త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Silver | మీరు కొన్న వెండి వ‌స్తువులు అస‌లువా, న‌కిలీవా.. ఇలా సుల‌భంగా గుర్తించండి..

Silver | గ‌త కొంత కాలంగా అంత‌ర్జాతీయ మార్కెట్ల‌లో బంగారం, వెండి ధ‌ర‌లు గ‌ణ‌నీయంగా పెరిగిన విష‌యం విదిత‌మే. అయితే బంగారంతో పోలిస్తే వెండి ధ‌ర త‌క్కువ‌గా ఉంటుంది క‌నుక చాలా మంది పెట్టుబ‌డిదారులు ఇందులో పెట్టుబ‌డులు పెట్టేందుకు ఆస‌క్తిని చూపిస్తున్నారు. వెండి ఈఎటీఫ్‌లు, ఫండ్స్‌తోపాటు భౌతికంగా వెండిని అధికంగా కొంటున్నారు.

S

Business | Published On Apr 25, 2026, 3.27 pm IST

Silver | మీరు కొన్న వెండి వ‌స్తువులు అస‌లువా, న‌కిలీవా.. ఇలా సుల‌భంగా గుర్తించండి..
Advertisement

Silver | గ‌త కొంత కాలంగా అంత‌ర్జాతీయ మార్కెట్ల‌లో బంగారం, వెండి ధ‌ర‌లు గ‌ణ‌నీయంగా పెరిగిన విష‌యం విదిత‌మే. అయితే బంగారంతో పోలిస్తే వెండి ధ‌ర త‌క్కువ‌గా ఉంటుంది క‌నుక చాలా మంది పెట్టుబ‌డిదారులు ఇందులో పెట్టుబ‌డులు పెట్టేందుకు ఆస‌క్తిని చూపిస్తున్నారు. వెండి ఈఎటీఫ్‌లు, ఫండ్స్‌తోపాటు భౌతికంగా వెండిని అధికంగా కొంటున్నారు. అయితే బంగారంపై చాలా మందికి అవ‌గాహ‌న ఉంటుంది క‌నుక ఆ లోహం లేదా ఆభ‌ర‌ణాల కొనుగోలు విష‌యంలో చాలా మంది జాగ్ర‌త్త‌లు పాటిస్తారు. కానీ వెండి విష‌యంలో మాత్రం పొర‌పాటు చేస్తున్నార‌ని నిపుణులు చెబుతున్నారు. వెండి కొనుగోలు స‌మ‌యంలో చాలా మంది స‌రిగ్గా గ‌మ‌నించ‌క‌పోవ‌డం వ‌ల్ల కొంద‌రు వ్యాపారులు ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నార‌ని అంటున్నారు. భౌతిక వెండి కొనుగోలు విష‌యంలో జాగ్ర‌త్త‌ల‌ను త‌ప్ప‌నిస‌రిగా పాటించాల‌ని సూచిస్తున్నారు.

భారీగా చెలామ‌ణీలో ఉన్న న‌కిలీ వెండి..

దేశంలో బులియ‌న్ మార్కెట్ల‌లో న‌కిలీ వెండి వ‌స్తువులు భారీగా చెలామ‌ణీలో ఉన్నాయ‌ని, ప్ర‌జ‌లు తాము కొనుగోలు చేస్తోంది అస‌లైన వెండి అని భావిస్తున్నార‌ని ప్ర‌ముఖ ఆర్థిక నిపుణుడు, సీఏ సార్థ‌క్ అహుజా తెలిపారు. ఇటీవ‌ల వైష్ణో దేవి ఆల‌యంలో చోటు చేసుకున్న ఓ సంఘ‌ట‌న ద్వారా ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. భ‌క్తులు ఆల‌యంలో స‌మ‌ర్పించిన అధిక మొత్తం వెండి కానుక‌ల్లో న‌కిలీవే అధికంగా ఉన్నాయ‌ని వెల్ల‌డైంది. అయితే ప్ర‌జ‌లు ఆల‌యంలో కావాల‌ని న‌కిలీ వ‌స్తువుల‌ను హుండీలో వేయ‌ర‌ని, వారికి తెలియ‌కుండానే న‌కిలీ వెండి వ‌స్తువుల‌ను కొనుగోలు చేసి ఉంటార‌ని ఆయ‌న తెలిపారు. ఈ క్ర‌మంలోనే ఆ వ‌స్తువుల‌ను స‌రిగ్గా గ‌మ‌నించని భక్తులు అవి వెండివే అని భావించి వాటిని హుండీల్లో వేసి ఉంటార‌ని అన్నారు. అయితే ఇదే కాకుండా దేశవ్యాప్తంగా ప్ర‌స్తుతం ఇలా న‌కిలీ వెండి చెలామ‌ణీలో ఉన్న ఘ‌ట‌న‌లు అనేకం చోటు చేసుకుంటున్నాయ‌ని తెలిపారు. అందువ‌ల్ల పెట్టుబ‌డిదారులు లేదా ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అన్నారు.

