త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ITR | షేర్ మార్కెట్‌లో నష్టం వచ్చినా ఐటీఆర్‌ను దాఖ‌లు చేయాల్సిందేనా..?

ITR | షేర్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టి ఆర్థిక సంవత్సరంలో నష్టాలు ఎదుర్కొన్న చాలామంది పెట్టుబడిదారులు, తమకు ఇతర పన్ను విధించదగిన ఆదాయం లేకపోతే ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ (ఐటీఆర్) దాఖలు చేయాల్సిన అవసరం లేదని భావిస్తుంటారు.

S

Business | Published On Jun 27, 2026, 3.57 pm IST

ITR | షేర్ మార్కెట్‌లో నష్టం వచ్చినా ఐటీఆర్‌ను దాఖ‌లు చేయాల్సిందేనా..?
Advertisement

ITR | షేర్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టి ఆర్థిక సంవత్సరంలో నష్టాలు ఎదుర్కొన్న చాలామంది పెట్టుబడిదారులు, తమకు ఇతర పన్ను విధించదగిన ఆదాయం లేకపోతే ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ (ఐటీఆర్) దాఖలు చేయాల్సిన అవసరం లేదని భావిస్తుంటారు. అయితే పన్ను నిపుణులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం, నష్టాలు వచ్చిన సంవత్సరంలో ఐటీఆర్ దాఖలు చేయకుండా వదిలేయడం భవిష్యత్తులో భారీ నష్టానికి దారితీస్తుంది. నిర్ణీత గడువులోపు ఐటీఆర్ దాఖలు చేయకపోతే, క్యాపిటల్ లాస్‌ను భవిష్యత్ సంవత్సరాలకు తీసుకెళ్లే (క్యారీ ఫార్వర్డ్) హక్కును కోల్పోతారు. దీంతో తర్వాత వచ్చే క్యాపిటల్ గెయిన్స్‌పై ఆ నష్టాలను సర్దుబాటు చేసుకునే అవకాశం లేకుండా పోతుంది. ఫలితంగా రాబోయే సంవత్సరాల్లో ఎక్కువ పన్ను చెల్లించాల్సిన‌ పరిస్థితి ఏర్పడుతుంది.

ఐటీఆర్ దాఖ‌లు చేయాలా..?

ఎన్‌ఏ షా అసోసియేట్స్‌లో పార్ట్‌నర్-ట్యాక్స్ గోపాల్ బోహ్రా మాట్లాడుతూ ఒక పన్ను చెల్లింపుదారుడికి పన్ను విధించదగిన ఆదాయం లేకపోయినా, షేర్లు లేదా మ్యూచువల్ ఫండ్లలో క్యాపిటల్ లాస్ మాత్రమే వచ్చినా కూడా నిర్ణీత గడువులోపు ఐటీఆర్ దాఖలు చేయడం ఎంతో ప్రయోజనకరమని చెప్పారు. అలా చేస్తే ఆ నష్టాలను గరిష్టంగా ఎనిమిది సంవత్సరాల వరకు క్యారీ ఫార్వర్డ్ చేసుకునే హక్కు లభిస్తుందని, భవిష్యత్తులో వచ్చే క్యాపిటల్ గెయిన్స్‌తో వాటిని సర్దుబాటు చేసుకుని పన్ను భారం తగ్గించుకోవచ్చని వివరించారు. ఈ నిబంధన ఈక్విటీ, డెట్ మ్యూచువల్ ఫండ్లు లేదా గోల్డ్ ఈటీఎఫ్‌లకు వేర్వేరుగా ఉంటుందా అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇచ్చారు. పెట్టుబడి ఏ రూపంలో ఉన్నా నిబంధన ఒకటేనని తెలిపారు. ఈక్విటీ షేర్లు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు, డెట్ మ్యూచువల్ ఫండ్లు, గోల్డ్ ఈటీఎఫ్‌లు లేదా ఇతర క్యాపిటల్ ఆస్తుల వల్ల నష్టం వచ్చినా, ఆ నష్టాలను భవిష్యత్తుకు తీసుకెళ్లాలంటే తప్పనిసరిగా నిర్ణీత గడువులోపు ఐటీఆర్ దాఖలు చేయాల్సిందే. గడువు దాటిన తర్వాత రిటర్న్ దాఖలు చేస్తే, ఆ నష్టాలను భవిష్యత్తులో సర్దుబాటు చేసుకునే అవకాశం ఉండదు.

