త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kisan Vikas Patra | రూ.2 లక్షలు పెట్టుబడి.. కేవీపీ లేదా ఎఫ్‌డీ? ఏది ఎక్కువ లాభదాయకం?

Kisan Vikas Patra | రెండున్నరేళ్ల కాలానికి రూ.2 లక్షలు పెట్టుబడి పెట్టాలనుకునే వారికి కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ), ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) రెండూ స్థిరమైన రాబడిని అందించే పెట్టుబడి మార్గాలు. కేవీపీకి ప్రభుత్వం మద్దతు ఉండగా, బ్యాంకు ఎఫ్‌డీలలో పెట్టుబడి కాలం, వడ్డీ చెల్లింపు విధానం ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే పెట్టుబడిని మధ్యలో వెనక్కి తీసుకోవాల్సి వస్తే ఎఫ్‌డీ మెరుగైన ఎంపిక అవుతుంది.

S

Business | Published On Nov 18, 2026, 5.13 pm IST

Kisan Vikas Patra | రూ.2 లక్షలు పెట్టుబడి.. కేవీపీ లేదా ఎఫ్‌డీ? ఏది ఎక్కువ లాభదాయకం?
Advertisement

Kisan Vikas Patra | రెండున్నరేళ్ల కాలానికి రూ.2 లక్షలు పెట్టుబడి పెట్టాలనుకునే వారికి కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ), ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) రెండూ స్థిరమైన రాబడిని అందించే పెట్టుబడి మార్గాలు. కేవీపీకి ప్రభుత్వం మద్దతు ఉండగా, బ్యాంకు ఎఫ్‌డీలలో పెట్టుబడి కాలం, వడ్డీ చెల్లింపు విధానం ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే పెట్టుబడిని మధ్యలో వెనక్కి తీసుకోవాల్సి వస్తే ఎఫ్‌డీ మెరుగైన ఎంపిక అవుతుంది.

కేవీపీ అంటే..?

దేశంలో సురక్షితమైన పెట్టుబడులను కోరుకునే వారికి కిసాన్ వికాస్ పత్ర, ఫిక్స్‌డ్ డిపాజిట్లు ప్రముఖంగా ఉన్నాయి. కేవీపీ అంటే కేంద్ర ప్రభుత్వ మద్దతుతో అమలయ్యే చిన్న మొత్తాల పొదుపు పథకం. ఇందులో ప్రస్తుతం ఏడాదికి 7.5 శాతం వడ్డీ లభిస్తోంది. ఈ వడ్డీని ఏటా చక్రవడ్డీ పద్ధతిలో లెక్కిస్తారు. ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం పెట్టుబడి మొత్తం 115 నెలల్లో రెట్టింపు అవుతుంది. కనీస పెట్టుబడి మొత్తం నిర్దిష్ట డినామినేషన్‌లో అందుబాటులో ఉండగా, గరిష్ఠ పెట్టుబడిపై పరిమితి లేదు. పోస్టాఫీసులు, అధీకృత బ్యాంకుల ద్వారా ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. అయితే కనీస లాక్-ఇన్ వ్యవధి రెండున్నరేళ్లు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సి కింద పన్ను మినహాయింపు ఉండదు. ఈ పథకం ద్వారా వచ్చే వడ్డీ కూడా పన్ను పరిధిలోకి వస్తుంది. సర్టిఫికెట్‌ను మరొకరికి లేదా ఒక పోస్టాఫీసు నుంచి మరో పోస్టాఫీసుకు బదిలీ చేసుకునే అవకాశం ఉంది.

ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌తో ఎంత వ‌డ్డీ..?

ఫిక్స్‌డ్ డిపాజిట్ల విషయానికి వస్తే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు వీటిని అందిస్తున్నాయి. కనీసం వారం రోజుల నుంచి గరిష్ఠంగా పదేళ్ల వరకు పెట్టుబడి వ్యవధిని ఎంచుకోవచ్చు. నెలవారీ లేదా త్రైమాసిక ప్రాతిపదికన వడ్డీ పొందే సదుపాయం కూడా ఉంటుంది. సాధారణ పొదుపు ఖాతాలతో పోలిస్తే ఎఫ్‌డీలపై అధిక వడ్డీ లభిస్తుంది. సీనియర్ సిటిజన్లకు సాధారణ ఖాతాదారులతో పోలిస్తే అదనంగా 0.50 నుంచి 0.75 శాతం వరకు వడ్డీ అందించే బ్యాంకులు ఉన్నాయి. అవసరమైతే ఎఫ్‌డీపై రుణం లేదా ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయం పొందవచ్చు. సాధారణంగా డిపాజిట్ విలువలో 85 నుంచి 90 శాతం వరకు రుణం లభిస్తుంది. ముందస్తుగా డిపాజిట్‌ను ఉపసంహరించుకునే అవకాశం ఉన్నప్పటికీ, బ్యాంకులు జరిమానా విధిస్తాయి.

రూ.2 లక్షలు కేవీపీలో పెడితే ఎంత వస్తుంది?

ప్రస్తుత 7.5 శాతం వార్షిక వడ్డీ రేటు ప్రకారం రెండున్నరేళ్లకు రూ.2 లక్షలు పెట్టుబడి పెడితే అంచనా వడ్డీ ఆదాయం రూ.39,635గా ఉంటుంది. దీంతో పెట్టుబడి గడువు ముగిసే సమయానికి మొత్తం విలువ రూ.2,39,635కు చేరుతుంది. అయితే కేవీపీలో రెండున్నరేళ్ల లాక్-ఇన్ నిబంధన ఉండడంతో అత్యవసర అవసరాలకు నగదు అందుబాటులో ఉండే అంశాన్ని ముందుగానే పరిశీలించాలి. ఎక్కువ వెసులుబాటు కావాలనుకునే వారికి ఎఫ్‌డీ అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు ప్రముఖ బ్యాంకులు అందిస్తున్న తాజా ఎఫ్‌డీ వడ్డీ రేట్లు, ముందస్తు ఉపసంహరణపై జరిమానాలను పరిశీలించడం అవసరం.

Advertisement
Advertisement