త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Crude Oil | రష్యా నుంచి చమురు కొనుగోళ్లకు కోత..? అమెరికా ఆంక్షలతో భార‌త్‌పై ఒత్తిడి..

Crude Oil | అమెరికా కొత్త ఆంక్షల నేపథ్యంలో భారత్‌ రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లను తగ్గించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం నవంబర్‌ నెలకు సంబంధించిన చమురు సరఫరాల కోసం భారతీయ రిఫైనరీలు ఏర్పాట్లు చేస్తున్నాయి.

S

Business | Published On Sep 22, 2026, 12.22 pm IST

Crude Oil | రష్యా నుంచి చమురు కొనుగోళ్లకు కోత..? అమెరికా ఆంక్షలతో భార‌త్‌పై ఒత్తిడి..
Advertisement

Crude Oil | అమెరికా కొత్త ఆంక్షల నేపథ్యంలో భారత్‌ రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లను తగ్గించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం నవంబర్‌ నెలకు సంబంధించిన చమురు సరఫరాల కోసం భారతీయ రిఫైనరీలు ఏర్పాట్లు చేస్తున్నాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై సుంకాలు విధించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు అధికారం కల్పించే విస్తృత ఆంక్షల బిల్లుపై ఇటీవల సంతకం కావడంతో, భారత్‌పై మరోసారి అదనపు సుంకాల ముప్పు ఏర్పడింది. ప్రపంచంలో మూడో అతిపెద్ద ముడి చమురు దిగుమతిదారైన భారత్‌.. అధిక ధరలు, మధ్యప్రాచ్యంలో చమురు సరఫరాలకు కొనసాగుతున్న అంతరాయాలను ఎదుర్కొనేందుకు ఇటీవలి నెలల్లో తన దిగుమతుల్లో సగానికి పైగా రష్యా నుంచి కొనుగోలు చేసింది. అయితే గత కొన్ని రోజులుగా దేశంలోని ప్రధాన చమురు శుద్ధి సంస్థలు రష్యా చమురుకు ప్రత్యామ్నాయంగా ఇతర దేశాల నుంచి సరఫరాలను పొందే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ఈ వ్యవహారంపై చర్చల్లో పాల్గొన్న వ్యక్తులు తెలిపారు. ఈ చర్చలు బహిరంగంగా లేనందున వారు తమ పేర్లను వెల్లడించలేదు.

30 శాతానికి ప‌రిమితం చేసే అవ‌కాశం..

తక్షణ కాలంలో రష్యా నుంచి భారత్‌ దిగుమతి చేసుకునే ముడి చమురు వాటాను మొత్తం దిగుమతుల్లో 20 నుంచి 30 శాతానికి పరిమితం చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. తద్వారా సముద్ర మార్గంలో రష్యా చమురును అత్యధికంగా కొనుగోలు చేస్తున్న దేశంగా ఉన్న భారత్‌ స్థానాన్ని కొంతవరకు మార్చుకోవచ్చని భావిస్తున్నారు. అదే సమయంలో అమెరికాతో భారత్‌ చర్చలు కొనసాగించనుంది. అమెరికా గత వారం చట్టంగా అమలు చేసిన కొత్త నిబంధనల ప్రకారం రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేసే దేశాలపై అమెరికా అధ్యక్షుడికి సుంకాలు విధించే అధికారం లభించింది. ఈ జాబితాలో భారత్‌ కూడా ఉంది. గతేడాది కూడా భారత్‌ ఇలాంటి అమెరికా సుంకాల ప్రభావాన్ని ఎదుర్కొంది. అయితే అనంతరం ఆ సుంకాలను ఎత్తివేశారు. ఇప్పటికే భారత్‌ రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న ముడి చమురు పరిమాణం తగ్గింది. కేప్లర్‌ అంచనాల ప్రకారం సెప్టెంబర్‌లో రష్యా నుంచి భారత్‌ దిగుమతులు రోజుకు సుమారు 19 లక్షల బ్యారెళ్లకు పరిమితం అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి. ఇది మొత్తం దిగుమతుల్లో 35 శాతానికి పైగా ఉండగా, ఏప్రిల్‌ తర్వాత నమోదయ్యే అత్యల్ప స్థాయి కావడం గమనార్హం.

133 డాల‌ర్ల‌కు బ్యారెల్ చ‌మురు..

