త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SIP | బ్యాంకు ఎఫ్‌డీ, ఎస్ఐపీ.. రెండింటిలో ఏది ఉత్త‌మ‌మైన పెట్టుబ‌డి మార్గం..?

SIP | దీర్ఘ‌కాలంలో సంప‌ద‌ను సృష్టించేందుకు ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న అనేక పెట్టుబ‌డి మార్గాల్లో మ్యుచువ‌ల్ ఫండ్స్ ఎస్ఐపీ చాలా ఉత్త‌మ‌మైన మార్గంగా చెప్ప‌వ‌చ్చు. గ‌తంలో ఎస్ఐపీల‌లో పెట్టుబ‌డులు పెట్టేందుకు ప్ర‌జ‌లు జంకే వారు. కానీ దీర్ఘ‌కాలంలో అవి అందిస్తున్న లాభాల‌ను గురించి స్వ‌యంగా తెలుసుకుంటున్న చాలా మంది వాటిల్లో పెట్టుబ‌డులు పెడుతున్నారు.

S

Business | Published On Jun 3, 2026, 12.38 pm IST

SIP | బ్యాంకు ఎఫ్‌డీ, ఎస్ఐపీ.. రెండింటిలో ఏది ఉత్త‌మ‌మైన పెట్టుబ‌డి మార్గం..?
Advertisement

SIP | దీర్ఘ‌కాలంలో సంప‌ద‌ను సృష్టించేందుకు ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న అనేక పెట్టుబ‌డి మార్గాల్లో మ్యుచువ‌ల్ ఫండ్స్ ఎస్ఐపీ చాలా ఉత్త‌మ‌మైన మార్గంగా చెప్ప‌వ‌చ్చు. గ‌తంలో ఎస్ఐపీల‌లో పెట్టుబ‌డులు పెట్టేందుకు ప్ర‌జ‌లు జంకే వారు. కానీ దీర్ఘ‌కాలంలో అవి అందిస్తున్న లాభాల‌ను గురించి స్వ‌యంగా తెలుసుకుంటున్న చాలా మంది వాటిల్లో పెట్టుబ‌డులు పెడుతున్నారు. అందుక‌నే అనేక ఆర్థిక సంస్థ‌లు, బ్రోక‌రేజీ ప్లాట్‌ఫామ్‌లు భిన్న ర‌కాల మ్యుచువ‌ల్ ఫండ్స్‌ను ప్ర‌జ‌ల‌కు అందిస్తున్నాయి. ఎస్ఐపీ ని చాలా మంది అత్యంత సుర‌క్షిత‌మైన మార్గంగా కూడా భావిస్తుంటారు. ఎందుకంటే ఇందులో ఒకేసారి లంప్‌స‌మ్ పెట్ట‌డం ఉండ‌దు. నెల నెలా కొద్దిగా పొదుపు చేస్తారు. దీని వ‌ల్ల స్వ‌ల్ప‌కాలంలో మార్కెట్ల‌లో ఎదుర‌య్యే ఒడిదుడుకుల‌ను త‌ట్టుకుని నిల‌బ‌డ‌డం సుల‌భ‌త‌రం అవుతుంది. అయితే ఎస్ఐపీ ద్వారా నెల నెలా కొంత నిర్దిష్ట మొత్తాన్ని పెట్టుబ‌డిగా పెట్ట‌డం వ‌ల్ల ఆర్థిక క్ర‌మ శిక్ష‌ణ కూడా అల‌వ‌డుతుంది. ప్రారంభ సంవ‌త్స‌రాల‌తో పోలిస్తే ఎస్ఐపీ వ్య‌వ‌ధి పెరుగుతున్న కొద్దీ కాంపౌండింగ్ ప్ర‌భావం వ‌ల్ల రాబ‌డి అత్యంత వేగంగా పెరుగుతుంది. అయితే ఎస్ఐపీ ద్వారా అలా భారీ రాబ‌డి పొందాలంటే స్థిరంగా పెట్టుబ‌డుల‌ను పెట్ట‌డంతోపాటు, రిటైర్మెంట్ వ‌య‌స్సు వ‌ర‌కు ఎంత ఫండ్ కావాలో ముందే నిర్ణ‌యించుకోవాల్సి ఉంటుంది. దీంతో ఆశించిన స్థాయిలో ఫ‌లితం ల‌భిస్తుంది.

