త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MGKL | భారత్‌లోకి రష్యా ఎంట్రీ.. గోల్డ్ లోన్ల మార్కెట్‌లో కొత్త సంచలనం..

MGKL | రష్యాకు చెందిన పీజేఎస్సీ ఎంజీకేఎల్ (PJSC MGKL), రష్యన్ పాన్‌షాప్ చైన్ మోస్‌గోర్‌లొంబార్డ్ (Mosgorlombard) హోల్డింగ్ కంపెనీ గుజరాత్ లోని గిఫ్ట్ సిటీ (GIFT City) అంతర్జాతీయ ఆర్థిక కేంద్రంలో కొత్త కంపెనీని స్థాపించనున్నట్లు ప్రకటించింది.

S

Business | Published On Jul 20, 2026, 6.19 pm IST

MGKL | భారత్‌లోకి రష్యా ఎంట్రీ.. గోల్డ్ లోన్ల మార్కెట్‌లో కొత్త సంచలనం..
Advertisement

MGKL | రష్యాకు చెందిన పీజేఎస్సీ ఎంజీకేఎల్ (PJSC MGKL), రష్యన్ పాన్‌షాప్ చైన్ మోస్‌గోర్‌లొంబార్డ్ (Mosgorlombard) హోల్డింగ్ కంపెనీ గుజరాత్ లోని గిఫ్ట్ సిటీ (GIFT City) అంతర్జాతీయ ఆర్థిక కేంద్రంలో కొత్త కంపెనీని స్థాపించనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం ద్వారా భారత మూలధన మార్కెట్‌లో ప్రవేశించడమే కాకుండా, దేశంలోని భారీ గోల్డ్ లోన్ మార్కెట్‌ను లక్ష్యంగా నిర్ణ‌యించుకుంది. ఎంజీకేఎల్ వ్యాపార నమూనా ప్రకారం భారత్ లో బంగారాన్ని తనఖా పెట్టుకుని రుణాలు అందించే సేవలను ప్రారంభించనుంది. తొలి దశలో బంగారం, వెండిని మానవ జోక్యం లేకుండా అంచనా వేసి, కొనుగోలు, విక్రయం చేసే ఆటోమేటెడ్ కాంటాక్ట్‌లెస్ టెర్మినల్స్ ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తోంది. ఈ విధమైన సాంకేతిక పరిజ్ఞానం భారత గోల్డ్ లోన్ రంగంలో మొదటిసారి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

బంగారం లోన్లకు భార‌త్‌లో భారీ డిమాండ్‌..

ఎంజీకేఎల్ సీఈఓ అలెక్సీ లజుటిన్ మాట్లాడుతూ భారత్‌లో గోల్డ్ లోన్ల మార్కెట్ పరిమాణం, దాని పరిపక్వతను దృష్టిలో ఉంచుకుంటే, కాంటాక్ట్‌లెస్ విధానంలో బంగారం స్వీకరణకు భారీ డిమాండ్ ఉంటుందని తమ అంచనా అని తెలిపారు. గిఫ్ట్ సిటీలో సంస్థను నమోదు చేసిన అనంతరం, భారత మూలధన మార్కెట్‌లో పబ్లిక్ క్యాపిటల్ మార్కెట్ సాధనాలను జారీ చేసే అవకాశాలను కూడా కంపెనీ పరిశీలిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో భారత రేటింగ్ సంస్థ కేర్‌ఎడ్జ్ గ్లోబల్ (CareEdge Global) ఎంజీకేఎల్‌కు అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం బి- (B-) దీర్ఘకాలిక స్థానిక కరెన్సీ క్రెడిట్ రేటింగ్‌ను స్థిర దృక్పథంతో కేటాయించింది. ఎంజీకేఎల్‌కు పాన్‌షాప్ వ్యాపారంతోపాటు విలువైన లోహాల హోల్‌సేల్ కొనుగోలు, ప్రాసెసింగ్ రంగాల్లో కూడా కార్యకలాపాలు ఉన్నాయి. సంస్థ అనుబంధ కంపెనీ లాగ్-జొలోటో ఎన్‌డీఎస్ (Log-Zoloto NDS) పాన్‌షాప్‌లు, ఆభరణాల దుకాణాల నుంచి స్క్రాప్ బంగారాన్ని కొనుగోలు చేసి, శుద్ధి చేసి, హోల్‌సేల్ గోల్డ్ బార్ల రూపంలో విక్రయిస్తుంది. 2023 చివర్లో ఎంజీకేఎల్ మాస్కో స్టాక్ ఎక్స్చేంజ్‌లో ఐపీఓను కూడా విజయవంతంగా పూర్తి చేసింది.

అత్య‌ధిక ప్రైవేట్ గోల్డ్ నిల్వ‌లు భార‌త్‌లోనే..

కాగా గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీ అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇక్కడ సరళమైన నియంత్రణ వ్యవస్థ, పన్ను రాయితీలు, సాధారణ భారతీయ చట్టపరమైన వ్యవస్థ కంటే మరింత సౌకర్యవంతమైన ఆర్థిక మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. అందుకే విదేశీ ఆర్థిక సంస్థలు గిఫ్ట్ సిటీపై ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటాయి. భారత్‌ను ఎంచుకోవడం వెనుక ఎంజీకేఎల్ వ్యూహం బలంగా కనిపిస్తోంది. భారతీయ కుటుంబాలు, ఆలయాల వద్ద కలిపి సుమారు 25వేల నుంచి 35వేల టన్నుల బంగారం నిల్వగా ఉందని అంచనా. దీంతో ప్రపంచంలోనే అత్యధిక ప్రైవేట్ గోల్డ్ నిల్వలు కలిగిన దేశంగా భారత్ నిలిచింది. ఈ బంగారం విలువ సుమారు 2.4 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల వరకు ఉండవచ్చని అంచనా. ఇది ప్రపంచంలోని టాప్ 10 కేంద్ర బ్యాంకుల బంగారు నిల్వల మొత్తం విలువ కంటే కూడా ఎక్కువగా ఉండటం విశేషం.

Advertisement

తాజావార్తలు

Advertisement