త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Reliance AGM | రిలయన్స్ ఏజీఎం తేదీ ఫిక్స్‌.. అంద‌రి చూపు జియో ఐపీఓపైనే..

Reliance AGM | దేశీయ‌ దిగ్గజ సంస్థ రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ తన 49వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)ను జూన్ 19న నిర్వహించనున్నట్లు ప్రకటించింది. వీడియో కాన్ఫరెన్స్, ఇతర ఆడియో-విజువల్ మాధ్యమాల ద్వారా మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఈ విషయాన్ని కంపెనీ స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్‌లో వెల్లడించింది.

S

Business | Published On May 28, 2026, 2.29 pm IST

Reliance AGM | రిలయన్స్ ఏజీఎం తేదీ ఫిక్స్‌.. అంద‌రి చూపు జియో ఐపీఓపైనే..
Advertisement

Reliance AGM | దేశీయ‌ దిగ్గజ సంస్థ రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ తన 49వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)ను జూన్ 19న నిర్వహించనున్నట్లు ప్రకటించింది. వీడియో కాన్ఫరెన్స్, ఇతర ఆడియో-విజువల్ మాధ్యమాల ద్వారా మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఈ విషయాన్ని కంపెనీ స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్‌లో వెల్లడించింది. ఎఫ్‌వై26 డివిడెండ్‌కు అర్హులైన షేర్‌హోల్డర్లను నిర్ణయించేందుకు జూన్ 5ను రికార్డ్ డేట్‌గా కంపెనీ నిర్ణయించింది. మార్చి 2026తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి షేర్‌కు రూ.6 డివిడెండ్‌ను ఇప్పటికే బోర్డు సిఫార్సు చేసింది. ఏజీఎంలో ఆమోదం లభిస్తే సమావేశం జరిగిన ఏడు రోజులలోపు డివిడెండ్ చెల్లించనున్నారు. అలాగే ఏజీఎం తీర్మానాలపై ఓటు వేసే హక్కు కలిగిన షేర్‌హోల్డర్లను గుర్తించేందుకు జూన్ 12ను కట్-ఆఫ్ డేట్‌గా నిర్ణయించారు.

భారీగా పెరిగిన ఆదాయం..

ఈసారి ఏజీఎంపై మార్కెట్‌లో భారీ ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా కంపెనీ కన్స్యూమర్, డిజిటల్ వ్యాపారాలు బలమైన వృద్ధిని కొనసాగిస్తున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు కీలక ప్రకటనల కోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓపై ఎలాంటి అప్డేట్ వస్తుందనే దానిపై మార్కెట్ దృష్టి కేంద్రీకృతమైంది. మార్చి త్రైమాసికంలో రిలయన్స్ కన్సాలిడేటెడ్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 13 శాతం తగ్గి రూ.16,971 కోట్లకు చేరింది. గతేడాది ఇదే కాలంలో ఇది రూ.19,407 కోట్లుగా నమోదైంది. అయితే కార్యకలాపాల ఆదాయం 13 శాతం పెరిగి రూ.2.98 లక్షల కోట్లకు చేరింది. పూర్తి ఆర్థిక సంవత్సరం ఎఫ్‌వై26లో రిలయన్స్ మొత్తం ఆదాయం రూ.11,75,919 కోట్లుగా నమోదైంది. ఇది గతేడాదితో పోలిస్తే 10 శాతం వృద్ధి కావ‌డం విశేషం. వార్షిక ఈబిట్డా 13.4 శాతం పెరిగి రూ.2,07,911 కోట్లకు చేరగా, పన్నుల తర్వాత లాభం 17.8 శాతం పెరిగి రూ.95,754 కోట్లకు చేరింది.

అంద‌రి చూపు జియో ఐపీఓ పైనే..

కంపెనీ తెలిపిన ప్రకారం ఆయిల్-టు-కెమికల్స్, డిజిటల్ సర్వీసులు, రిటైల్ వ్యాపారాల వృద్ధి ఈ ఫలితాలకు ప్రధాన కారణమయ్యాయి. మొత్తం ఈబిట్డాలో 55 శాతానికి పైగా కన్స్యూమర్ ఆధారిత వ్యాపారాల నుంచే రావడం రిలయన్స్ ఆదాయ నిర్మాణంలో పెద్ద మార్పును సూచిస్తోంది. రిల‌య‌న్స్ రిటెయిల్ వెంచ‌ర్స్ కూడా బలమైన వృద్ధిని కొనసాగించింది. కంపెనీ వార్షిక లాభం రూ.14వేల కోట్లకు చేరువై 11.7 శాతం వృద్ధిని నమోదు చేసింది. మరోవైపు జియో ప్లాట్‌ఫామ్స్ పన్నుల తర్వాత లాభం రూ.30వేల కోట్లను దాటి 15.1 శాతం వృద్ధి సాధించింది. ఇక పెట్టుబడిదారుల దృష్టి మొత్తం ఏజీఎంపైనే ఉంది. రిలయన్స్ తదుపరి పెట్టుబడుల ప్రణాళికలు, రిటైల్ విస్తరణ, జియో ఐపీఓ, అలాగే కొత్త ఎనర్జీ వ్యాపారాలపై ఎలాంటి ప్రకటనలు వస్తాయో మార్కెట్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. జియో ఐపీఓపై ఈ స‌మావేశంలో ప్ర‌క‌ట‌న చేస్తార‌ని పెట్టుబ‌డిదారులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Advertisement
Advertisement