త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad Ratnadeep | హైదరాబాద్‌ రత్నదీప్ రిటైల్ ఐపీవోకు సెబీ గ్రీన్ సిగ్నల్.. రూ.400 కోట్ల సమీకరణకు అనుమ‌తి

Hyderabad Ratnadeep | హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ సూపర్‌మార్కెట్ సంస్థ రత్నదీప్ (Ratnadeep) రిటైల్ లిమిటెడ్ నిధుల స‌మీక‌ర‌ణ‌లో కీల‌క అనుమ‌తులు పొందింది.

S

Telangana | Published On Oct 31, 2026, 6.00 pm IST

Hyderabad Ratnadeep | హైదరాబాద్‌ రత్నదీప్ రిటైల్ ఐపీవోకు సెబీ గ్రీన్ సిగ్నల్.. రూ.400 కోట్ల సమీకరణకు అనుమ‌తి
Advertisement

Hyderabad Ratnadeep | త్రినేత్ర న్యూస్: హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ సూపర్‌మార్కెట్ సంస్థ రత్నదీప్ (Ratnadeep) రిటైల్ లిమిటెడ్ నిధుల స‌మీక‌ర‌ణ‌లో కీల‌క అనుమ‌తులు పొందింది. ఐపీవో (Initial Public Offering) ద్వారా రూ.400 కోట్ల నిధులను స‌మీక‌రించేందుకు సెబీ (SEBI) నుంచి తాజాగా అనుమ‌తులు ల‌భించాయి. దీంతో కంపెనీ ప్రతిపాదిత ఐపీవో ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు మార్గం సుగమమైంది.

ఈ ఐపీఓలో భాగంగా రూ.400 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్ల జారీతో పాటు, ప్రస్తుత ప్రమోటర్లు తమ వాటాలకు చెందిన షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా విక్రయించనున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో సూపర్‌మార్కెట్లు, హైపర్‌మార్కెట్లను నిర్వహిస్తున్న రత్నదీప్ రిటైల్.. 2026 జూలైలో సెబీకి డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (DRHP) సమర్పించడంతో అక్టోబర్ 27న త‌న ప‌రిశీల‌న పూర్తి అయిన త‌ర్వాత ఐపీవో ప్రక్రియలో ముందుకు వెళ్లేందుకు అడ్డంకులు త‌ప్పాయి.

డీఆర్‌హెచ్‌పీ ప్రకారం.. ఐపీవోలో రూ.400 కోట్ల వరకు తాజా షేర్ల జారీ, ప్రమోటర్ షేర్‌హోల్డర్ల ద్వారా 1.49 కోట్ల వరకు ఈక్విటీ షేర్ల విక్రయం ఉండనుంది. తాజా షేర్ల జారీ ద్వారా వచ్చే నిధులను కంపెనీ విస్తరణ, ఆర్థిక అవసరాలకు వినియోగించనుంది. ఓఎఫ్‌ఎస్ వ‌ల్ల‌ వచ్చే మొత్తాన్ని షేర్లను విక్రయించే ప్రమోటర్లు పొందుతారు. తాజా షేర్ల జారీ ద్వారా సమీకరించే నిధుల్లో రూ.260 కోట్లను రత్నదీప్, నేషనల్ మార్ట్ బ్రాండ్ల కింద కొత్త స్టోర్ల ఏర్పాటుకు కేటాయించనుంది. మరో రూ.40 కోట్లను కంపెనీ తీసుకున్న రుణాల చెల్లింపు లేదా ముందస్తు చెల్లింపులకు ఖ‌ర్చు పెట్ట‌నుంది. మిగిలిన మొత్తాన్ని సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది.

హైపర్‌మార్కెట్లలో త‌క్కువ ధ‌ర‌లు

2026, మార్చి 31 నాటికి రత్నదీప్ రిటైల్ తన రెండు బ్రాండ్ల కింద మొత్తం 190 స్టోర్లను నిర్వహిస్తోంది. ఇందులో రత్నదీప్-మైండ్‌ఫుల్ లివింగ్ పేరుతో నైబర్‌హుడ్ సూపర్‌మార్కెట్లు, రత్నదీప్ సెలెక్ట్ పేరుతో ప్రీమియం ఫుడ్ ఔట్‌లెట్లు న‌డుస్తున్నాయి. మరోవైపు నేషనల్ మార్ట్ పేరుతో హైపర్‌మార్కెట్లనూ న‌డిపిస్తోంది. ఇందులో స్టైల్ మార్ట్ ద్వారా తక్కువ ధరల్లో ఫ్యాషన్ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. ఈ సంస్థ తాజా కూరగాయలు, పండ్లు, ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తులు, నిత్యావసర సరుకులు, ఇతర వస్తువులు, దుస్తులు కలిపి 30 వేలకు పైగా ఉత్పత్తులను వినియోగదారులకు అందిస్తోంది.

రూ.2,223 కోట్ల ఆదాయం

2026 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ కార్యకలాపాల ద్వారా రూ.2,223 కోట్ల ఆదాయాన్ని గ‌డించింది. 2024 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఆదాయంలో 15 శాతం కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ (CAGR) నమోదైంది. అదే ఆర్థిక సంవత్సరంలో కంపెనీ పన్నుల అనంతర లాభం (PAT) రూ.36.7 కోట్లుగా ఉంది. ఈ ప్రతిపాదిత ఐపీవోకు మోతీలాల్ ఓస్వాల్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్స్, యాక్సిస్ క్యాపిటల్, డీఏఎం క్యాపిటల్ అడ్వైజర్స్ బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరించనున్నాయి. కాగా ఈ సంస్థ ప్ర‌ధాన కార్యాల‌యం హైద‌రాబాద్‌లో ఉంది.

ట్యాగ్స్:

Approval FundsDRHPHyderabadIpoOFSRatnadeepSebiTelangana
Advertisement
Advertisement