త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ITR Filing | ఐటీఆర్ ఫైలింగ్ సులభమే.. తొలిసారి రిటర్న్స్ దాఖలు చేసేవారికి పూర్తి గైడ్..

ITR Filing | దేశంలో ఆదాయపు పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) ఫైలింగ్ సీజన్ ప్రారంభమైంది. గడువు ముగిసేలోపు తమ రిటర్న్స్‌ను దాఖలు చేసేందుకు పన్ను చెల్లింపుదారులు సిద్ధమవుతున్నారు. అయితే తొలిసారి ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ (ఐటీఆర్) ఫైల్ చేసే వారికి ఈ ప్రక్రియ మొదట్లో కొంత క్లిష్టంగా అనిపిస్తుంది.

S

Business | Published On Jun 23, 2026, 12.14 pm IST

ITR Filing | ఐటీఆర్ ఫైలింగ్ సులభమే.. తొలిసారి రిటర్న్స్ దాఖలు చేసేవారికి పూర్తి గైడ్..
Advertisement

ITR Filing | దేశంలో ఆదాయపు పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) ఫైలింగ్ సీజన్ ప్రారంభమైంది. గడువు ముగిసేలోపు తమ రిటర్న్స్‌ను దాఖలు చేసేందుకు పన్ను చెల్లింపుదారులు సిద్ధమవుతున్నారు. అయితే తొలిసారి ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ (ఐటీఆర్) ఫైల్ చేసే వారికి ఈ ప్రక్రియ మొదట్లో కొంత క్లిష్టంగా అనిపిస్తుంది. కానీ ప్రాథమిక దశలను అర్థం చేసుకుని, అవసరమైన పత్రాలను ముందుగానే సిద్ధంగా ఉంచుకుంటే ఈ పని చాలా సులభత‌ర‌మవుతుంది. తొలిసారి ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేసేవారి కోసం ఈ సులభమైన స్టెప్-బై-స్టెప్ గైడ్ ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది.

ఐటీఆర్ అంటే ఏమిటి..?

ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ లేదా ఐటీఆర్ అంటే పన్ను చెల్లింపుదారులు ఒక ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తమ ఆదాయం, చెల్లించిన పన్నులు, క్లెయిమ్ చేసిన డిడక్షన్లు, ఆస్తులు, నష్టాలు, రిఫండ్ల వివరాలను ప్రభుత్వానికి తెలియజేసే అధికారిక పత్రం. ఐటీఆర్ దాఖలు చేయడం ద్వారా పన్ను చట్టాలకు అనుగుణంగా ఉండటంతోపాటు అర్హత ఉన్న రిఫండ్లను కూడా పొందవచ్చు.

అవసరమైన పత్రాలు..

ఐటీఆర్ ఫైలింగ్ ప్రారంభించే ముందు అన్ని ముఖ్యమైన పత్రాలను సిద్ధంగా ఉంచుకోవడం మంచిది. వాటిలో పాన్, ఆధార్ కార్డులు, ఫామ్ 16, బ్యాంక్ స్టేట్‌మెంట్లు, ఫామ్‌ 26ఏఎస్, యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్ (ఏఐఎస్), బ్యాంకుల నుంచి పొందిన వడ్డీ సర్టిఫికెట్లు, ఇన్సూరెన్స్ ప్రీమియం రశీదులు, వర్తిస్తే డొనేషన్ రశీదులు, స్టాక్ ట్రేడింగ్ స్టేట్‌మెంట్లు, పాన్‌కు లింక్ చేసిన బ్యాంక్ ఖాతా వివరాలు, ఈ-వెరిఫికేషన్ కోసం ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్ అవసరం అవుతాయి. అలాగే ఏఐఎస్‌లో ఉన్న వివరాలను మీ ఆర్థిక రికార్డులతో సరిపోల్చి ఎలాంటి వ్యత్యాసాలు లేవని నిర్ధారించుకోవడం కూడా చాలా ముఖ్యం.

ఆన్‌లైన్‌లో ఐటీఆర్ ఎలా ఫైల్ చేయాలి..?

మొదటి దశలో ఇన్‌కమ్ ట్యాక్స్ శాఖ ఈ-ఫైలింగ్ పోర్టల్‌ను సందర్శించి, పాన్ లేదా ఆధార్ నంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి. తొలిసారి వినియోగదారులు పాన్, ఆధార్, మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ద్వారా ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రెండో దశలో లాగిన్ అయిన తర్వాత ఈ-ఫైల్ లోని ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనే విభాగంలో ఉండే ఫైల్ ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయం కోసం అసెస్‌మెంట్ ఇయర్ 2026-27ను సెలెక్ట్ చేసి ఆన్‌లైన్ ఫైలింగ్ విధానాన్ని ఎంచుకోవాలి. ఇప్పటికే పూర్తి కాకుండా ఉన్న రిటర్న్ ఉంటే రెజ్యూమ్ ఫైలింగ్ ను, కొత్తగా ప్రారంభించాలనుకుంటే స్టార్ట్ న్యూ ఫైలింగ్ ను ఎంచుకోవచ్చు. మూడో దశలో మీరు ఏ కేటగిరీ కింద రిటర్న్ దాఖలు చేస్తున్నారో ఎంపిక చేయాలి. ఉదాహరణకు ఇండివిడ్యువల్, హిందూ అన్‌డివైడెడ్ ఫ్యామిలీ (హెచ్‌యూఎఫ్) లేదా ఇతర వర్తించే కేటగిరీలను ఎంచుకోవాలి. ఈ ఎంపిక ఆధారంగా మీకు వర్తించే పన్ను నిబంధనలు, ఫామ్‌ల‌ను నిర్ణయిస్తారు.

