SK Hynix | శాంసంగ్‌ను దాటేసిన ఎస్‌కే హైనిక్స్.. ఒకప్పుడు అప్పుల ఊబిలో, ఇప్పుడు మేటి సంస్థగా..
SK Hynix | దక్షిణ కొరియా చిప్ పరిశ్రమలో చరిత్రాత్మక మార్పు చోటుచేసుకుంది. రెండు దశాబ్దాల క్రితం అప్పుల భారంతో దాదాపు కుప్పకూలిపోయే పరిస్థితికి చేరుకున్న ఎస్‌కే హైనిక్స్ ఇప్పుడు ఆ దేశంలోనే అత్యంత విలువైన లిస్టెడ్ కంపెనీగా అవతరించింది. జూన్ 22న కంపెనీ మార్కెట్ విలువ శాంసంగ్ ఎలక్ట్రానిక్స్‌ను అధిగమించి అగ్రస్థానంలో నిలిచింది
SK Hynix | దక్షిణ కొరియా చిప్ పరిశ్రమలో చరిత్రాత్మక మార్పు చోటుచేసుకుంది. రెండు దశాబ్దాల క్రితం అప్పుల భారంతో దాదాపు కుప్పకూలిపోయే పరిస్థితికి చేరుకున్న ఎస్‌కే హైనిక్స్ ఇప్పుడు ఆ దేశంలోనే అత్యంత విలువైన లిస్టెడ్ కంపెనీగా అవతరించింది. జూన్ 22న కంపెనీ మార్కెట్ విలువ శాంసంగ్ ఎలక్ట్రానిక్స్‌ను అధిగమించి అగ్రస్థానంలో నిలిచింది. కృత్రిమ మేధస్సు (ఏఐ) విప్లవం ఎస్‌కే హైనిక్స్‌కు భారీ ఊపునిచ్చింది. ముఖ్యంగా ఎన్‌విడియా, గూగుల్ తదితర సంస్థలు ఉపయోగిస్తున్న ఏఐ సిస్టమ్‌లకు అవసరమైన హై-బ్యాండ్‌విడ్త్ మెమరీ (హెచ్‌బీఎం) చిప్‌ల ప్రధాన సరఫరాదారుగా కంపెనీ ఎదిగింది. ఈ పరిణామంతో ఈ ఏడాది కంపెనీ షేర్ ధర 340 శాతానికి పైగా పెరిగి, మార్కెట్ విలువ శాంసంగ్‌తోపాటు మైక్రాన్‌ను కూడా అధిగమించింది. సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి ఎస్‌కే హైనిక్స్ షేర్లు 5.6 శాతం పెరిగాయి. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2,080.4 ట్రిలియన్ వోన్‌లకు చేరుకుంది.
స్థానాన్ని కోల్పోయిన శాంసంగ్..
ఇక శాంసంగ్ షేరు 0.14 శాతం తగ్గడంతో దాని మార్కెట్ విలువ 2,066.7 ట్రిలియన్ వోన్‌లుగా నమోదైంది. ప్రిఫర్డ్ షేర్లను మినహాయించి ఈ లెక్కలను తీసుకున్నారు. ఏఐ ప్రభావంతో ప్రపంచ సెమీకండక్టర్ రంగం రూపురేఖలు మారిపోయాయి. ఒకప్పుడు సాధారణ వస్తువుల్లా అమ్ముడైన మెమరీ చిప్‌లు ఇప్పుడు చాట్‌జీపీటీ వంటి అధునాతన ఏఐ మోడళ్లకు కీలక మౌలిక సదుపాయాలుగా మారాయి. ఈ మార్పును అత్యంత సమర్థంగా వినియోగించుకున్న కంపెనీగా ఎస్‌కే హైనిక్స్ నిలిచింది. ఎస్‌కే హైనిక్స్ ప్రధానంగా మెమరీ చిప్‌లపై దృష్టి సారిస్తుండగా, శాంసంగ్ మెమరీతోపాటు లాజిక్ చిప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు, టెలివిజన్‌లు తదితర వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను కూడా తయారు చేస్తోంది. 2000 సంవత్సరం నుంచి దక్షిణ కొరియాలో అత్యంత విలువైన కంపెనీగా ఉన్న శాంసంగ్ ఇప్పుడు ఆ స్థానాన్ని కోల్పోయింది. మెరిట్జ్ సెక్యూరిటీస్ సీనియర్ విశ్లేషకుడు కిమ్ సన్‌వూ తెలిపిన ప్రకారం కస్టమైజ్డ్ ఏఐ మెమరీ అభివృద్ధి పరిశ్రమ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్చేసిందన్నారు. దీని వల్లే ఎస్‌కే హైనిక్స్ మార్కెట్ లీడర్ గా ఎదగగలిగిందని పేర్కొన్నారు.