ఏయే ఆస్తుల లాభాల‌తో స‌ర్దుబాటు చేయ‌వ‌చ్చు..

ఈక్విటీలో వచ్చిన క్యాపిటల్ లాస్‌ను ఇతర ఆస్తులపై వచ్చిన లాభాలతో సర్దుబాటు చేసుకోవచ్చా అనే అంశంపై కూడా వివరణ ఇచ్చారు. ఈక్విటీలో వచ్చిన షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్‌ను షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌తో పాటు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌పైనా సర్దుబాటు చేసుకోవచ్చు. ఈ లాభాలు షేర్లు, స్థిరాస్తి, బంగారం, డెట్ మ్యూచువల్ ఫండ్లు లేదా ఇతర క్యాపిటల్ ఆస్తుల నుంచి వచ్చినా ఈ సౌకర్యం వర్తిస్తుంది. అయితే ఈక్విటీలో వచ్చిన లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్‌ను మాత్రం కేవలం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌పైనే సర్దుబాటు చేసుకోవచ్చు. పెట్టుబడిదారులు ఏ ఐటీఆర్ ఫారం ఉపయోగించాలనే విషయానికి వస్తే, అది వారి ఆదాయ వనరులపై ఆధారపడి ఉంటుంది. షేర్లు, మ్యూచువల్ ఫండ్లు లేదా ఇతర క్యాపిటల్ ఆస్తుల నుంచి క్యాపిటల్ గెయిన్స్ లేదా క్యాపిటల్ లాస్‌ను ప్రకటించే పెట్టుబడిదారులు సాధారణంగా ఐటీఆర్-2 దాఖలు చేయాలి.

స్టేట్‌మెంట్ల‌ను స‌రిపోల్చాలి..

అయితే ఇంట్రాడే షేర్ ట్రేడింగ్ లేదా వ్యాపార ఆదాయంగా పరిగణించే ఇతర ట్రేడింగ్ కార్యకలాపాల ద్వారా కూడా ఆదాయం ఉంటే, అలాంటి వారు ఐటీఆర్-3 ఫాం దాఖలు చేయాలి. క్యాపిటల్ లాస్‌ను నివేదించే సమయంలో పన్ను చెల్లింపుదారులు కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలి. నిర్ణీత గడువులోపు దాఖలు చేసిన ఐటీఆర్‌లో చూపిన నష్టాలనే సాధారణంగా భవిష్యత్తుకు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. అలాగే కాంట్రాక్ట్ నోట్స్, బ్రోకర్ స్టేట్‌మెంట్లు, క్యాపిటల్ గెయిన్స్ స్టేట్‌మెంట్లు వంటి పత్రాలను భద్రంగా ఉంచుకోవాలి. భవిష్యత్తులో పన్ను శాఖ కోరితే ఇవే ఆధారాలుగా ఉపయోగపడతాయి. ఐటీఆర్ దాఖలు చేసే ముందు అందులో పేర్కొనే వివరాలు తమ పెట్టుబడి రికార్డులకు సరిపోతున్నాయో లేదో కూడా నిర్ధారించుకోవాలి. గోపాల్ బోహ్రా మాట్లాడుతూ ఐటీఆర్ దాఖలు చేసే సమయంలో ఏఐఎస్ లేదా టీఐఎస్‌లో నమోదైన లావాదేవీలను బ్రోకర్ రిపోర్ట్ లేదా ట్రాన్సాక్షన్ స్టేట్‌మెంట్‌తో తప్పనిసరిగా సరిపోల్చాలని సూచించారు. అలాగే షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్‌లను ఐటీఆర్‌లో సక్రమంగా వెల్లడిస్తేనే భవిష్యత్తులో వాటిని సెట్-ఆఫ్ చేసుకునే అవకాశంపై ఎలాంటి ప్రభావం ఉండదని తెలిపారు.

Advertisement
Advertisement