త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SIP | మార్కెట్లలో క‌రెక్ష‌న్ వ‌చ్చే వ‌ర‌కు వేచి చూడొద్దు.. ఎస్ఐపీల‌ను వెంట‌నే మొద‌లుపెట్టాలి.. అధ్య‌య‌నంలో వెల్ల‌డి..

SIP | సాధార‌ణంగా చాలా మంది పెట్టుబ‌డిదారులు మ్యుచువ‌ల్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (ఎస్‌ఐపీ)ల‌ను ప్రారంభిస్తే మార్కెట్లు ప‌త‌న‌మైన‌ప్పుడు అల‌ర్ట్‌గా ఉండి, తిరిగి రిక‌వ‌ర్ అయ్యే ద‌శ‌లో పెట్టుబ‌డుల‌ను ప్రారంభిస్తుంటారు. దీంతో యూనిట్లు చాలా త‌క్కువ ధ‌ర‌కు వ‌స్తాయ‌ని, ఆ త‌రువాతి కాలంలో రిస్క్ త‌క్కువ‌గా ఉండ‌డంతోపాటు భారీ ఎత్తున లాభం వ‌స్తుంద‌ని భావిస్తుంటారు.

S

Business | Published On Jun 26, 2026, 11.00 am IST

SIP | మార్కెట్లలో క‌రెక్ష‌న్ వ‌చ్చే వ‌ర‌కు వేచి చూడొద్దు.. ఎస్ఐపీల‌ను వెంట‌నే మొద‌లుపెట్టాలి.. అధ్య‌య‌నంలో వెల్ల‌డి..
Advertisement

SIP | సాధార‌ణంగా చాలా మంది పెట్టుబ‌డిదారులు మ్యుచువ‌ల్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (ఎస్‌ఐపీ)ల‌ను ప్రారంభిస్తే మార్కెట్లు ప‌త‌న‌మైన‌ప్పుడు అల‌ర్ట్‌గా ఉండి, తిరిగి రిక‌వ‌ర్ అయ్యే ద‌శ‌లో పెట్టుబ‌డుల‌ను ప్రారంభిస్తుంటారు. దీంతో యూనిట్లు చాలా త‌క్కువ ధ‌ర‌కు వ‌స్తాయ‌ని, ఆ త‌రువాతి కాలంలో రిస్క్ త‌క్కువ‌గా ఉండ‌డంతోపాటు భారీ ఎత్తున లాభం వ‌స్తుంద‌ని భావిస్తుంటారు. అందుక‌నే చాలా మంది మార్కెట్లు ప‌త‌న‌మైనప్పుడు పెట్టుబ‌డి అవ‌కాశాల కోసం చూస్తుంటారు. అయితే ఎస్ఐపీ విష‌యంలో ఆ భావ‌న స‌రైందే అయిన‌ప్పటికీ వేచి ఉండ‌డం క‌న్నా ధ‌ర‌లు ఎక్కువ‌గా ఉన్న‌ప్పుడు పెట్టుబ‌డులు పెట్టినా దీర్ఘ‌కాలంలో అధిక లాభాలు వ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయ‌ని, మార్కెట్ల‌లో క‌రెక్ష‌న్ వ‌చ్చే వ‌రకు వేచి చూడాల్సిన అవ‌స‌రం లేద‌ని, అలా చేస్తే స్వ‌ల్ప మొత్తంలోనే లాభం పెరుగుతుంద‌ని, పెద్ద తేడా ఏమీ ఉండ‌ద‌ని వైట్ ఓక్ క్యాపిట‌ల్ మ్యుచువ‌ల్ ఫండ్ త‌న తాజా అధ్య‌య‌నంలో వెల్ల‌డించింది. మ్యుచువ‌ల్ ఫండ్స్ ఎస్ఐపీల‌ను ఎంత త్వ‌ర‌గా ప్రారంభిస్తే అంత మంచిద‌ని, మార్కెట్‌లో క‌రెక్ష‌న్ వ‌చ్చే వ‌ర‌కు వేచి చూడాల్సిన అవ‌స‌రం లేద‌ని తెలిపింది.

ఊహాత్మ‌క పెట్టుబ‌డిదారుల‌తో పోలిక‌..

వైట్ ఓక్ క్యాపిట‌ల్ ఇటీవ‌ల ఎస్ఐపీ అనాలిసిస్ రిపోర్ట్‌ను విడుద‌ల చేసింది. అందులో 28 సంవ‌త్స‌రాల బీఎస్ఈ సెన్సెక్స్ టీఆర్ఐ డేటాను విశ్లేషించిన వివ‌రాల‌ను వెల్ల‌డించింది. మార్కెట్ గ‌రిష్ట స్థాయిలో ఉన్న‌ప్పుడు ఎస్ఐపీ ప్రారంభించిన పెట్టుబ‌డిదారులు కూడా మార్కెట్ కనిష్ట స్థాయికి వేచి చూసిన వారి కంటే ఎక్కువ సంప‌ద‌ను సృష్టించిన సంద‌ర్భాలు ఉన్నాయ‌ని, అయితే ఎలాంటి ఫండ్స్‌ను ఎంచుకుంటున్నార‌న్న‌దే ముఖ్య‌మ‌ని తెలిపింది. ఈ అధ్య‌య‌నంలో భార‌త ఈక్విటీ మార్కెట్లు గ‌రిష్ట స్థాయి నుంచి 20 శాతానికి పైగా ప‌డిపోయిన నిర్దిష్ట‌మైన కాల వ్య‌వ‌ధుల‌ను ప‌రిశీలించారు. ఇందులో ప్ర‌తి నెల రూ.10వేల చొప్పున ఎస్ఐపీ ప్రారంభించిన ఇద్ద‌రు ఊహాత్మ‌క పెట్టుబ‌డిదారుల‌ను పోల్చారు. ఒక‌రు మార్కెట్ గరిష్ఠ స్థాయిలోనే ఎస్‌ఐపీ ప్రారంభించగా, మరొకరు మార్కెట్ కనిష్ఠ స్థాయికి చేరేవరకు వేచి ఉండి తర్వాత పెట్టుబడులు ప్రారంభించినట్లు పరిగణించారు.

