త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sanjay Raut | మాల్యా మోసగాడు కాదు.. మోదీ ప్రసంగాలు బాగుంటాయి.. సంజయ్‌ రౌత్‌ పుస్తకంలో ఆసక్తికర వ్యాఖ్యలు

Sanjay Raut | శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్‌ రౌత్‌ రాసిన కొత్త పుస్తకం ‘బోధ్‌ కీర్తన్‌’ రాజకీయ, వ్యాపార వర్గాల్లో చర్చకు తెరతీస్తోంది. ఇందులో పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడిగా ప్రకటించిన విజయ్‌ మాల్యాకు రౌత్‌ మద్దతుగా నిలవడం ఆసక్తికరంగా మారింది. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయేతర ప్రసంగాలను ప్రశంసించడం కూడా చర్చనీయాంశమైంది.

P

National | Published On Oct 30, 2026, 9.00 pm IST

Sanjay Raut | మాల్యా మోసగాడు కాదు.. మోదీ ప్రసంగాలు బాగుంటాయి.. సంజయ్‌ రౌత్‌ పుస్తకంలో ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement

Sanjay Raut | శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్‌ రౌత్‌ రాసిన కొత్త పుస్తకం ‘బోధ్‌ కీర్తన్‌’ రాజకీయ, వ్యాపార వర్గాల్లో చర్చకు తెరతీస్తోంది. ఇందులో పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడిగా ప్రకటించిన విజయ్‌ మాల్యాకు రౌత్‌ మద్దతుగా నిలవడం ఆసక్తికరంగా మారింది. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయేతర ప్రసంగాలను ప్రశంసించడం కూడా చర్చనీయాంశమైంది. శనివారం విడుదల కానున్న ఈ పుస్తకంలో పలువురు ప్రముఖులతో తన అనుభవాలు, అభిప్రాయాలను రౌత్‌ ప్రస్తావించారు. ‘మాల్యా చీ గోష్ట్‌’ పేరుతో రాసిన చాప్ట‌ర్‌లో విజయ్‌ మాల్యాతో తనకున్న పరిచయాన్ని సంజయ్‌ రౌత్‌ వివరించారు. పార్లమెంట్‌లో, సెంట్రల్‌ హాల్‌లో మాల్యాతో తరచూ మాట్లాడేవాడినని పేర్కొన్నారు. ఆయన స్నేహపూర్వకంగా, ఉల్లాసంగా ఉండేవారని, ఉదార స్వభావం కలిగిన వ్యక్తిగా తనకు కనిపించారని రాశారు. మాల్యా విలాసవంతమైన జీవనశైలి ఆయన వ్యాపారంలో భాగమని, దాన్ని తప్పుగా చూడకూడదని అభిప్రాయపడ్డారు. ఆయనను మోసగాడిగా తాను భావించడం లేదని పేర్కొన్నారు.

బ్యాంకులు ఆదుకోవాల్సింది..

వ్యాపారం కుదేలై అప్పులు చెల్లించలేని పరిస్థితిలో మాల్యా భారత్‌ విడిచి వెళ్లారని రౌత్‌ తన పుస్తకంలో పేర్కొన్నారు. ఆయనకు రుణమాఫీ కాకుండా తాత్కాలిక ఉపశమనం కావాలని భావించారని రాశారు. అలాంటి సమయంలో బ్యాంకులు ఆదుకోవాల్సిందని అభిప్రాయపడ్డారు. గత పదేళ్లలో మోదీ ప్రభుత్వం పలువురు పారిశ్రామికవేత్తలకు రుణాల విషయంలో వెసులుబాటు కల్పించిందని, మాల్యాకు కూడా అలాంటి అవకాశం ఇచ్చి ఉండవచ్చని పేర్కొన్నారు. అయితే, ఇవి రౌత్‌ వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. రుణ ఎగవేతలు, మనీలాండరింగ్‌ ఆరోపణల నేపథ్యంలో భారత్‌లో కేసులు ఎదుర్కొంటున్న మాల్యా ప్రస్తుతం బ్రిటన్‌లో ఉంటున్నారు. 2019లో ఆయనను పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడిగా ప్రకటించారు.

మోదీ రాజకీయేతర ప్రసంగాలపై ప్రశంసలు

‘దీపస్తంభ్‌’ అనే మరో చాప్ట‌ర్‌లో ప్రధాని మోదీ ప్రసంగాలపై రౌత్‌ తన అభిప్రాయాలను వెల్లడించారు. మోదీ రాజకీయ ప్రసంగాల్లో పెద్దగా లోతు, ప్రభావం కనిపించవని పేర్కొన్న ఆయన.. రాజకీయేతర ప్రసంగాలు మాత్రం వినడానికి, చదవడానికి బాగుంటాయని ప్రశంసించారు. ముఖ్యంగా అయోధ్యలో దీపోత్సవం సందర్భంగా మోదీ చేసిన ప్రసంగాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. శ్రీరాముడి ఆదర్శాలను ప్రజలకు వివరించిన తీరు భావోద్వేగంగా, ప్రభావవంతంగా ఉందని పేర్కొన్నారు. ఆ ప్రసంగం భారతీయులందరికీ మార్గదర్శకంగా నిలిచే సందేశాన్ని ఇచ్చిందని రాశారు. సంజయ్‌ రౌత్‌ కొత్త పుస్తకం ‘బోధ్‌ కీర్తన్‌’ శనివారం విడుదల కానుంది. ఈ కార్యక్రమానికి ఠాక్రే సోదరులు హాజరయ్యే అవకాశం ఉంది. రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులతో తన అనుభవాలు, పరిచయాలు, పరిశీలనలను రౌత్‌ ఇందులో పొందుపరిచారు. మాల్యాపై సానుకూల అభిప్రాయాలు వ్యక్తం చేయడంతోపాటు, మోదీ రాజకీయేతర ప్రసంగాలను ప్రశంసించడం ఈ పుస్తకానికి ప్రత్యేక ఆకర్షణగా మారింది.

ట్యాగ్స్:

Bodh KirtanMaharashtraPm ModiSanjay RautTelugu NewsVijay Mallya
Advertisement
Advertisement