త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SBI Funds Management | ఎస్‌బీఐ ఫండ్స్ ఐపీఓతో ఉద్యోగులకు జాక్‌పాట్‌.. అప్పట్లో షేర్ల‌ను తీసుకుని ఇప్పుడు వంద‌ల కోట్లు పొందారు..

SBI Funds Management | దేశంలో అతిపెద్ద అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ స్టాక్ మార్కెట్‌లో విజయవంతంగా అరంగేట్రం చేసింది. ఈ ఐపీఓతో సంస్థలో ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న ఉద్యోగుల స్టాక్ ఓనర్‌షిప్ పథకం (ఈఎస్‌ఓపీ) ద్వారా పలువురు ఉద్యోగులు భారీ సంపదను సొంతం చేసుకున్నారు.

S

Business | Published On Jul 22, 2026, 2.37 pm IST

SBI Funds Management | ఎస్‌బీఐ ఫండ్స్ ఐపీఓతో ఉద్యోగులకు జాక్‌పాట్‌.. అప్పట్లో షేర్ల‌ను తీసుకుని ఇప్పుడు వంద‌ల కోట్లు పొందారు..
Advertisement

SBI Funds Management | దేశంలో అతిపెద్ద అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ స్టాక్ మార్కెట్‌లో విజయవంతంగా అరంగేట్రం చేసింది. ఈ ఐపీఓతో సంస్థలో ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న ఉద్యోగుల స్టాక్ ఓనర్‌షిప్ పథకం (ఈఎస్‌ఓపీ) ద్వారా పలువురు ఉద్యోగులు భారీ సంపదను సొంతం చేసుకున్నారు. కంపెనీ ప్రాస్పెక్టస్ ప్రకారం ఐపీఓ ధర ఒక్కో షేరుకు రూ.574గా నిర్ణయించగా, సంస్థలోని 13 మంది ఉద్యోగులు ఒక్కొక్కరు రూ.1 కోట్లకు పైగా విలువైన వెస్టెడ్ ఈక్విటీని కలిగి ఉన్నారు. దలాల్ స్ట్రీట్‌లో ఎస్‌బీఐ ఫండ్స్ షేర్లు బలమైన ఆరంభాన్ని నమోదు చేశాయి. బీఎస్‌ఈలో షేరు రూ.610 వద్ద లిస్టై, ఇష్యూ ధరతో పోలిస్తే 6.27 శాతం ప్రీమియం సాధించింది. ఎన్‌ఎస్‌ఈలో రూ.613.30 వద్ద ప్రారంభమై సుమారు 7 శాతం లిస్టింగ్ లాభాన్ని అందించింది. ఉద్యోగుల స్టాక్ ఓనర్‌షిప్ కార్యక్రమం ద్వారా అత్యధికంగా లాభపడిన వ్యక్తి కంపెనీ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ దేవిందర్ పాల్ సింగ్. ఆయన వద్ద ఉన్న 21.14 లక్షల వెస్టెడ్ షేర్ల విలువ ఐపీఓ ధర ప్రకారం సుమారు రూ.121 కోట్లు. అలాగే ఆయన వద్ద ఇంకా వెస్ట్ కాకుండా ఉన్న స్టాక్ ఆప్షన్లు కూడా ఉండగా, భవిష్యత్తులో వాటిని వినియోగించుకుంటే వాటి విలువ దాదాపు రూ.30 కోట్లకు చేరే అవకాశం ఉంది.

భారీగా లాభ‌ప‌డ్డ దీర్ఘ‌కాల ఉద్యోగులు..

కంపెనీ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ శ్రీనివాసన్ రామ అయ్యర్ వెస్టెడ్ షేర్ల విలువ సుమారు రూ.105 కోట్లు. ఇంకా ఆయన వద్ద ఉన్న అన్‌వెస్టెడ్ స్టాక్ ఆప్షన్ల విలువ ఐపీఓ ధర ఆధారంగా దాదాపు రూ.51 కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఇతర సీనియర్ అధికారులు కూడా భారీ స్థాయిలో సంపదను సృష్టించుకున్నారు. చీఫ్ ఆఫ్ స్ట్రాటజీ, డిజిటల్ అండ్ టెక్నాలజీ, హెడ్ ఆఫ్ ఇన్వెస్టర్ రిలేషన్స్ శ్రీనివాస్ జైన్ వద్ద ఉన్న వెస్టెడ్ షేర్ల విలువ దాదాపు రూ.59 కోట్లు. చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్-ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ రాజీవ్ రాధాకృష్ణన్ షేర్ల విలువ సుమారు రూ.36 కోట్లుగా న‌మోదైంది. చీఫ్ రిస్క్ ఆఫీసర్ అపర్ణా నిర్గుడే వద్ద ఉన్న వెస్టెడ్ షేర్ల విలువ సుమారు రూ.31 కోట్లు కాగా చీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్, కంపెనీ సెక్రటరీ, హెడ్ ఆఫ్ లీగల్ వినయ దాతార్ వద్ద ఉన్న షేర్ల విలువ సుమారు రూ.21 కోట్లుగా ఉంది. అలాగే చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఇందర్‌జీత్ ఘులియాని, చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ రజత్ గ్రోవర్, చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ సంజయ్ పుగావోంకర్, ఫండ్ మేనేజర్లు మోహన్ లాల్, మహేశ్ ఛాబ్రియా కూడా ఐపీఓ ఆఫర్ ధర ప్రకారం రూ. కోట్లకు పైగా విలువైన వెస్టెడ్ ఈక్విటీని కలిగి ఉన్న ఉద్యోగుల జాబితాలో చేరారు.

2018 నుంచే స్టాక్స్ కేటాయింపు..

ఈ భారీ సంపద సృష్టికి కారణం కంపెనీ 2018లో ప్రారంభించిన దీర్ఘకాలిక ఈఎస్‌ఓపీ కార్యక్రమం. అనంతరం ఇందులో పలు సవరణలు చేశారు. ఈ పథకం కింద ఉద్యోగులకు రూ.39 నుంచి రూ.455 మధ్య ఎక్సర్‌సైజ్ ధరల వద్ద స్టాక్ ఆప్షన్లు కేటాయించారు. ఇప్పుడు ఐపీఓ ధర రూ.574గా నిర్ణయించడంతో సంస్థ అభివృద్ధి ప్రయాణంలో కొనసాగిన ఉద్యోగులు గణనీయమైన లాభాలను పొందారు. ఐపీఓకు ముందే ఎస్‌బీఐ ఫండ్స్ బ్లాక్‌రాక్, గోల్డ్‌మన్ శాక్స్ వంటి ప్రముఖ సంస్థలతోపాటు మొత్తం 129 మంది యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి సుమారు రూ.2,663 కోట్లు సమీకరించింది. అలాగే కంపెనీ రూ.1,880 కోట్ల విలువైన ప్రీ-ఐపీఓ ప్లేస్‌మెంట్ ను కూడా పూర్తి చేసింది. జూలై 14 నుంచి 16 వరకు జరిగిన ఐపీఓ బిడ్డింగ్‌కు పెట్టుబడిదారుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ ఇష్యూ మొత్తం దాదాపు 42 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్స్ (క్యూఐబీలు) విభాగంలో సుమారు 140 రెట్లు, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల విభాగంలో 22.51 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల విభాగంలో 3.6 రెట్లు సబ్‌స్క్రిప్షన్ నమోదైంది.

Advertisement
Advertisement