త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RBI | బ్యాంకులకు ఆర్‌బీఐ కొత్త డేటా రూల్స్.. డేటా గవర్నెన్స్ కమిటీ తప్పనిసరి..

RBI | భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీలు), తన నియంత్రణలో ఉన్న ఇతర సంస్థల కోసం డేటా రిస్క్ నిర్వహణపై కీలక ప్రతిపాదనలు విడుదల చేసింది. మొత్తం రిస్క్ మేనేజ్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్‌లో భాగంగా డేటా రిస్క్‌ను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక ప్రక్రియలను ఏర్పాటు చేయాలని సూచించింది.

S

Business | Published On Jul 16, 2026, 2.17 pm IST

RBI | బ్యాంకులకు ఆర్‌బీఐ కొత్త డేటా రూల్స్.. డేటా గవర్నెన్స్ కమిటీ తప్పనిసరి..
Advertisement

RBI | భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీలు), తన నియంత్రణలో ఉన్న ఇతర సంస్థల కోసం డేటా రిస్క్ నిర్వహణపై కీలక ప్రతిపాదనలు విడుదల చేసింది. మొత్తం రిస్క్ మేనేజ్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్‌లో భాగంగా డేటా రిస్క్‌ను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక ప్రక్రియలను ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ మేరకు డేటా గవర్నెన్స్‌కు సంబంధించిన ముసాయిదా మార్గదర్శకాలను ఆర్‌బీఐ విడుదల చేసింది. ఇందులో డేటా గవర్నెన్స్‌కు సంబంధించిన బాధ్యతలు, డేటా ఆర్కిటెక్చర్, మెటాడేటా, డేటా లినియేజ్, డేటా నాణ్యత, అలాగే థర్డ్ పార్టీ సంస్థలతో డేటా షేరింగ్ ఏర్పాట్లపై విస్తృత నియంత్రణ అంచనాలను వెల్లడించింది.

డేటా నియంత్రిత అవ‌సరం..

ఆర్థిక రంగం వేగంగా డిజిటల్‌గా మారుతున్న నేపథ్యంలో, టెక్నాలజీ ఆధారిత వ్యాపార నమూనాలు విస్తరిస్తుండటంతో డేటా నియంత్రిత సంస్థలకు అత్యంత కీలకమైన ఆస్తిగా మారిందని ఆర్‌బీఐ పేర్కొంది. డేటా పరిమాణం, వైవిధ్యం, వేగం నిరంతరం పెరుగుతున్నందున అది క‌చ్చితమైనది, స్థిరమైనది, సురక్షితమైనది, అన్ని వ్యవస్థలు, విభాగాల్లో ఉపయోగించేందుకు అనుకూలంగా ఉండేలా సమర్థవంతమైన డేటా గవర్నెన్స్ అవసరమని స్పష్టం చేసింది. డేటా గవర్నెన్స్‌లో బలహీనతలు ఉంటే నియంత్రిత సంస్థలు ఆర్థిక, కార్యాచరణ, నిబంధనల అమలు, ప్రతిష్ఠాపరమైన ప్రమాదాలను ఎదుర్కోవాల్సి రావచ్చని ఆర్‌బీఐ హెచ్చరించింది. ప్రతిపాదిత నిబంధనల ప్రకారం నియంత్రిత సంస్థలు డేటా లక్షణాలు, నిర్మాణం, మూలాలు, నాణ్యత, వర్గీకరణ వంటి అంశాలను గుర్తించి, డేటాకు సంబంధించిన రిస్క్‌లను అంచనా వేయడం, పర్యవేక్షించడం, నిర్వహించడం తప్పనిసరి అవుతుంది.

ప్ర‌త్యేక డేటా గ‌వ‌ర్నెన్స్ క‌మిటీ ఉండాలి..

అలాగే ఎగ్జిక్యూటివ్ స్థాయిలో ప్రత్యేక డేటా గవర్నెన్స్ కమిటీని ఏర్పాటు చేయాలని లేదా ఇప్పటికే ఉన్న ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఈ బాధ్యతలు అప్పగించాలని ఆర్‌బీఐ ప్రతిపాదించింది. ఈ కమిటీలో డేటా విభాగం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, సంబంధిత వ్యాపార విభాగాలు, రిస్క్ మేనేజ్‌మెంట్, కంప్లయన్స్ ప్రతినిధులు ఉండాలని సూచించింది. ప్రతి నియంత్రిత సంస్థ బోర్డు డేటా గవర్నెన్స్ ఫ్రేమ్‌వర్క్‌ను పర్యవేక్షిస్తూ, సంబంధిత నివేదికలు, పనితీరు సూచికలను సమీక్షించాల్సి ఉంటుంది. అవసరమైతే మరింత తరచూ, లేదా కనీసం సంవత్సరానికి ఒకసారి ఈ ఫ్రేమ్‌వర్క్‌ను సమీక్షించాలని ఆర్‌బీఐ ప్రతిపాదించింది. డేటా నిర్వహణలో లైఫ్‌సైకిల్ ఆధారిత విధానాన్ని కూడా ఆర్‌బీఐ సూచించింది. డేటా సృష్టి లేదా సేకరణ నుంచి చివరకు తొలగించే దశ వరకు ప్రతి దశలో ఒకే విధమైన ప్రమాణాలతో డేటాను నిర్వహించాలని పేర్కొంది. డేటా జీవితచక్రంలోని ప్రతి దశలో రిస్క్‌లను గుర్తించి, వాటిని తగ్గించేలా ఈ విధానాన్ని రూపొందించింది.

అభిప్రాయాల‌ను కోరుతున్న ఆర్‌బీఐ..

అలాగే డేటాను కేవలం స్పష్టంగా నిర్వచించిన, చట్టబద్ధమైన అవసరాల కోసమే సృష్టించాలి లేదా సేకరించాలని ముసాయిదా మార్గదర్శకాలు స్పష్టం చేశాయి. సంస్థ ఆమోదించిన వ్యాపార లక్ష్యాలు, రిస్క్ విధానాలు, చట్టపరమైన, నియంత్రణ అవసరాలకు అనుగుణంగా మాత్రమే డేటా వినియోగం ఉండాలని పేర్కొన్నాయి. ఈ ముసాయిదా మార్గదర్శకాలపై అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలను ఆర్‌బీఐ ఆహ్వానించింది. ఆగస్టు 17 వరకు సూచనలు, అభిప్రాయాలను సమర్పించవచ్చని తెలిపింది.

Advertisement
Advertisement