అయితే రష్యా చమురుకు ప్రత్యామ్నాయాలను వెంటనే కనుగొనడం భారత్‌కు అంత సులభం కాదు. రష్యా నుంచి వచ్చే చమురు పరిమాణం వెనిజులా లేదా ఇరాన్‌ వంటి దేశాల నుంచి పొందగలిగే సరఫరాల కంటే చాలా ఎక్కువగా ఉంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు కూడా అధికంగానే ఉన్నాయి. గత వారం చివర్లో భారత్‌కు సరఫరా చేసిన రష్యా యూరల్స్‌ ముడి చమురు ధర బ్యారెల్‌కు సుమారు 133 డాలర్లుగా ఉందని ఆర్గస్‌ మీడియా తెలిపింది. మధ్యప్రాచ్యానికి చెందిన ఒమన్‌, మర్బన్‌ వంటి గ్రేడ్ల ధరలు దీనికంటే కొన్ని డాలర్లు ఎక్కువగా ఉన్నాయి. పర్షియన్‌ గల్ఫ్‌ దేశాల నుంచి చమురు సరఫరాలు హోర్ముజ్‌ జలసంధి ద్వారా సాధారణ స్థితికి తీసుకురావడంలో ఇబ్బందులు కొనసాగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ ముడి చమురు మార్కెట్‌పై ఒత్తిడి పెరిగింది. ఇదే సమయంలో రాజస్థాన్‌లో కొత్త రిఫైనరీ ప్రారంభం కావడం, ఇప్పటికే ఉన్న రిఫైనరీల విస్తరణ కారణంగా భారత్‌ చమురు అవసరం మరింత పెరుగుతోంది. దీంతో దేశ ముడి చమురు దిగుమతులు రోజుకు రికార్డు స్థాయిలో 54 లక్షల బ్యారెళ్లకు చేరుకునే అవకాశం ఉంది.

ఈ నెల చివ‌రి వారంలో చ‌ర్చ‌లు..

నవంబర్‌ సరఫరాలకు సంబంధించిన రష్యా ముడి చమురు కొనుగోళ్లపై సాధారణంగా ఈ నెల చివరి వారంలో చర్చలు ప్రారంభమవుతాయి. అంటే భారత్‌ తదుపరి కొనుగోలు నిర్ణయం అమెరికా ఆంక్షలపై అనిశ్చితి కొనసాగుతున్న సమయంలోనే తీసుకోవాల్సి ఉంటుంది. రష్యా ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్న చైనా సహా ఇతర ప్రధాన దేశాలపై కూడా అమెరికా ఇదే తరహా చర్యలు తీసుకుంటుందా అన్నది భారత్‌ నిశితంగా పరిశీలించనుంది. కొత్త చట్టం ప్రకారం రష్యా ఇంధనాన్ని పెద్ద మొత్తంలో కొనుగోలు చేసే దేశాలపై 30 రోజుల్లో సుంకాలు విధించే అవకాశం అమెరికా ప్రభుత్వానికి ఉంది. ఈ సుంకాలు గరిష్ఠంగా 100 శాతం వరకు ఉండే అవకాశం ఉండడంతో, రష్యా చమురు కొనుగోళ్లకు సంబంధించిన రిస్క్‌ను స్వీకరించాలా వద్దా అన్న నిర్ణయం భారత్‌ ప్రభుత్వంపైనే మరింతగా ఆధారపడనుంది.

ర‌ష్యా నుంచి కొనాలా..

అమెరికా రష్యా చమురు వాణిజ్యంపై ఒత్తిడిని పెంచడం, తగ్గించడం వంటి చర్యలు తీసుకున్న ప్రతిసారీ భారత్ గతేడాది కాలంగా తన రష్యా చమురు కొనుగోళ్లను సర్దుబాటు చేస్తూ వచ్చింది. అయితే 140 కోట్ల మంది ప్రజలకు అందుబాటు ధరలో ఇంధనాన్ని భద్రపరచడమే తమ చమురు కొనుగోలు నిర్ణయాలకు ప్రధాన కారణమని భారత‌ ప్రభుత్వం పలుమార్లు స్పష్టం చేసింది. న్యూఢిల్లీకి చెందిన గ్లోబల్‌ ట్రేడ్‌ రీసెర్చ్‌ ఇనిషియేటివ్‌ వ్యవస్థాపకుడు అజయ్‌ శ్రీవాస్తవ మాట్లాడుతూ, రష్యా నుంచి లభించే ముడి చమురు పోటీ ధరలో ఉన్నంతకాలం భారత్‌ కొనుగోళ్లను కొనసాగించాలని అభిప్రాయపడ్డారు. అమెరికా సుంకాల హెచ్చరికలను భారత్‌ పట్టించుకోకూడదని, భవిష్యత్తులో కూడా అమెరికా మరిన్ని మార్గాల్లో అదనపు సుంకాలు విధించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

Advertisement
Advertisement