ఒకప్పుడు అప్పుల ఊబిలో..
అయితే మార్కెట్ విలువ లెక్కింపులో ప్రిఫర్డ్ షేర్లను కూడా పరిగణనలోకి తీసుకోవాలని శాంసంగ్ పేర్కొంది. వాటిని కలిపితే కంపెనీ మొత్తం విలువ 2,246.4 ట్రిలియన్ వోన్‌లుగా ఉంటుందని తెలిపింది. ఎస్‌కే హైనిక్స్ ఎదుగుదల దక్షిణ కొరియా కార్పొరేట్ చరిత్రలో అతిపెద్ద పునరుద్ధరణ స్టోరీల్లో ఒకటిగా నిలిచింది. 2002లో అప్పటి హైనిక్స్ సెమీకండక్టర్ తీవ్ర అప్పుల సమస్యతో మైక్రాన్‌కు అమ్ముడయ్యే దశకు చేరుకుంది. అయితే ఆ ఒప్పందం విఫలమవడంతో దాదాపు పదేళ్ల పాటు రుణదాతల నియంత్రణలో కొనసాగింది. 2003లో కంపెనీ షేరు ధర 135 వోన్‌ల వరకు పడిపోయి పెన్నీ స్టాక్‌గా మారింది. తర్వాతి సంవత్సరాల్లో ప్రపంచ మెమరీ పరిశ్రమలో చోటు చేసుకున్న బూమ్-అండ్-బస్ట్ కు అనుగుణంగా కంపెనీ పనితీరు మారుతూ వచ్చింది. 2023లో మెమరీ ధరలు కుప్పకూలడంతో కంపెనీ 7.73 ట్రిలియన్ వోన్‌ల వార్షిక ఆపరేటింగ్ నష్టాన్ని ప్రకటించింది. అయితే ఏఐ రంగంలో పెట్టుబడులు పెరగడం, మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా వంటి దిగ్గజాలు భారీగా ఖర్చు చేయడం వల్ల పరిస్థితి మారింది. 2024లో కంపెనీ 23.5 ట్రిలియన్ వోన్‌ల రికార్డు ఆపరేటింగ్ లాభాన్ని నమోదు చేసింది.

ఆ నిర్ణయమే ఇప్పుడు పనిచేసింది..
పరిశ్రమ మందగమనంలో కూడా హెచ్‌బీఎం చిప్‌లలో పెట్టుబడులు కొనసాగించాలన్న నిర్ణయమే కంపెనీని ఏఐ ఎకోసిస్టమ్‌లో కీలక భాగస్వామిగా మార్చిందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిలువుగా అమర్చే ఈ ప్రత్యేక మెమరీ చిప్‌లు అధిక వేగం, తక్కువ విద్యుత్ వినియోగాన్ని అందిస్తాయి. ఇవి ఏఐ ప్రాసెసర్‌లతో నేరుగా అనుసంధానమై ఉండటంతో మార్కెట్లో ఎంట్రీ లెవల్ అడ్డంకులు పెరిగి సరఫరాదారులకు అధిక ధరలు నిర్ణయించే అవకాశం కలిగింది. 2025 నాటికి ప్రపంచ హెచ్‌బీఎం మార్కెట్లో ఎస్‌కే హైనిక్స్ 61 శాతం వాటాను సాధించింది. శాంసంగ్ వాటా 17 శాతం కాగా, మైక్రాన్ వాటా 21 శాతంగా నమోదైంది. 1983లో హ్యుందాయ్ గ్రూప్ యూనిట్‌గా ప్రారంభమైన ఈ సంస్థ తరువాత విడిపోయి ఎస్‌కే గ్రూప్ కు అమ్ముడైంది. టెలికాం నుంచి ఇంధన రంగం వరకు విస్తరించిన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్వహిస్తున్న ఎస్‌కే గ్రూప్ అప్పట్లో ఈ కొనుగోలు పట్ల తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంది.

