త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Crude Oil | భార‌త్‌కు ఇంధ‌న‌ క‌ష్టాలు తీరిన‌ట్లేనా.. చ‌వ‌క ధ‌ర‌కే వెనిజులా నుంచి చ‌మురు..

Crude Oil | ప్రపంచ చమురు మార్కెట్లలో కొనసాగుతున్న అనిశ్చితి నేప‌థ్యంలో భారత్‌కు వెనిజులా కీలక క్రూడ్ ఆయిల్ సరఫరాదారుగా మారింది. మే నెలలో భారత్‌కు అత్యధికంగా క్రూడ్ సరఫరా చేసిన దేశాల జాబితాలో వెనిజులా మూడో స్థానానికి చేరుకుని, సౌదీ అరేబియా, అమెరికాను వెనక్కి నెట్టింది.

S

Business | Published On May 22, 2026, 11.50 am IST

Crude Oil | భార‌త్‌కు ఇంధ‌న‌ క‌ష్టాలు తీరిన‌ట్లేనా.. చ‌వ‌క ధ‌ర‌కే వెనిజులా నుంచి చ‌మురు..
Advertisement

Crude Oil | ప్రపంచ చమురు మార్కెట్లలో కొనసాగుతున్న అనిశ్చితి నేప‌థ్యంలో భారత్‌కు వెనిజులా కీలక క్రూడ్ ఆయిల్ సరఫరాదారుగా మారింది. మే నెలలో భారత్‌కు అత్యధికంగా క్రూడ్ సరఫరా చేసిన దేశాల జాబితాలో వెనిజులా మూడో స్థానానికి చేరుకుని, సౌదీ అరేబియా, అమెరికాను వెనక్కి నెట్టింది. ఎనర్జీ కార్గో ట్రాకర్ కెప్ల‌ర్ డేటా ప్రకారం మే నెలలో ఇప్పటివరకు వెనిజులా భారత్‌కు రోజుకు సుమారు 4.17 లక్షల బ్యారెల్స్ క్రూడ్ ఆయిల్ సరఫరా చేసింది. ఏప్రిల్‌లో ఇది 2.83 లక్షల బ్యారెల్స్ మాత్రమే. అంతకుముందు తొమ్మిది నెలల పాటు వెనిజులా నుంచి భారత్‌కు ఎలాంటి క్రూడ్ దిగుమతులు జరగలేదు. ప్రస్తుతం ప‌శ్చిమ‌ ఆసియా సంక్షోభం, హోర్ముజ్ జలసంధి పరిసరాల్లో అంతరాయాలు, గ్లోబల్ సరఫరా మార్పులతో భారత్ తన క్రూడ్ కొనుగోలు వ్యూహాన్ని వేగంగా మార్చుకుంటోంది. మే నెలలో భారత్‌కు వెనిజులా కంటే ఎక్కువగా చమురు సరఫరా చేసిన దేశాలుగా కేవలం రష్యా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మాత్రమే నిలిచాయి.

చ‌వ‌క ధ‌ర‌కే వెనిజులా క్రూడ్‌..

అయితే దీనికి ప్రధాన కారణం ధరలు అని నిపుణులు చెబుతున్నారు. వెనిజులా క్రూడ్ ప్రస్తుతం ఇతర అంతర్జాతీయ గ్రేడ్లతో పోలిస్తే చౌకగా లభిస్తోంది. అధిక క్రూడ్ ధరలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య భారత రిఫైనరీలకు ఇది ఆకర్షణీయంగా మారింది. వెనిజులా క్రూడ్ తక్కువ ధరలో లభించడం మాత్రమే కాకుండా, భారత రిఫైనరీల సాంకేతిక సామర్థ్యాలకు కూడా అనుకూలంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రత్యేకంగా రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ వంటి సంస్థలు వెనిజులా హెవీ, హై-సల్ఫర్ క్రూడ్‌ను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నాయి. గుజరాత్‌లోని జామ్‌నగర్ రిఫైనరీ వంటి క్లిష్ట రిఫైనింగ్ వ్యవస్థలకు ఈ రకం క్రూడ్ బాగా సరిపోతుంది. భారత్‌లోని చాలా రిఫైనరీలు వెనిజులా క్రూడ్‌ను పరిమిత స్థాయిలో మాత్రమే ప్రాసెస్ చేయగలుగుతున్నా, రిలయన్స్ ఆధునిక మౌలిక వసతుల వల్ల ఎక్కువ లాభం పొందుతోంది. మే నెలలో భారత్ మొత్తం క్రూడ్ దిగుమతులు నెలవారీగా 8 శాతం పెరిగి రోజుకు సుమారు 49 లక్షల బ్యారెల్స్‌కు చేరాయి. అయినప్పటికీ ఫిబ్రవరిలో నమోదైన 52 లక్షల బ్యారెల్స్ స్థాయికి ఇంకా చేరుకోలేదు.

