్ మార్క్ సూచీల క‌న్నా 8 శాతం అధికంగానే ఈ ఫండ్ రిట‌ర్న్స్ ను అంద‌జేసింది. అందువ‌ల్ల మీడియం రిస్క్‌తో ఎక్కువ రిట‌ర్న్స్ కావాల‌ని ఆశించే వారికి ఈ ఫండ్ ఉత్త‌మ ఆప్ష‌న్‌గా నిలుస్తుంది.

ప‌న్నును ఆదా చేసే ELSS ఫండ్..

మోతీలాల్ ఓస్వాల్‌కు చెందిన ELSS ఫండ్ కూడా చ‌క్క‌ని రాబ‌డిని అందించ‌డంలో పేరుగాంచింది. ప‌న్ను ఆదా చేయాల‌ని చూసేవారికి ఇది ఉత్త‌మ ఎంపిక‌గా నిలుస్తుంది. అయితే ఈ ఫండ్‌లో పెట్టుబ‌డికి 3 ఏళ్ల లాక్‌-ఇన్ పీరియ‌డ్ ఉంటుంది. అందువ‌ల్ల 3 ఏళ్ల వ‌ర‌కు ఫండ్స్ ను విత్ డ్రా చేయ‌డం కుద‌ర‌దు. అయితే మ్యుచువ‌ల్ ఫండ్స్‌ను దీర్ఘ‌కాలిక దృష్టితో నిర్వ‌హించాలి క‌నుక లాక్‌-ఇన్ పీరియ‌డ్ ఉన్నా పెట్టుబ‌డిదారుల‌కు న‌ష్టం ఉండ‌ద‌ని చెప్ప‌వ‌చ్చు. కానీ రిట‌ర్న్స్ మాత్రం అద్భుతంగా అందిస్తుంది. 2015 నుంచి ఈ ఫండ్ స‌గ‌టున 17 శాతం వార్షిక రిట‌ర్న్స్ ను ఇచ్చింది. మిగిలిన రెండు ఫండ్స్‌తో పోలిస్తే రిట‌ర్న్స్ మొత్తం కాస్త త‌గ్గిన‌ప్ప‌టికీ ఈ ఫండ్ ద్వారా పెట్టుబ‌డిదారులు పొందే రిట‌ర్న్స్ పై ఆదాయ ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 80సి కింద ప‌న్ను మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు. అందువ‌ల్ల ఆదా చేసిన ప‌న్ను మొత్తాన్ని కూడా ఒక ర‌కంగా చూస్తే ఈ ఫండ్ ద్వారా సంపాదించిన‌ట్లే అవుతుంది. ఇలా ఈ ఫండ్ కూడా దీర్ఘ‌కాలంలో చ‌క్క‌ని సంప‌ద‌ను సృష్టించేందుకు స‌హాయం చేస్తుంది.

దీర్ఘ‌కాలిక దృక్ప‌థం అవ‌స‌రం..

అయితే మ్యుచువ‌ల్ ఫండ్స్ ఎందులో పెట్టుబ‌డులు పెట్టినా పూర్తి స్థాయిలో అవగాహ‌న ఉన్న‌వారు నేరుగా పెట్టుబ‌డులు పెట్టుకోవ‌చ్చు. కానీ అవగాహ‌న లేక‌పోతే ఆర్థిక నిపుణులు లేదా ఫండ్ డిస్ట్రిబ్యూట‌ర్‌ల‌ను సంప్ర‌దించి పెట్టుబ‌డులు పెట్టాలి. దీని వ‌ల్ల పెట్టుబ‌డిదారులు అనుకున్న రాబ‌డుల‌ను పొంద‌వ‌చ్చు. మ్యుచువ‌ల్ ఫండ్స్ ఏవైనా బాగా రిస్క్‌తో కూడుకున్న‌వి. అయిన‌ప్ప‌టికీ క‌నీసం 5 నుంచి 10 ఏళ్ల స‌మ‌యం ఇస్తేనే మార్కెట్ ఒడిదుడుకుల‌ను త‌ట్టుకుని పెట్టుబ‌డిదారుల‌కు మంచి రిట‌ర్న్స్ ను ఇచ్చేందుకు అవ‌కాశాలు ఉంటాయి. తెలియ‌కుండా ఫండ్స్‌లో పెట్టుబ‌డులు పెట్ట‌డం, కేవ‌లం ఒక సంవ‌త్స‌రం లేదా 6 నెల‌లు చూసి రిట‌ర్న్స్ రావ‌డం లేద‌ని దిగులు చెంద‌డం వంటివి చేయ‌కూడ‌దు. స‌రైన ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ‌, స‌హ‌నం, నిరంత‌ర ప్ర‌ణాళికతోపాటు అవ‌గాహ‌న కూడా ఉంటే మ్యుచువ‌ల్ ఫండ్స్‌లో ఎక్కువ మొత్తంలో రిట‌ర్న్స్ ను పొంద‌వ‌చ్చు.

Advertisement
Advertisement