త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | దూసుకెళ్తున్న‌ స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 950 పాయింట్లు జంప్..

Stock Markets | అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గడం, రిలయన్స్ ఇండస్ట్రీస్ సహా దిగ్గజ కంపెనీల మెరుగైన త్రైమాసిక ఫలితాలు, విదేశీ పెట్టుబడిదారులు తిరిగి కొనుగోళ్లకు మొగ్గుచూపడం వంటి పరిణామాలతో భారత స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి.

S

Business | Published On Nov 2, 2026, 9.58 am IST

Stock Markets | దూసుకెళ్తున్న‌ స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 950 పాయింట్లు జంప్..
Advertisement

Stock Markets | అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గడం, రిలయన్స్ ఇండస్ట్రీస్ సహా దిగ్గజ కంపెనీల మెరుగైన త్రైమాసిక ఫలితాలు, విదేశీ పెట్టుబడిదారులు తిరిగి కొనుగోళ్లకు మొగ్గుచూపడం వంటి పరిణామాలతో భారత స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 950 పాయింట్లకు పైగా పెరగ్గా, నిఫ్టీ 23,300 స్థాయిని అధిగమించింది. దీంతో ఐదు నిమిషాల్లోనే బీఎస్ఈలో నమోదైన కంపెనీల మార్కెట్ విలువకు దాదాపు రూ.4 లక్షల కోట్లు జతయ్యాయి.

5 శాతానికి పైగా పెరిగిన రిల‌య‌న్స్ షేర్లు..

సోమవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే బీఎస్ఈ సెన్సెక్స్ 950 పాయింట్లకు పైగా ఎగబాకింది. నిఫ్టీ 50 సూచీ 23,300 మార్కును దాటింది. దీంతో మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.478 లక్షల కోట్లకు చేరుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 5 శాతానికి పైగా పెరిగి మార్కెట్ ర్యాలీకి ప్రధానంగా దోహదపడ్డాయి. టాటా స్టీల్ 4 శాతం లాభపడగా, ఎన్టీపీసీ, మారుతీ సుజుకీ, బీఈఎల్, పవర్ గ్రిడ్, ఎస్‌బీఐ, ఏషియన్ పెయింట్స్, టీసీఎస్, ఎం అండ్ ఎం, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్‌యూఎల్, ఎల్ అండ్ టీ, భారతి ఎయిర్‌టెల్, అదానీ పోర్ట్స్ షేర్లు 1 నుంచి 3 శాతం వరకు పెరిగాయి. అయితే సన్ ఫార్మా షేర్లు మాత్రం 2 శాతం నష్టపోయాయి. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ దాదాపు 3 శాతం పెరిగి అగ్రస్థానంలో నిలవగా, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ సూచీలు 1 శాతానికి పైగా లాభపడ్డాయి. ఫార్మా, ప్రైవేట్ బ్యాంక్ సూచీలు మాత్రం నష్టాల్లోకి జారుకున్నాయి. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు కూడా లాభాల్లోనే కొనసాగాయి. ఎన్‌ఎస్‌ఈలో 2,053 షేర్లు లాభపడగా, 921 షేర్లు నష్టపోయాయి. 98 షేర్లలో ఎలాంటి మార్పు లేదు.

భారీగా తగ్గిన చ‌మురు ధ‌ర‌లు..

మార్కెట్ ర్యాలీకి ప్రధాన కారణాల్లో ముడిచమురు ధరల తగ్గుదల ఒకటి. అమెరికా, ఇజ్రాయెల్‌తో ఇరాన్‌కు కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు ఇరాన్, ఖతార్ అధికారులు వరుసగా మూడో రోజు చర్చలు జరుపుతున్నారు. ఈ పరిణామాలతో సోమవారం అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 3 శాతానికి పైగా తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 110 డాలర్ల స్థాయికి, అమెరికా డబ్ల్యూటీఐ క్రూడ్ ధర 101 డాలర్లకు పడిపోయింది. హోర్ముజ్ జలసంధి వద్ద నౌకలపై దాడులు పెరగడంతో ఇటీవల చమురు ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. మరోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్ సెప్టెంబర్ త్రైమాసికంలో నికర లాభాన్ని గతేడాదితో పోలిస్తే 41 శాతం పెంచుకుని రూ.25,548 కోట్లుగా నమోదు చేసింది. గతేడాది ఇదే కాలంలో ఈ లాభం రూ.18,165 కోట్లుగా ఉంది. జియో ప్లాట్‌ఫామ్స్ నికర లాభం కూడా 14 శాతం పెరిగి రూ.8,389 కోట్లకు చేరడంతో ఆ కంపెనీ షేర్లు 3 శాతానికి పైగా పెరిగాయి.

పెరిగిన ఎఫ్ఐఐల కొనుగోళ్లు..

విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్‌ఐఐలు) తిరిగి భారత ఈక్విటీ మార్కెట్లలో కొనుగోళ్లు ప్రారంభించడం కూడా సానుకూల ప్రభావం చూపింది. గత 10 ట్రేడింగ్ సెషన్లలో దాదాపు 1.2 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను కొనుగోలు చేసిన విదేశీ పెట్టుబడిదారులు, గత శుక్రవారం ఒక్కరోజే సుమారు రూ.3,599 కోట్ల పెట్టుబడులు పెట్టారు. దీనికి తోడు దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (ఎల్‌టీసీజీ), సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (ఎస్‌టీటీ)పై కేంద్ర ప్రభుత్వం ఉపశమనం కల్పించ‌నుంద‌న్న‌ అంచనాలు మార్కెట్‌లో ఆశలు పెంచుతున్నాయి. ఈ అంశాలపై చర్చలు కొనసాగుతున్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గతంలో వెల్లడించారు. ఎల్‌టీసీజీ పన్ను తగ్గింపు జరిగితే విదేశీ పెట్టుబడిదారులు తిరిగి భారత మార్కెట్ల వైపు వచ్చే అవకాశం ఉందని జెఫరీస్ నివేదిక పేర్కొంది. ముఖ్యంగా బ్యాంకింగ్, ఇంధన రంగాలు, భారీ మార్కెట్ విలువ కలిగిన కంపెనీలకు ప్రయోజనం కలుగుతుంద‌ని విశ్లేషించింది.

ట్యాగ్స్:

Brent CrudeIndian Stock MarketJio PlatformsNifty 50Oil PricesReliance IndustriesSensexStock Markets
Advertisement
Advertisement