వేచి ఉండ‌డం క‌న్నా వెంట‌నే మొద‌లు పెట్ట‌డం మిన్న‌..

మార్కెట్ కనిష్ఠ స్థాయిలో ప్రారంభించిన ఎస్‌ఐపీలకు కొన్ని సందర్భాల్లో స్వల్పంగా ఎక్కువ శాతం రాబడులు వచ్చినప్పటికీ, ముందుగానే పెట్టుబడులు ప్రారంభించిన వారు ఎక్కువ కాలం మార్కెట్‌లో కొనసాగడం, చక్రవడ్డీ ప్రభావం వల్ల మొత్తం సంపదను గణనీయంగా పెంచుకున్నారని నివేదిక వెల్లడించింది. దీనికి 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాతి కాలాన్ని ప్రధాన ఉదాహరణగా పేర్కొంది. అధ్యయనం ప్రకారం 2008 జనవరిలో మార్కెట్ గరిష్ఠ స్థాయికి సమీపంలో ప్రతి నెల రూ.10వేల ఎస్‌ఐపీ ప్రారంభించిన పెట్టుబడిదారుడు 2026 మే నాటికి మొత్తం రూ.22.1 లక్షలు పెట్టుబడి పెట్టి, తన కార్పస్‌ను రూ.71.63 లక్షలకు పెంచుకున్నాడు. ఈ పెట్టుబడికి ఎక్స్‌ఐఆర్‌ఆర్ 11.58 శాతంగా నమోదైంది. అదే సమయంలో 2009 మార్చిలో, అంటే మార్కెట్ కనిష్ఠ స్థాయికి సమీపంలో ఎస్‌ఐపీ ప్రారంభించిన పెట్టుబడిదారుడు మొత్తం రూ.20.7 లక్షలు మాత్రమే పెట్టుబడి పెట్టి, రూ.61.48 లక్షల కార్పస్‌ను సృష్టించాడు. ఈ పెట్టుబడికి ఎక్స్‌ఐఆర్‌ఆర్ 11.54 శాతంగా నమోదైంది. అంటే రెండు పెట్టుబడులకు వచ్చిన వార్షిక రాబడి దాదాపు సమానంగానే ఉన్నప్పటికీ, ముందుగా ప్రారంభించిన పెట్టుబడిదారుడు గణనీయంగా ఎక్కువ సంపదను కూడబెట్టాడు.

దీర్ఘ‌కాలంలో ఆల‌స్యం చేస్తే భారీ మూల్యం..

దీర్ఘకాలంలో ఆలస్యం చేయడం వల్ల భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని నివేదిక పేర్కొంది. మార్కెట్ కరెక్షన్ కోసం ఎంత ఎక్కువ కాలం వేచి ఉంటే, అంత ఎక్కువ చక్రవడ్డీ ప్రయోజనాన్ని కోల్పోయే అవకాశం ఉంటుందని వివరించింది. మార్కెట్‌లోకి ప్రవేశించే సరైన సమయాన్ని గుర్తించే ప్రయత్నం కంటే, ఎక్కువ కాలం మార్కెట్‌లో కొనసాగడమే సంపద సృష్టిలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొంది. అలాగే ఎస్‌ఐపీ పనితీరు దీర్ఘకాల హోల్డింగ్‌లో మరింత స్థిరంగా ఉంటుందని నివేదిక వెల్లడించింది. 1996 నుంచి 2026 వరకు సెన్సెక్స్ టీఆర్‌ఐ రోలింగ్ రిటర్న్స్‌ను పరిశీలించగా, చారిత్రాత్మకంగా ప్రతి 8, 10, 12, 15 సంవత్సరాల ఎస్‌ఐపీ కాలాల్లో సానుకూల రాబడులే నమోదైనట్లు విశ్లేషణ తెలిపింది. భారత మ్యుచువల్ ఫండ్లలో ఎస్‌ఐపీ ద్వారా పెట్టుబడుల ప్రవాహం మార్కెట్ ఒడిదుడుకుల మధ్య కూడా బలంగా కొనసాగుతున్న సమయంలో వైట్‌ఓక్ ఈ అధ్యయనాన్ని విడుదల చేసింది. పెట్టుబడిదారుల క్రమశిక్షణ, ముందుగానే పెట్టుబడులు ప్రారంభించడం వంటి అంశాలు మార్కెట్ టైమింగ్ కంటే ఎంతో ముఖ్యమని నివేదిక స్పష్టం చేసింది.

Advertisement
Advertisement