శాంసంగ్‌కు సవాల్..
ఎస్‌కే గ్రూప్ చైర్మన్ చెయ్ టే-వోన్ జనవరిలో విడుదల చేసిన తన పుస్తకంలో ఈ నిర్ణయం వెనుక ఉన్న ఆలోచనను వివరించారు. హైనిక్స్‌ను సాధారణ మెమరీ తయారీదారుగా కాకుండా, ప్రపంచానికి తప్పనిసరిగా అవసరమైన సెమీకండక్టర్ కంపెనీగా మార్చాలనేదే తమ లక్ష్యమని తెలిపారు. గతంలో హైనిక్స్, శాంసంగ్ లేదా మైక్రాన్ మెమరీ మధ్య పెద్ద తేడా ఉండేదేమీ కాదని, కానీ హెచ్‌బీఎం పూర్తిగా భిన్నమని చెప్పారు. ఎస్‌కే హైనిక్స్ హెచ్‌బీఎంను మరో ఉత్పత్తితో భర్తీ చేస్తే ఏఐ వ్యవస్థ సరిగా పనిచేయదని ఆయన అన్నారు. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద డీఆర్‌ఏఎం తయారీదారుగా ఉన్న శాంసంగ్ ఆధిపత్యానికీ సవాల్ ఎదురవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. బ్యాంక్ ఆఫ్ అమెరికా అంచనాల ప్రకారం ఈ ఏడాది ఎస్‌కే హైనిక్స్ నెలవారీ డీఆర్‌ఏఎం ఉత్పత్తి 5.89 లక్షల వాఫర్‌లకు చేరుకోనుంది. శాంసంగ్ ఉత్పత్తి 6.91 లక్షల వాఫర్‌లుగా ఉండనుంది. అయితే 2025 నుంచి 2028 మధ్య ఎస్‌కే హైనిక్స్ ఉత్పత్తి సామర్థ్యం 38 శాతం పెరగనుండగా, శాంసంగ్ వృద్ధి 17.5 శాతానికే పరిమితం కానుంది.
అమెరికా స్టాక్ మార్కెట్ వైపు చూపు..
దీంతో 2025లో 23 శాతం ఉన్న ఉత్పత్తి వ్యత్యాసం 2028 నాటికి 10 శాతం కన్నా తక్కువకు తగ్గే అవకాశం ఉంది. శాంసంగ్ వంటి భారీ తయారీ సామర్థ్యం కలిగిన సంస్థకు ఇది గణనీయమైన సవాల్‌గా భావిస్తున్నారు. ఇక ఎస్‌కే హైనిక్స్ కంపెనీ అమెరికా స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్‌కు కూడా సిద్ధమవుతోంది. ఎస్‌కే హైనిక్స్ తన ప్రతిపాదిత అమెరికా లిస్టింగ్ కోసం నాస్‌డాక్‌ను ఎంచుకున్నట్లు రాయిటర్స్ ఇటీవల వెల్లడించింది. ఈ నిర్ణయం ద్వారా ప్రపంచ పెట్టుబడిదారుల ప్రాతిపదిక మరింత విస్తరించి, కంపెనీ అంతర్జాతీయ గుర్తింపు మరింత పెరిగే అవకాశం ఉంది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Instagram | ఇన్స్టాగ్రామ్ క్యారసెల్ పోస్టులకు భారీ అప్డేట్.. ప్రతి స్లైడ్‌కు ప్రత్యేక క్యాప్షన్..
- ●Balaraju Yadav | పిచ్చి పిచ్చి మాట్లాడితే మూతి పగుల్తది.. ఖబర్ధార్
- ●Tollywood | వెంకటేష్, అనిల్ రావిపూడి సినిమాలో యాక్టింగ్ ఛాన్స్ అంటూ మోసాలు - క్లారిటీ ఇచ్చిన టీమ్
- ●World Giraffe Day | ప్రపంచ జిరాఫీ దినోత్సవం.. హైదరాబాద్ జూలో 'బన్నీ' బర్త్‌డే సెలబ్రేషన్స్
- ●Saudi Arabia Vs Spain | స్పెయిన్ చేతిలో సౌదీ అరేబియా చిత్తు
- ●Kiara Advani | టాక్సిక్ వర్సెస్ వాన్ - భర్తతో కియారా అద్వానీ బాక్సాఫీస్ వార్

Instagram | ఇన్స్టాగ్రామ్ క్యారసెల్ పోస్టులకు భారీ అప్డేట్.. ప్రతి స్లైడ్‌కు ప్రత్యేక క్యాప్షన్..

Balaraju Yadav | పిచ్చి పిచ్చి మాట్లాడితే మూతి పగుల్తది.. ఖబర్ధార్

Tollywood | వెంకటేష్, అనిల్ రావిపూడి సినిమాలో యాక్టింగ్ ఛాన్స్ అంటూ మోసాలు - క్లారిటీ ఇచ్చిన టీమ్

World Giraffe Day | ప్రపంచ జిరాఫీ దినోత్సవం.. హైదరాబాద్ జూలో 'బన్నీ' బర్త్‌డే సెలబ్రేషన్స్







