త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BRS former MLAs | మామునూర్ ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి ఘ‌న‌త‌ బీఆర్ఎస్‌దే.. అప్పుడే 253 ఎకరాలకు ఆమోదం వ‌చ్చింది

BRS former MLAs | బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే 253 ఎకరాల భూసేకరణకు కేబినెట్ ఆమోదం లభించిందని మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, ఆరూరి రమేష్, నన్నపనేని నరేందర్ గుర్తు చేశారు. మామునూర్ ఎయిర్‌పోర్ట్‌పై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వ్యాఖ్య‌ల‌ను వారు తీవ్రంగా ఖండించారు.

S

Telangana | Published On Jul 16, 2026, 1.15 pm IST

BRS former MLAs | మామునూర్ ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి ఘ‌న‌త‌ బీఆర్ఎస్‌దే.. అప్పుడే 253 ఎకరాలకు ఆమోదం వ‌చ్చింది
Advertisement
  • కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యలు స‌రికాదు
  • ర‌న్ వేను 3.8 కి.మీ విస్తరించేందుకు రైతులను ఒప్పించాం
  • కేటీఆర్ ఎన్నోసార్లు కేంద్ర‌మంత్రుల‌ను క‌లిశారు
  • రేవంత్ రెడ్డి టీడీపీకి, నాయిని రాజేందర్ రెడ్డి రేవంత్‌కు ప్రతిరూపంలా ఉన్నారు
  • మీడియా స‌మావేశంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేల విమ‌ర్శ‌లు

BRS former MLAs | త్రినేత్ర‌.న్యూస్‌: బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే 253 ఎకరాల భూసేకరణకు కేబినెట్ ఆమోదం లభించిందని మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, ఆరూరి రమేష్, నన్నపనేని నరేందర్ గుర్తు చేశారు. మామునూర్ ఎయిర్‌పోర్ట్‌పై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వ్యాఖ్య‌ల‌ను వారు తీవ్రంగా ఖండించారు. హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. 1.8 కి.మీ రన్ వేను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా 3.8 కి.మీగా విస్తరించేందుకు రైతులను ఒప్పించి భూసేకరణ చేపట్టామని తెలిపారు. ఈ ఎయిర్‌పోర్టు అభివృద్ధి కోసం కేటీఆర్ అనేకసార్లు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలిశార‌న్నారు.

ఈ సంద‌ర్భంగా మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ తర్వాత వరంగల్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. ఈ ఎయిర్‌పోర్టు నిజాం కాలంలో నిర్మించిన‌ట్లు చెప్పారు. ఉడాన్ (UDAN) పథకం సమయంలో కూడా కేంద్రంతో నిరంతరం చర్చలు జరిపిన ఘటనలు అనేకం ఉన్నాయ‌న్నారు. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, GMR సంస్థతో కేటీఆర్ చర్చించి ముందుకు తీసుకెళ్లారని తెలిపారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన పోరాడతామని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు ఢిల్లీ వెళ్లినా తెలంగాణకు పెద్దగా ప్రయోజనం చేకూరలేదని విమర్శించారు.

 

అనంత‌రం మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మాట్లాడారు. ఈ ఎయిర్‌పోర్టు కోసం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే భూసేకరణ జరిగింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే 253 ఎకరాల భూసేకరణకు కేబినెట్ ఆమోదం లభించింది. కేసీఆర్ హయాంలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహించాం. ఎన్నికల కోడ్ కారణంగా నియామకాలు నిలిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేశారు.
కోచ్ ఫ్యాక్టరీ కోసం రూ.500 కోట్లతో భూసేకరణ చేపట్టాం. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని కాంగ్రెస్ తమ ఖాతాలో వేసుకోవడం సరికాదు. దేశాన్ని ఎక్కువకాలం పాలించిన కాంగ్రెస్ మామునూర్ ఎయిర్‌పోర్టును ఎందుకు అభివృద్ధి చేయలేదు? రేవంత్ రెడ్డి టీడీపీకి, నాయిని రాజేందర్ రెడ్డి రేవంత్‌కు ప్రతిరూపంగా ఉన్నారు అని విమ‌ర్శించారు.

మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని కాంగ్రెస్ నాయకులు చేశారని చెప్పుకోవ‌డం సిగ్గుచేట‌న్నారు. భూ సేకరణకు అనుమతి ఇచ్చింది ఎవరో ఒక్కసారి తెలుసుకోవాలని హిత‌వు ప‌లికారు. దేశంలో అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్ ఎయిర్‌పోర్టును ఎందుకు పునర్మించలేద‌ని నిల‌దీశారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు ఊరుకోరని హెచ్చ‌రించారు. మామునూర్ ఎయిర్‌పోర్టును తీసుకొచ్చింది ముమ్మాటికీ బీఆర్ఎస్ ప్ర‌భుత్వ‌మేన‌ని నొక్కి చెప్పారు.

Advertisement
Advertisement