త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ITR | ఎఫ్‌డీల ద్వారా వ‌చ్చే ఆదాయంపై ప‌న్ను చెల్లించాలా.. ఐటీఆర్‌లో ఎలా నమోదు చేయాలి..?

ITR | ఆర్థిక సంవత్సరం 2025-26లో ఫిక్స్‌డ్ డిపాజిట్ల (ఎఫ్‌డీ)లో పెట్టుబడి పెట్టి వాటిపై వడ్డీ పొందినట్లయితే, ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) దాఖలు చేసే సమయంలో ఆ వివరాలను తప్పనిసరిగా వెల్లడించాలి. జీతం లేదా వ్యాపార ఆదాయం మాత్రమే కాకుండా, ఎఫ్‌డీపై వచ్చిన వడ్డీ కూడా పన్ను పరిధిలోకి వస్తుంది.

S

Business | Published On Jul 20, 2026, 3.30 pm IST

ITR | ఎఫ్‌డీల ద్వారా వ‌చ్చే ఆదాయంపై ప‌న్ను చెల్లించాలా.. ఐటీఆర్‌లో ఎలా నమోదు చేయాలి..?
Advertisement

ITR | ఆర్థిక సంవత్సరం 2025-26లో ఫిక్స్‌డ్ డిపాజిట్ల (ఎఫ్‌డీ)లో పెట్టుబడి పెట్టి వాటిపై వడ్డీ పొందినట్లయితే, ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) దాఖలు చేసే సమయంలో ఆ వివరాలను తప్పనిసరిగా వెల్లడించాలి. జీతం లేదా వ్యాపార ఆదాయం మాత్రమే కాకుండా, ఎఫ్‌డీపై వచ్చిన వడ్డీ కూడా పన్ను పరిధిలోకి వస్తుంది. ఒకవేళ ఐటీఆర్‌లో ఎఫ్‌డీ వడ్డీ ఆదాయాన్ని చూపించకపోతే, ఆదాయపు పన్ను శాఖ రికార్డులు, ఐటీఆర్ మధ్య వ్యత్యాసం ఏర్పడే అవకాశం ఉంటుంది. దీంతో ట్యాక్స్ నోటీసులు రావడం లేదా రీఫండ్ ఆలస్యం కావడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వచ్చిన వడ్డీని ఇన్‌కమ్ ఫ్రం అదర్ సోర్సెస్ కింద చూపించాలి. ఈ మొత్తాన్ని పూర్తి ఆదాయానికి జోడించి ఆ త‌రువాత వర్తించే ట్యాక్స్ స్లాబ్ ప్రకారం పన్ను లెక్కిస్తారు.

సెక్ష‌న్ 80సి కింద మిన‌హాయింపు..

ఐటీఆర్ దాఖలు చేసే ముందు మొత్తం ఆర్థిక సంవత్సరంలో ఎఫ్‌డీలపై ఎంత వడ్డీ వచ్చిందో తెలుసుకోవడం అవసరం. ఇందుకోసం బ్యాంక్ స్టేట్‌మెంట్, ఫారం 26ఏఎస్, యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్ (ఏఐఎస్), ట్యాక్స్‌పేయర్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్ (టీఐఎస్) వంటి పత్రాలను ఉపయోగించవచ్చు. వీటిలో చాలా వివరాలు ఆదాయపు పన్ను శాఖ ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో కూడా అందుబాటులో ఉంటాయి. పాత పన్ను విధానం (ఓల్డ్ ట్యాక్స్ రీజీమ్) ఎంచుకుని ఐదేళ్ల ట్యాక్స్ సేవింగ్ ఎఫ్‌డీలో పెట్టుబడి పెట్టి ఉంటూ సెక్షన్ 80సి కింద గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. అయితే ఈ మినహాయింపు కేవలం పెట్టుబడి చేసిన అసలు మొత్తానికే వర్తిస్తుంది. ఎఫ్‌డీపై వచ్చిన వడ్డీ మాత్రం పూర్తిగా పన్ను పరిధిలోనే ఉంటుంది.

ప‌రిమితి ఎంత‌..

పాత పన్ను విధానం ఎంచుకున్న నివాస సీనియర్ సిటిజన్లు సెక్షన్ 80టీటీబీ కింద సేవింగ్స్ అకౌంట్, ఎఫ్‌డీ, ఆర్‌డీ వడ్డీపై కలిపి గరిష్టంగా రూ.50వేల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. అయితే ఈ మినహాయింపు వాస్తవంగా వచ్చిన వడ్డీ మొత్తాన్ని మించదు. ఎఫ్‌డీ వడ్డీపై చెల్లించాల్సిన పన్ను ఎంచుకున్న ట్యాక్స్ రీజీమ్, వయస్సు, నివాస హోదాపై ఆధారపడి ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 194ఎ ప్రకారం బ్యాంకులు ఎఫ్‌డీ వడ్డీపై 10 శాతం టీడీఎస్ మినహాయిస్తాయి. సాధారణ పన్ను చెల్లింపుదారుల విషయంలో ఒక ఆర్థిక సంవత్సరంలో ఎఫ్‌డీ వడ్డీ రూ.50వేలు దాటితే టీడీఎస్ కట్ చేస్తారు. నివాస సీనియర్ సిటిజన్లకు ఈ పరిమితి రూ.1 లక్షగా ఉంది. బ్యాంకుకు పాన్ వివరాలు ఇవ్వకపోతే, టీడీఎస్ 20 శాతం వరకు మినహాయించే అవకాశం ఉంటుంది.

రీఫండ్ కోర‌వ‌చ్చు..

ఎఫ్‌డీ వడ్డీపై టీడీఎస్ కట్ అయితే, ఐటీఆర్ దాఖలు చేసే సమయంలో ఆ మొత్తాన్ని పూర్తి పన్ను బాధ్యతకు సర్దుబాటు చేసుకోవచ్చు. ఒకవేళ చెల్లించాల్సిన పన్ను కంటే ఎక్కువ టీడీఎస్ కట్ అయి ఉంటే, అదనంగా కట్ చేసిన మొత్తాన్ని రీఫండ్ రూపంలో తిరిగి పొందే అవకాశం ఉంటుంది. అలాగే మొత్తం ఆదాయం పన్ను పరిధిలోకి రాకపోతే, ఎఫ్‌డీపై టీడీఎస్ కట్ కాకుండా బ్యాంకుకు డిక్లరేషన్ సమర్పించవచ్చు. గతంలో ఇందుకోసం ఫామ్ 15జి, ఫామ్‌ 15హెచ్ ఉపయోగించేవారు. అయితే కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 అమల్లోకి వచ్చిన తర్వాత ఈ రెండు ఫామ్‌లను ఫామ్ 121తో భర్తీ చేశారు.

Advertisement
Advertisement