ఎస్ఐపీతో ఎంతో మేలు..

ఎస్ఐపీ కోసం బ్యాంకులో ఆటో డెబిట్ అయ్యేలా స‌దుపాయాన్ని ఎంచుకుంటే ప్ర‌తి నెలా నిర్దిష్ట మొత్తం నేరుగా బ్యాంకు నుంచి వినియోగ‌దారుడి మ్యుచువ‌ల్ ఫండ్ ఖాతాలో జ‌మ అవుతుంది. అనంత‌రం బ్రోక‌రేజీ ప్లాట్‌ఫామ్‌లు ఆ ఎస్ఐపీని దృష్టిలో ఉంచుకుని స‌ద‌రు మొత్తానికి త‌గిన విధంగా ప్ర‌స్తుత మార్కెట్ రేట్‌ను బ‌ట్టి ఫండ్‌కు చెందిన యూనిట్ల‌ను కేటాయిస్తారు. ఇలా నెల నెలా జ‌రుగుతుంది. అయితే మార్కెట్లు కాస్త ప‌త‌నం అయిన‌ప్పుడు త‌క్కువ ధ‌ర‌కే యూనిట్లు ల‌భిస్తాయి. త‌రువాత మ‌ళ్లీ మార్కెట్లు పుంజుకుంటే రాబ‌డి వేగంగా పెరుగుతుంది. అందుక‌నే ఎస్ఐపీ అత్యంత అధికంగా ప్రాచుర్యం పొందింది. ఇక దీర్ఘ‌కాలంలో మార్కెట్లలో ఉండే హెచ్చు త‌గ్గుల‌ను బ‌ట్టి ఫండ్‌కు చెందిన యూనిట్ల ధ‌ర మారుతుంది. కానీ ఒకే రోజు ఫండ్ విలువ మొత్తం భారీగా ప‌త‌నం అవ‌దు. ఎందుకంటే ఫండ్‌లో అనేక విభాగాల్లో మేనేజ‌ర్లు పెట్టుబ‌డులు పెట్టి ఉంటారు. క‌నుక ఫండ్ యూనిట్ల ధ‌ర భారీగా ప‌త‌న‌మ‌వుతుంద‌ని అనుకోకూడ‌దు. కానీ స్వ‌ల్ప‌కాలంలో ఫండ్ యూనిట్ల ధ‌ర మార్కెట్ల క్షీణ‌త‌ను బ‌ట్టి త‌గ్గే అవ‌కాశాలు ఉంటాయి. ఇక దీర్ఘ‌కాలంలో ఒకేసారి పెట్టుబ‌డి పెట్ట‌డం కంటే ఎస్ఐపీ ద్వారా నెల నెలా చిన్న చిన్న మొత్తాలో మ్యుచువ‌ల్ ఫండ్ యూనిట్ల‌ను కొనుగోలు చేస్తేనే ఎక్కువ మేలు జ‌రుగుతుంద‌ని, రిస్క్ త‌క్కువ‌గా ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

ఏ వ‌య‌స్సులో ఎంత పెడితే..