నాలుగో దశలో సరైన ఐటీఆర్ ఫామ్‌ను ఎంచుకోవాలి. మీరు పొందే ఆదాయం స్వభావం, పన్ను చెల్లింపుదారుల కేటగిరీ ఆధారంగా ఫామ్ ఎంపిక చేయాలి. తప్పు ఫామ్‌ను ఎంచుకుంటే రిటర్న్ ప్రాసెసింగ్ ఆలస్యం అవుతుంది. కొన్ని సందర్భాల్లో రిటర్న్‌ను డిఫెక్టివ్‌గా కూడా పరిగణించే అవకాశం ఉంటుంది. జీతభత్యాలు మాత్రమే పొందే సాధారణ పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్-1ను ఉపయోగించవచ్చు. క్యాపిటల్ గెయిన్స్, విదేశీ ఆస్తులు లేదా ఒకటి కంటే ఎక్కువ ఇళ్లకు సంబంధించిన ఆదాయం ఉన్నవారు ఐటీఆర్-2ను ఎంచుకోవాలి. వ్యాపార లేదా వృత్తి ఆధారిత ఆదాయం ఉన్నవారికి ఐటీఆర్-3 వర్తిస్తుంది. ప్రిజంప్టివ్ టాక్సేషన్ విధానాన్ని ఎంచుకున్నవారు ఐటీఆర్-4ను ఉపయోగించాలి. ఐదో దశలో రిటర్న్ దాఖలు చేయడానికి కారణాన్ని పేర్కొనాలి. ఆదాయం ప్రాథమిక మినహాయింపు పరిమితిని మించిపోవడం, ట్యాక్స్ రిఫండ్ క్లెయిమ్ చేయడం, నష్టాలను భవిష్యత్తుకు క్యారీ ఫార్వర్డ్ చేయడం లేదా ఇతర చట్టబద్ధ అవసరాల కోసం ఫైలింగ్ చేయడం వంటి కారణాలను సరైన విధంగా పేర్కొనాలి. ఇది రిటర్న్‌ను సక్రమంగా ప్రాసెస్ చేయడానికి సహాయపడుతుంది.

ఆరవ దశలో ఆదాయం, డిడక్షన్ల వివరాలను నమోదు చేయాలి. ఈ సమయంలో అన్ని ఆర్థిక పత్రాలను దగ్గర ఉంచుకోవడం మంచిది. ముందుగానే నింపిన వివరాలను ధ్రువీకరించి, ఆదాయం, డిడక్షన్లు, ట్యాక్స్ క్రెడిట్లను సరిగ్గా నమోదు చేయాలి. ఏడో దశలో అన్ని వివరాలను జాగ్రత్తగా సమీక్షించాలి. సమాచారం సరైందిగా, పూర్తిగా ఉందని నిర్ధారించుకున్న తర్వాత రిటర్న్‌ను సమర్పించాలి. ఎనిమిదో దశలో ఈ-వెరిఫికేషన్ పూర్తి చేయాలి. ఐటీఆర్ దాఖలు చేసినంత మాత్రాన ప్రక్రియ పూర్తికాదు. రిటర్న్ సమర్పించిన 30 రోజుల్లోపు వెరిఫికేషన్ పూర్తి చేయాలి. లేకపోతే ఆ రిటర్న్ ను చెల్లనిదిగా పరిగణించే అవకాశం ఉంటుంది.

ఆఫ్‌లైన్‌లో ఐటీఆర్ ను ఎలా ఫైల్ చేయాలి..?

ఆఫ్‌లైన్ విధానాన్ని ఎంచుకునే పన్ను చెల్లింపుదారులు ఇన్‌కమ్ ట్యాక్స్ శాఖ ఈ-ఫైలింగ్ పోర్టల్ నుంచి కామన్ ఆఫ్‌లైన్ యుటిలిటీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అవసరమైన వివరాలను నమోదు చేసిన తర్వాత ముందుగా నింపిన డేటా (జేసన్ ఫైల్)ను జత చేసి వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. తొలిసారి ఐటీఆర్ దాఖలు చేయడం కొంత కష్టంగా అనిపించినప్పటికీ, సరైన విధానాన్ని అనుసరించి అవసరమైన పత్రాలను సిద్ధంగా ఉంచుకుంటే మొత్తం ప్రక్రియ చాలా సులభంగా పూర్తవుతుంది. అన్ని వివరాలను క‌చ్చితంగా నమోదు చేయడం, సరైన ఐటీఆర్ ఫామ్‌ను ఎంచుకోవడం, ఈ-వెరిఫికేషన్‌ను సమయానికి పూర్తి చేయడం ద్వారా రిటర్న్ ప్రాసెసింగ్, రిఫండ్‌లలో ఎలాంటి జాప్యం లేకుండా చూసుకోవచ్చు.

Advertisement
Advertisement