త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Fixed Deposit | బ్యాంకు వ‌ర్సెస్ పోస్టాఫీస్‌.. ఏ ఎఫ్‌డీ ఎక్కువ వ‌డ్డీని ఇస్తుంది..?

Fixed Deposit | దేశంలో ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ)లు ఎంతో కాలంగా సుర‌క్షిత‌మైన పెట్టుబ‌డి మార్గాలుగా కొన‌సాగుతున్నాయి. రిస్క్ తీసుకునేందుకు అస‌లు ఇష్ట‌ప‌డ‌ని ప్ర‌జ‌లు ఎఫ్‌డీల‌లో డ‌బ్బును పొదుపు చేస్తుంటారు. దీంతో దీర్ఘ‌కాలంలో ఆశాజ‌న‌క రాబ‌డుల‌ను ఎఫ్‌డీలు అందిస్తాయి.

S

Business | Published On Jun 27, 2026, 4.56 pm IST

Fixed Deposit | బ్యాంకు వ‌ర్సెస్ పోస్టాఫీస్‌.. ఏ ఎఫ్‌డీ ఎక్కువ వ‌డ్డీని ఇస్తుంది..?
Advertisement

Fixed Deposit | దేశంలో ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ)లు ఎంతో కాలంగా సుర‌క్షిత‌మైన పెట్టుబ‌డి మార్గాలుగా కొన‌సాగుతున్నాయి. రిస్క్ తీసుకునేందుకు అస‌లు ఇష్ట‌ప‌డ‌ని ప్ర‌జ‌లు ఎఫ్‌డీల‌లో డ‌బ్బును పొదుపు చేస్తుంటారు. దీంతో దీర్ఘ‌కాలంలో ఆశాజ‌న‌క రాబ‌డుల‌ను ఎఫ్‌డీలు అందిస్తాయి. అలాగే రూ.5 లక్షల వ‌ర‌కు ఎఫ్‌డీల‌కు ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది కనుక ఇవి అత్యంత సుర‌క్షిత‌మైన పెట్టుబ‌డి మార్గాలుగా చెలామణీలో ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే దేశంలోని ప‌లు బ్యాంకులు, ఆర్థిక సంస్థ‌ల‌తోపాటు పోస్టాఫీసులు కూడా ఎఫ్‌డీ స‌దుపాయాన్ని అందిస్తున్నాయి. అయితే బ్యాంకుల‌కు, పోస్టాఫీసుల‌కు ఎఫ్‌డీ విష‌యంలో ఎలాంటి తేడాలు ఉంటాయి, ఎందులో ఎక్కువ వ‌డ్డీ ల‌భిస్తుంది, ఎందులో కాల ప‌రిమితి ఎలా ఉంటుంది.. అన్న వివ‌రాల‌ను ఆర్థిక నిపుణులు వివ‌రిస్తున్నారు.

తేడాలేమిటి..?

బ్యాంకుల్లో ఎఫ్‌డీ ఖాతాను ఓపెన్ చేస్తే అందులో రూ.5 లక్ష‌ల మొత్తం వ‌ర‌కు ఇన్సూరెన్స్ ఉంటుంది. వ‌డ్డీ ఏడాదికి క‌నీసం 2.5 నుంచి 8.1 శాతం వ‌ర‌కు చెల్లిస్తారు. వ‌డ్డీని త్రైమాసిక ప‌ద్ధ‌తిలో లెక్కిస్తారు. కాంపౌండింగ్ ప్ర‌యోజ‌నం ల‌భిస్తుంది. అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో ఎఫ్‌డీని ఎప్పుడైనా విత్ డ్రా చేసుకోవ‌చ్చు. త‌క్కువ మొత్తంలో పెనాల్టీ విధిస్తారు. ఎఫ్‌డీల‌ను ప్ర‌స్తుతం బ్యాంకుల‌కు వెళ్ల‌కుండా ఆన్‌లైన్‌లోనే ఓపెన్ చేసే స‌దుపాయాన్ని అందిస్తున్నారు. అందువ‌ల్ల ఇంట్లోనే సుల‌భంగా ఎఫ్‌డీల్లో పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చు. ఇక పోస్టాఫీస్‌లో అయితే 100 శాతం కేంద్ర ప్ర‌భుత్వం ఆధీనంలో ఉంటాయి క‌నుక పెట్టిన పెట్టుబడి మొత్తానికి ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇందులో ఎలాంటి ప‌రిమితి ఉండ‌దు. పోస్టాఫీసుల్లో క‌నీస వ‌డ్డీ ఏడాదికి 6.9 శాతం ఉండ‌గా గ‌రిష్టంగా 7.5 శాతం వ‌ర‌కు చెల్లిస్తున్నారు. వ‌డ్డీని వార్షిక ప‌ద్ధ‌తిలో చెల్లిస్తారు. కాంపౌండింగ్ ప్ర‌యోజ‌నం వార్షిక ప‌ద్ధ‌తిలో ల‌భిస్తుంది. ఎఫ్‌డీని మొద‌టిసారిగా ఓపెన్ చేస్తే తొలి 6 నెల‌ల వ‌ర‌కు లాక్ ఇన్ పీరియ‌డ్ ఉంటుంది. ఆ త‌రువాత ఎప్పుడైనా విత్ డ్రా చేయ‌వ‌చ్చు. పోస్టాఫీస్ ఎఫ్‌డీని ఓపెన్ చేయాలంటే క‌చ్చితంగా బ్రాంచ్‌ను సంద‌ర్శించాల్సి ఉంటుంది.

ఏది ఉత్త‌మం..

అయితే రెండింటిలో ఏది ఉత్త‌మం అంటే.. వ్య‌క్తిగత అవ‌స‌రాల‌ను బ‌ట్టి ఉంటుంది. ఏ స‌మ‌యంలో అయినా డ‌బ్బులు అవ‌స‌రం అవుతాయి, సుల‌భంగా ఖాతాను ఓపెన్ చేయాలి అని భావిస్తే బ్యాంకు ఎఫ్‌డీ మేలు. అయితే వ‌డ్డీని ఎక్కువ‌గా అందించే బ్యాంకును ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇక మీరు పెట్టే పెట్టుబ‌డి మొత్తానికి సేఫ్టీ ఉండాల‌ని భావించినా, ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 80సి కింద ప‌న్ను మిన‌హాయింపు కావాల‌ని అనుకున్నా పోస్టాఫీస్ ఎఫ్‌డీ అయితే మంచిది. వినియోగ‌దారులు త‌మ వ్య‌క్తిగ‌త అవ‌స‌రాలు, స్థోమ‌త‌, ల‌భ్య‌త‌ను బ‌ట్టి బ్యాంకు లేదా పోస్టాఫీస్ ఎఫ్‌డీని ఎంచుకోవ‌చ్చు. అయితే పెట్టుబ‌డులు పెట్టే ముందు నిపుణుల‌ను సంప్ర‌దించ‌డం మంచిది.

Advertisement
Advertisement