27 ఏళ్ల వ‌య‌స్సులో ఉన్న వ్య‌క్తి త‌న రిటైర్మెంట్ కోసం ప్ర‌ణాళిక ర‌చించి నెల‌కు రూ.5వేల‌ను 30 సంవ‌త్స‌రాల పాటు ఎస్ఐపీలో పెడితే 12 శాతం వార్షిక రాబడి అనుకుంటే కార్ప‌స్ రూ.1.76 కోట్ల‌కు చేరుతుంది. ఇందులో పెట్టుబ‌డి కేవ‌లం రూ.18 ల‌క్ష‌లే. కానీ రాబ‌డి మాత్రం రూ.1.58 కోట్ల‌కు పైగా ఉంటుంది. ఇది కాంపౌండింగ్ వ‌ల్ల క‌లిగే అతి పెద్ద ప్రయోజ‌నం. ఇక ఎస్ఐపీలో మ‌రిన్ని ఎక్కువ‌గా పెట్టుబ‌డులు పెడితే, అంటే నెల‌కు రూ.10వేల‌ను పెడితే 30 ఏళ్ల‌కు ఏకంగా రూ.3.53 కోట్ల కార్ప‌స్ నిర్మాణ‌మ‌వుతుంది. ఇందులో పెట్టుబ‌డి రూ.36 ల‌క్ష‌లు అయితే రాబ‌డి రూ.3.17 కోట్లుగా ఉంటుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌కు బ‌దులుగా నెల‌కు రూ.15వేల‌ను ఎస్ఐపీలో పెడితే 30 ఏళ్ల త‌రువాత ఆ మొత్తం రూ.5.29 కోట్ల ఫండ్‌ను నిర్మిస్తుంది. ఇందులో పెట్టుబ‌డి రూ.54 ల‌క్ష‌లు అయితే రాబ‌డి రూ.4.75 కోట్లుగా ఉంటుంది.

బ్యాంకు ఎఫ్‌డీతో పోలిస్తే..

బ్యాంక్ ఎఫ్‌డీలు చాలా సుర‌క్షిత‌మే అయినా వాటిపై వ‌చ్చే రాబ‌డి ద్ర‌వ్యోల్బ‌ణాన్ని అధిగమించ‌లేదు. ఉదాహ‌ర‌ణ‌కు రూ.60వేల‌ను ఎఫ్‌డీ వేస్తే 6.25 శాతం స‌గ‌టు వ‌డ్డీ రేట‌తో 30 ఏళ్ల‌కు కేవ‌లం రూ.3.29 ల‌క్ష‌ల వ‌డ్డీ మాత్ర‌మే వ‌స్తుంది. దీంతో మొత్తం చేతికి వ‌చ్చేది రూ.3.89 ల‌క్ష‌లే. అందువ‌ల్ల దీర్ఘ‌కాలంలో భారీ మొత్తంలో సంప‌ద‌ను సృష్టించేందుకు ఎస్ఐపీ ఒక కీల‌క‌మైన పెట్టుబ‌డి మార్గంగా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. చేతిలో భారీ మొత్తం లేక‌పోయినా నెల నెలా ఎస్ఐపీ ద్వారా పెట్ట‌డం అనే ఒక వెసులు బాటు ఉండ‌డంతో ఏ త‌ర‌గ‌తికి చెందిన వినియోగ‌దారులు అయినా స‌రే సుల‌భంగా ఎస్ఐపీల‌లో పెట్టుబ‌డులు పెట్టవ‌చ్చు. క‌నీసం 10 నుంచి 15 ఏళ్ల పాటు ఓపిక‌గా పెట్టుబ‌డిని కొన‌సాగించాలి. ఏదైనా అత్య‌వ‌స‌ర ఖ‌ర్చులు వ‌స్తే అందుకు ముందుగానే ఎమ‌ర్జెన్సీ ఫండ్‌ను ప‌క్కన పెట్టుకోవాలి. దీంతో ఆయా స‌మ‌యాల్లో ఎస్ఐపీల‌ను బ్రేక్ చేయ‌కుండా ఉండ‌వ‌చ్చు. అయితే వార్షికంగా ఆదాయం పెరిగే కొద్దీ ఎస్ఐపీ మొత్తాన్ని కూడా పెంచుతూ పోతే ఇంకా త‌క్కువ కాలంలో భారీ ఎత్తున కార్ప‌స్ నిర్మాణ‌మ‌వుతుంది. అందువ‌ల్ల ఎస్ఐపీల‌లో పెట్టుబ‌డులు పెట్ట‌డం దీర్ఘ‌కాల సంప‌ద సృష్టికి ఎంతో మేలు చేస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. మ్యుచువ‌ల్ ఫండ్స్‌లో పెట్టుబ‌డులు పెట్టే ముందు నిపుణుల స‌ల‌హా తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే న‌ష్టాలు వ‌చ్చే ప్ర‌మాదం ఉంటుంది.

Advertisement
Advertisement