త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Husharu 2 | “హుషారు 2″లో ఆర్ నారాయ‌ణ‌మూర్తి – మంచి పాత్ర‌లు వ‌స్తే న‌టిస్తానంటూ పీపుల్స్ స్టార్ కామెంట్స్‌

మొద‌టిసారి ఓ క‌మ‌ర్షియ‌ల్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ ముందుకు రాబోతున్నారు ఆర్ నారాయ‌ణ‌మూర్తి. రాహుల్ రామ‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌లో శ్రీహ‌ర్ష కొనుగంటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న హుషారు 2లో న‌క్స‌లైట్ నాయ‌కుడిగా నారాయ‌ణ‌మూర్తి క‌నిపించ‌బోతున్నారు. మంగ‌ళ‌వారం ఈ మూవీ టీజ‌ర్ రిలీజైంది

N

Entertainment | Published On Oct 27, 2026, 7.10 pm IST

Husharu 2 | “హుషారు 2″లో ఆర్ నారాయ‌ణ‌మూర్తి –   మంచి పాత్ర‌లు వ‌స్తే న‌టిస్తానంటూ పీపుల్స్ స్టార్ కామెంట్స్‌
Advertisement

Husharu 2 | విప్ల‌వ భావ‌జాలంతో కూడిన సందేశాత్మ‌క సినిమాల్లోనే ఎక్కువ‌గా న‌టించారు ఆర్ నారాయ‌ణ‌మూర్తి. క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేయ‌కూడ‌ద‌నే రూల్ పెట్టుకున్నారు. పూరి జ‌గ‌న్నాథ్, హ‌రీష్ శంక‌ర్‌తో పాటు ప‌లువురు అగ్ర ద‌ర్శ‌కులు త‌మ సినిమాల్లో మంచి రోల్స్ ఆఫ‌ర్ చేసిన రిజెక్ట్ చేశారు. మొద‌టిసారి నారాయ‌ణమూర్తి ఓ క‌మ‌ర్షియ‌ల్ సినిమాతో త్వ‌ర‌లో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు. రాహుల్ రామ‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌లో శ్రీహ‌ర్ష కొనుగంటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన హుషారు మంచి వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఈ కామెడీ మూవీకి సీక్వెల్ రాబోతుంది. హుషారు 2 పేరుతో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో ఆర్ నారాయ‌ణ‌మూర్తి ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు.

టీజ‌ర్ రిలీజ్‌...

హుషారు 2 టీజ‌ర్‌ను మంగ‌ళ‌వారం రిలీజ్ చేశారు. ఫ‌న్ యాక్ష‌న్ అంశాల‌తో పాటు న‌క్స‌లిజం పాయింట్‌ను ఈ సినిమాలో ట‌చ్ చేశారు. ప్రతీ గడపకు ఓ క‌థ ఉంటుందంటారు..కానీ ఈ చిత్ర‌గుంజ్‌లో ప్ర‌తీ గ‌డ‌ప‌కు ఒకే క‌థ‌... అంద‌రి ఇంటి పేరు ఒక్క‌టే ...భ‌యం. ఒక వైపు ర‌క్తంతో రాజ్యాన్ని ప‌రిపాలించే రాక్ష‌సుడు..మ‌రోవైపు అడ‌విలో క్రూరంగా వేటాడే సాయుధులు... వీళ్ల మ‌ధ్య‌లో న‌లిగి పోతున్న ప్ర‌జ‌లు... ఒక నాయ‌కుడి కోసం ఎదురు చూస్తున్నారు.. ఎవ‌రా నాయ‌కుడు’’ అనే ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్‌తో హుషారు 2 టీజ‌ర్ ప్రారంభ‌మైంది.

బాయ్స్ ఆర్ బ్యాక్‌...

బాయ్స్ ఆర్ బ్యాక్ అనే క్యాప్ష‌న్‌తో ఫ‌న్‌మోడ్‌లోకి టీజ‌ర్ ఎంట్రీ ఇచ్చింది. న‌లుగురు కుర్రాళ్లు క‌లిసి అడ‌విలో అరుపులు అనే సినిమాను చేస్తున్న‌ట్లు చూపించారు. వారి స‌ర‌దాలు, ల‌వ్‌స్టోరీలు, బ్రేక‌ప్‌ల‌ను ఫ‌న్నీగా ఆవిష్క‌రించారు డైరెక్ట‌ర్‌. రాహుల్ రామ‌కృష్ణ త‌న న‌లుగురు బాయ్స్‌తో క‌లిసి త‌న క‌ల‌ల‌ను నిజం చేసుకోవ‌టం కోసం చిత్ర‌గుంజ్‌కు చేరుకుంటాడు. అనుకోని ప‌రిస్థితుల వ‌ల్ల బాయ్స్‌ గ్యాంగ్ విల‌న్స్‌కు టార్గెట్‌గా మారుతారు. విల‌న్స్ నుంచి త‌ప్పించుకొని పారిపోయే ప్ర‌య‌త్నంలో బాయ్స్ గ్యాంగ్స్‌ న‌క్స‌లైట్స్ చేతికి చిక్కుతారు. అక్క‌డ న‌క్స‌ల్స్ నాయ‌కుడు పాత్ర‌లో ఊరు మ‌న‌దిరా పాట‌తో పీపుల్స్ స్టార్ ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి పాత్ర‌ను ప‌రిచ‌యం చేశారు.
‘త‌మ్ముళ్లు వేట మొద‌లెడ‌దామా!’ అనే ఆయ‌న ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్‌తో టీజ‌ర్ ముగిసింది. ఇందులో న‌క్స‌ల్స్ నాయ‌కుడిగా ఆర్ నారాయ‌ణ‌మూర్తి క‌నిపించ‌బోతున్న‌ట్లు చూపించారు.

గొప్ప రోల్‌...

హుషారులో త‌న‌కు డైరెక్ట‌ర్ హ‌ర్ష గొప్ప రోల్ ఇచ్చాడ‌ని టీజ‌ర్ లాంఛ్ ఈవెంట్‌లో ఆర్ నారాయ‌ణ‌మూర్తి అన్నారు. "చాలా ఏళ్ల తర్వాత మంచి పాత్రను పోషించాను. న‌వ్విస్తూనే ఆలోచింప‌జేసే సినిమా ఇది. నిరుదోగ్య సమస్యను ఇందులో చ‌ర్చించారు. పని హక్కుని కోల్పోతున్నాం. శ్రమకు తగ్గ ప్రతిఫలం అనేది లేదు. నలిగిపోతోన్న యువతకి స్వతంత్రంగా, స్వేచ్ఛగా, ఆత్మాభిమానంతో బతకాలనే గొప్ప సందేశాన్ని ఇచ్చే సినిమా ఇది. ఇలాంటి గొప్ప చిత్రాన్ని ప్రజలు ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ‘హుషారు 2’ సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది. దర్శకుడు హర్ష ఎక్కడా కూడా రాజీ పడడు. రవిరాజా పినిశెట్టి తర్వాత నాకు హర్షలో ఆ క్వాలిటీ కనిపించింది. సినిమా నచ్చితే ప్రజలు ఎవరినైనా సరే స్టార్‌లను చేస్తారు" అని అన్నారు.

Advertisement
Advertisement