త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

July 2026 Financial Changes | జూలై నుంచి మారనున్న నిబంధనలు.. ఉద్యోగులు, పన్ను చెల్లింపుదారులు తెలుసుకోవాల్సినవి..

July 2026 Financial Changes | జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా జీతభత్యాలు పొందే ఉద్యోగులు, పన్ను చెల్లింపుదారులు, క్రెడిట్ కార్డు వినియోగదారులు, పెన్షనర్లపై ప్రభావం చూపే పలు కీలక ఆర్థిక మార్పులు అమల్లోకి రానున్నాయి.

S

Business | Published On Jun 26, 2026, 1.13 pm IST

July 2026 Financial Changes | జూలై నుంచి మారనున్న నిబంధనలు.. ఉద్యోగులు, పన్ను చెల్లింపుదారులు తెలుసుకోవాల్సినవి..
Advertisement

July 2026 Financial Changes | జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా జీతభత్యాలు పొందే ఉద్యోగులు, పన్ను చెల్లింపుదారులు, క్రెడిట్ కార్డు వినియోగదారులు, పెన్షనర్లపై ప్రభావం చూపే పలు కీలక ఆర్థిక మార్పులు అమల్లోకి రానున్నాయి. ఈపీఎఫ్‌వో యూపీఐ ఆధారిత పీఎఫ్ విత్‌డ్రా సౌకర్యం, క్రెడిట్ కార్డు బెనిఫిట్లలో మార్పులు, ఆదాయపు పన్ను రిటర్నుల గడువులు త‌దిత‌ర‌ అంశాలపై ముందుగానే అవగాహన కలిగి ఉంటే చివరి నిమిషంలో ఇబ్బందుల‌ను తప్పించుకోవచ్చు. పన్ను దాఖలు, బ్యాంకింగ్ లావాదేవీలు, ఆర్థిక ప్రణాళికలు సజావుగా సాగేందుకు ఈ తాజా మార్పులను తెలుసుకోవాల్సి ఉంటుంది.

ఐటీఆర్ దాఖలు గడువులు..

2025-26 ఆర్థిక సంవత్సరానికి (అసెస్‌మెంట్ ఇయర్ 2026-27) సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుపై పన్ను చెల్లింపుదారులు ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఐటీఆర్-1, ఐటీఆర్-2 ఫామ్‌ల‌ను దాఖలు చేసే వ్యక్తులకు చివరి తేదీ జూలై 31. ఐటీఆర్-3, ఐటీఆర్-4 ఫామ్‌ల‌ను దాఖలు చేసే, ట్యాక్స్ ఆడిట్‌కు లోబడని పన్ను చెల్లింపుదారులు ఆగస్టు 31 వరకు రిటర్నులు సమర్పించుకోవచ్చు. గడువులోగా రిటర్నులు దాఖలు చేయకపోతే జరిమానాలు విధించే అవకాశం ఉండటంతోపాటు కొన్ని ట్యాక్స్ విధానాలను ఎంచుకునే అవకాశాన్ని కోల్పోతారు. అలాగే అర్హత కలిగిన నష్టాలను భవిష్యత్ అసెస్‌మెంట్ సంవత్సరాలకు క్యారీ ఫార్వర్డ్ చేసుకునే హక్కుపైనా ప్రభావం పడుతుంది.

ఈపీఎఫ్‌వో 3.0లో యూపీఐ ద్వారా పీఎఫ్ ఉపసంహరణ..

ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఈపీఎఫ్‌వో 3.0 ప్లాట్‌ఫామ్ ప్రారంభానికి జూలైలో అడుగులు పడే అవకాశం ఉంద‌ని తెలుస్తోంది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ డిజిటల్ వ్యవస్థను ఆధునికీకరించే లక్ష్యంతో ఈ కొత్త వ్యవస్థను తీసుకువస్తోంది. దీని ద్వారా ఈపీఎఫ్ సభ్యులు యూపీఐ ప్లాట్‌ఫామ్ ద్వారా తక్షణమే పీఎఫ్ మొత్తాన్ని ఉపసంహరించుకునే సౌకర్యాన్ని పొందే అవకాశం ఉంటుంది. దీంతో పీఎఫ్ విత్‌డ్రా ప్రక్రియ మరింత వేగవంతం కానుంది.

డియర్‌నెస్ అలవెన్స్ పెంపుపై ఎదురుచూపులు..

జూలైలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు సంబంధించిన మరో కీలక అంశం డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) సవరణ. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం జనవరి, జూలై నెలల్లో డీఏను సమీక్షించి సవరిస్తుంది. ఈసారి కూడా లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు డీఏ పెంపుపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులకు కొత్త నిబంధనలు..

జూలై నుంచి క్రెడిట్ కార్డు వినియోగదారులకు కూడా మార్పులు అమల్లోకి రానున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన రెగాలియా గోల్డ్, డైనర్స్ క్లబ్ ప్రివిలేజ్ క్రెడిట్ కార్డుల రివార్డ్ పాయింట్ల విధానంలో ఇప్పటికే మార్పులు చేసింది. జూలై 1 నుంచి ఎయిర్‌పోర్ట్ లౌంజ్ యాక్సెస్ నిబంధనలు కూడా మారనున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం రెగాలియా గోల్డ్ కార్డు హోల్డర్లు ఉచిత దేశీయ ఎయిర్‌పోర్ట్ లౌంజ్ సదుపాయం పొందాలంటే గత త్రైమాసికంలో కనీసం రూ.60వేలు ఖర్చు చేసి ఉండాలి.

ఎస్‌బీఐ కార్డులో రివార్డ్ పాయింట్లకు పరిమితులు..

ఎస్‌బీఐ కార్డ్ కూడా తన ఫోన్‌పే ఎస్‌బీఐ కార్డ్ పర్పుల్, ఫోన్‌పే ఎస్‌బీఐ కార్డ్ సెలెక్ట్ బ్లాక్ వేరియంట్లకు మార్పులను ప్రకటించింది. జూలై 1 నుంచి వినియోగదారులు ప్రతి నెల సంపాదించగలిగే రివార్డ్ పాయింట్లకు పరిమితి విధించనుంది. ఇన్సూరెన్స్ ఖర్చులకు ప్రత్యేక పరిమితి, ఇతర ఖర్చులకు వేర్వేరు పరిమితులు అమలులో ఉంటాయి. అలాగే ఆన్‌లైన్ లావాదేవీలపై పొందే గరిష్ట‌ రివార్డ్ పాయింట్ల సంఖ్యను కూడా తగ్గించింది.

Advertisement
Advertisement