ఈ పేర్ల‌తో ఉంటే..

సాధార‌ణంగా ప్ర‌జ‌లు బంగారం కొనుగోలు స‌మ‌యంలో జాగ్ర‌త్త‌గా ఉంటారు కానీ వెండి కొనుగోలు స‌మ‌యంలో అంత జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించరు. దీన్నే కొంద‌రు విక్రేత‌లు ఆస‌ర‌గా చేసుకుని ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నారు. అయితే వెండి కొనుగోలు స‌మ‌యంలో కొన్ని అంశాల‌ను ప‌రిశీలించ‌డం అవ‌స‌రం. ముఖ్యంగా మోసాల‌కు గురి కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్ర‌త్త‌ల‌ను పాటించాల్సి ఉంటుంది. జ‌ర్మ‌న్ సిల్వ‌ర్‌, నికెల్ సిల్వ‌ర్‌, సిల్వ‌ర్ ప్లేటెడ్ అనే పేర్ల‌తో ఉండే వెండి వ‌స్తువుల్లో వెండి ఉండ‌దు. కేవ‌లం వెండి పూత మాత్ర‌మే ఉంటుంది. అందువ‌ల్ల ప్ర‌జ‌లు తాము కొనే వెండి వ‌స్తువుల‌పై ఇలాంటి పేర్లు ఉన్నాయా, లేక స్వ‌చ్ఛ‌మైన వెండి లోహ‌మేనా అన్న విష‌యాన్ని నిర్దారించుకోవాల్సి ఉంటుంది. నిజ‌మైన వెండి వ‌స్తువులపై బంగారం ఆభ‌ర‌ణాల‌పై ఉండే మాదిరిగానే ప్యూరిటీ మార్కులు, హాల్ మార్క్ వివ‌రాలు ఉంటాయి. అవి వెండి వ‌స్తువుల‌పై ఉన్నాయో లేదో త‌నిఖీ చేయాలి. వీటిని అధికారిక మాధ్య‌మాల ద్వారా ధ్రువీక‌రించుకోవ‌చ్చు. ఉదాహ‌ర‌ణ‌కు వెండి వ‌స్తువుల‌పై ఉండే వివ‌రాల‌ను బీఐఎస్ కేర్ యాప్‌లో చెక్ చేసి ఆ వ‌స్తువుల నాణ్య‌త‌ను తెలుసుకోవ‌చ్చు.

ఇంటి వ‌ద్ద ఇలా టెస్ట్ చేయొచ్చు..

ఇంటి వద్ద కూడా కొన్ని సాధారణ పరీక్షలు చేయవచ్చు. వెండి మాగ్నెట్‌కు ఆకర్షితమవదు. వేడిని వేగంగా ప్రసారం చేయడం వల్ల వెండిపై ఐస్ త్వరగా కరుగుతుంది. అలాగే వస్త్రంతో రుద్దినప్పుడు నల్లని మచ్చలు కనిపిస్తాయి, ఇది సహజ ఆక్సిడేషన్ లక్షణం. అలాగే కొనుగోలు సమయంలో సరైన ట్యాక్స్ ఇన్‌వాయిస్ తీసుకోవడం చాలా ముఖ్యం. అందులో విక్రేత వివరాలు స్పష్టంగా ఉండాలి. ప్రత్యేకంగా ఆలయాలు, పర్యాటక ప్రాంతాల వద్ద కొనుగోళ్లు చేసే సమయంలో మరింత జాగ్రత్త అవసరం, ఎందుకంటే ఆయా చోట్ల‌ భావోద్వేగాల ప్రభావంతో త్వర‌గా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. అలాంట‌ప్పుడు అస‌లు క‌న్నా న‌కిలీ వ‌స్తువుల‌ను కొనుగోలు చేసే అవ‌కాశ‌మే ఎక్కువ‌గా ఉంటుంది. ఇక వెండిలో పెట్టుబడి పెట్టాలనుకునేవారికి భౌతిక వెండి క‌న్నా డిజిట‌ల్ ప‌ద్ధ‌తి అయితే మంచిది. ముఖ్యంగా సిల్వ‌ర్ ఈటీఎఫ్ లు చ‌క్క‌ని పెట్టుబ‌డి మార్గంగా నిలిచాయి. వీటిల్లో ప్ర‌జ‌లు సుర‌క్షితంగా పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు విక్ర‌యించి సొమ్ము చేసుకోవ‌చ్చు. వెండిని భౌతికంగా కొనుగోలు చేస్తే మాత్రం క‌చ్చితంగా జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందేన‌ని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement
Advertisement