గ‌ల్ఫ్ నుంచి భారీగా త‌గ్గిన వాల్యూమ్‌..

ఇరాన్ యుద్ధం కారణంగా ప‌శ్చిమ‌ ఆసియా నుంచి ఇంధన సరఫరాలు దెబ్బతినడంతో ఈ తగ్గుదల కనిపించింది. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి దాదాపు మూసివేత స్థితికి చేరుకోవడం మధ్యప్రాచ్య దేశాల నుంచి సరఫరాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఈ నెలలో కొంత మేర ఇరాక్ సరఫరాలు పునఃప్రారంభమైనా, వాల్యూమ్స్ మాత్రం భారీగా తగ్గాయి. ఫిబ్రవరిలో రోజుకు దాదాపు 9.69 లక్షల బ్యారెల్స్ సరఫరా చేసిన ఇరాక్, మేలో ఇప్పటివరకు కేవలం 51 వేల బ్యారెల్స్ మాత్రమే భారత్‌కు పంపింది. అమెరికా ఈ ఏడాది ప్రారంభంలో కొన్ని ఆంక్షలను సడలించడంతో, ఏప్రిల్‌లో భారత్ ఇరాన్ నుంచి మళ్లీ క్రూడ్ దిగుమతులు ప్రారంభించింది. దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత భారత్‌కు ఇరాన్ చమురు రావడం ఇదే మొదటిసారి. అయితే తాజా ఘర్షణల నేపథ్యంలో అమెరికా నౌకాదళం ఇరాన్ పోర్టుల చుట్టూ దిగ్బంధం విధించడంతో ఈ నెలలో ఒక్క ఇరానియన్ కార్గో కూడా భారత్‌కు చేరలేదు. దీంతో భారత రిఫైనరీలు ప్రత్యామ్నాయ వనరుల కోసం వెతకాల్సి వచ్చింది. ఈ పరిస్థితి వెనిజులా, యూఏఈ వంటి దేశాలకు లాభించింది.

వెనుక‌బ‌డ్డ సౌదీ..

ఫిబ్రవరి వరకు భారత్‌కు మూడో అతిపెద్ద చమురు సరఫరాదారుగా ఉన్న సౌదీ అరేబియా ఇప్పుడు వెనుకబడింది. మే నెలలో సౌదీ నుంచి భారత్‌కు సరఫరాలు దాదాపు సగానికి పడిపోయి రోజుకు 3.4 లక్షల బ్యారెల్స్‌కు చేరాయి. ఏప్రిల్‌లో ఇది 6.7 లక్షల బ్యారెల్స్‌గా ఉంది. సౌదీ క్రూడ్ అధిక ధరలు వెనిజులా చౌక క్రూడ్‌తో పోటీ పడలేకపోయాయి. ప్రపంచంలో మూడో అతిపెద్ద క్రూడ్ దిగుమతిదారు, వినియోగదారైన భారత్ తన ఇంధన అవసరాలకు భారీగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. ప్రస్తుతం దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం, రూపాయి బలహీనపడటం, ద్రవ్యోల్బణ ఆందోళనలు పెరగడం వంటి పరిణామాల మధ్య వెనిజులా నుంచి చౌక చమురు దిగుమతులు రిఫైనరీలకు కొంత ఉపశమనం కలిగించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

Advertisement
Advertisement