SEBI | విదేశీ పెట్టుబడిదారులకు భారీ ఊరట.. మూలధన లాభాల పన్ను ఇక ఉండదు..?
SEBI | భారత స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులను పెంచడం, విదేశీ పెట్టుబడిదారులను తిరిగి ఆకర్షించడం లక్ష్యంగా ఈక్విటీలపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (ఎల్‌టీసీజీ) రద్దు చేయాలని సెబీ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు సమాచారం. దేశీయ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులకు కూడా పన్ను మినహాయింపులు కల్పించాలని సూచించింది.
SEBI | భారత స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులను పెంచడం, విదేశీ పెట్టుబడిదారులను తిరిగి ఆకర్షించడం లక్ష్యంగా ఈక్విటీలపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (ఎల్‌టీసీజీ) రద్దు చేయాలని సెబీ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు సమాచారం. దేశీయ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులకు కూడా పన్ను మినహాయింపులు కల్పించాలని సూచించింది.
భారత స్టాక్ మార్కెట్లు అంతర్జాతీయ వర్ధమాన మార్కెట్లతో పోలిస్తే ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కీలక ప్రతిపాదనలు చేసినట్లు రాయిటర్స్ నివేదిక వెల్లడించింది. విదేశీ పెట్టుబడిదారులపై విధిస్తున్న దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నును రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం. అలాగే ఇప్పటికే ఒక మ్యూచువల్ ఫండ్ పథకంలో పెట్టిన పెట్టుబడులను మరో పథకానికి మార్చుకున్నప్పుడు కూడా ఎల్‌టీసీజీ పన్ను విధించకుండా మినహాయింపు ఇవ్వాలని సూచించింది. ఈ ప్రతిపాదనలను వచ్చే ఫిబ్రవరిలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌కు ముందుగా ప్రభుత్వానికి సమర్పించినట్లు తెలుస్తోంది. అయితే ఇవి కేవలం సలహాలు మాత్రమేనని, తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందని నివేదిక పేర్కొంది.
పెట్టుబడులపై పన్ను భారం తగ్గించే ప్రయత్నం..
గత రెండేళ్లుగా భారత ఈక్విటీ మార్కెట్లు ఇతర వర్ధమాన మార్కెట్ల కంటే వెనుకబడ్డాయి. ఈ ఏడాది ఇప్పటివరకు విదేశీ పెట్టుబడిదారులు భారత స్టాక్ మార్కెట్ల నుంచి రికార్డు స్థాయిలో 31 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం ఏడాది కంటే ఎక్కువ కాలం పాటు ఉంచిన సెక్యూరిటీలపై 12.5 శాతం దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను, ఏడాది లోపు విక్రయించిన పెట్టుబడులపై 20 శాతం స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను అమల్లో ఉన్నాయి. వీటికి అదనంగా సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్, డివిడెండ్ ఆదాయంపై పన్నులు కూడా వర్తిస్తున్నాయి. భారత మార్కెట్లలో పెట్టుబడుల వ్యయం ఇతర దేశాలతో పోలిస్తే ఎక్కువగా ఉందని సెబీ అభిప్రాయపడినట్లు సమాచారం. పన్నుల తగ్గింపు విదేశీ పెట్టుబడిదారుల రాబడులను పెంచుతుందని జెఫరీస్ బ్రోకరేజ్ సంస్థ పేర్కొనగా, మూలధన లాభాల పన్ను రద్దు చేస్తే విదేశీ పెట్టుబడిదారుల రాబడులు 2.3 శాతం పాయింట్లు పెరిగే అవకాశం ఉందని ఐఐఎఫ్ఎల్ అంచనా వేసింది.
దేశీయ మదుపరులకూ ప్రయోజనం..
భారత మార్కెట్ల మందగమనం దేశీయ పెట్టుబడిదారులపైనా ప్రభావం చూపుతోంది. గత రెండేళ్లలో నిఫ్టీ 50 సూచీ 4.8 శాతం పడిపోగా, ఎంఎస్‌సీఐ వర్ధమాన మార్కెట్ల సూచీ 40 శాతం వృద్ధి చెందింది. మార్నింగ్‌స్టార్ గణాంకాల ప్రకారం, లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లు సగటున మైనస్ 1.6 శాతం రాబడులను అందించాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు దేశీయ మ్యూచువల్ ఫండ్ పథకాల నుంచి వెనక్కి వెళ్లకుండా ప్రోత్సహించేందుకు సెబీ మరో ప్రతిపాదన చేసింది. ఒక మ్యూచువల్ ఫండ్ పథకంలో కొనుగోలు చేసిన యూనిట్లను ఏడాది కంటే ఎక్కువ కాలం ఉంచిన తర్వాత మరో పథకానికి మార్చుకుంటే మూలధన లాభాల పన్ను విధించకూడదని సూచించింది. ప్రస్తుతం భారత మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ నిర్వహణలో రూ.82.6 లక్షల కోట్ల (870.80 బిలియన్ డాలర్లు) ఆస్తులు ఉన్నాయి. నెలవారీ పెట్టుబడి పథకాల ద్వారా సగటున ప్రతి నెలా రూ.30 వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనలను ఆమోదిస్తుందా లేదా అనేది రాబోయే బడ్జెట్‌లో స్పష్టత రానుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Stock Markets | దలాల్ స్ట్రీట్‌లో భారీ ర్యాలీ.. గంటలోనే రూ.6 లక్షల కోట్ల లాభం.. కారణాలేమిటి..?
నవంబర్ 2, 2026

Stock Markets | దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 950 పాయింట్లు జంప్..
నవంబర్ 2, 2026

Hyderabad Ratnadeep | హైదరాబాద్ రత్నదీప్ రిటైల్ ఐపీవోకు సెబీ గ్రీన్ సిగ్నల్.. రూ.400 కోట్ల సమీకరణకు అనుమతి
అక్టోబర్ 31, 2026
తాజావార్తలు
- ●Ponguleti Srinivas Reddy | సరిహద్దు పంచాదులుండొద్దిగ.. జాయింట్ సర్వే చేయండి
- ●Supreme Court | గ్రీన్ క్రాకర్స్‌కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్..
- ●2027 UP Assembly Elections | హ్యాట్రిక్‌పై గురి.. యూపీ ఎన్నికలకు బీజేపీ త్రిముఖ వ్యూహం
- ●Hyderabad Metro Phase-2 | మెట్రో ఫేజ్-2కు మహర్దశ.. రూ.125 కోట్ల నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం
- ●Amitabh Bachchan Lord Krishna Post | ఒక్క సైగ చేస్తే చాలు.. మీడియాకు బిగ్ బి స్ట్రాంగ్ వార్నింగ్!
- ●CBFC | సెన్సార్ రూల్స్ మరింత కఠినం - ఫిల్మ్ మేకర్స్‌కు షాకిచ్చిన సీబీఎఫ్సీ

Ponguleti Srinivas Reddy | సరిహద్దు పంచాదులుండొద్దిగ.. జాయింట్ సర్వే చేయండి

Supreme Court | గ్రీన్ క్రాకర్స్‌కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్..

2027 UP Assembly Elections | హ్యాట్రిక్‌పై గురి.. యూపీ ఎన్నికలకు బీజేపీ త్రిముఖ వ్యూహం

Hyderabad Metro Phase-2 | మెట్రో ఫేజ్-2కు మహర్దశ.. రూ.125 కోట్ల నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం



