RBI | ఇక బ్యాంకులు బలవంతంగా ఆర్థిక ఉత్పత్తులను విక్రయించడం కుదరదు.. ఆర్బీఐ కొత్త రూల్స్..
RBI | బ్యాంకులు లేదా ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ల ఉద్యోగులు రుణాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు లేదా ఇతర బ్యాంకింగ్ సేవలతో పాటు ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్ లేదా ఇతర పెట్టుబడి పథకాలను కొనుగోలు చేయాలని కస్టమర్లపై ఒత్తిడి చేయడం చాలా సందర్భాల్లో జరుగుతోంది. పూర్తి సమాచారం లేకుండానే చాలా మంది వినియోగదారులు ఇటువంటి ఆర్థిక ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు.
RBI | బ్యాంకులు లేదా ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ల ఉద్యోగులు రుణాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు లేదా ఇతర బ్యాంకింగ్ సేవలతో పాటు ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్ లేదా ఇతర పెట్టుబడి పథకాలను కొనుగోలు చేయాలని కస్టమర్లపై ఒత్తిడి చేయడం చాలా సందర్భాల్లో జరుగుతోంది. పూర్తి సమాచారం లేకుండానే చాలా మంది వినియోగదారులు ఇటువంటి ఆర్థిక ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు ఇటువంటి ఘటనలకు అడ్డుకట్ట వేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఈ నిబంధనలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. వీటి ద్వారా కస్టమర్ల ప్రయోజనాలకు మరింత మెరుగైన రక్షణ లభించనుంది.
కస్టమర్ సమ్మతి తప్పనిసరి..
ఆర్‌బీఐ కొత్త నిబంధనల ప్రకారం, ఇకపై ఏ ఆర్థిక ఉత్పత్తినైనా కస్టమర్ స్పష్టమైన సమ్మతి లేకుండా విక్రయించడానికి అనుమతి ఉండదు. బ్యాంకు లేదా ఎన్‌బీఎఫ్‌సీ కస్టమర్ నుంచి తప్పనిసరిగా లిఖితపూర్వకంగా లేదా డిజిటల్ రూపంలో ఆమోదం తీసుకోవాలి. ఒకే ఫామ్‌లో ఒకటి కంటే ఎక్కువ ఉత్పత్తులు ఉంటే, ప్రతి ఉత్పత్తిని విడిగా చూపించాలి. దీంతో కస్టమర్ తన అవసరానికి అనుగుణంగా ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. తెలియకుండానే సమ్మతి ఇచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి. కొత్త నిబంధనల్లో మరో ముఖ్యమైన అంశాన్ని కూడా ఆర్‌బీఐ స్పష్టం చేసింది. రుణం లేదా ఇతర బ్యాంకింగ్ సేవలు అందించే పేరుతో ఏదైనా నిర్దిష్ట ఇన్సూరెన్స్ లేదా పెట్టుబడి పథకాన్ని కొనుగోలు చేయాలని బ్యాంకులు కస్టమర్లను బలవంతం చేయకూడదు. కస్టమర్లు తమకు నచ్చిన ఏ కంపెనీ నుంచి అయినా ఇన్సూరెన్స్ లేదా ఇతర ఆర్థిక ఉత్పత్తులను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ కలిగి ఉంటారు. దీంతో వారికి మరిన్ని ఎంపికలు లభించడంతోపాటు తమ అవసరాలు, బడ్జెట్‌కు అనుగుణంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది.
అన్నీ పరిశీలించాకే సిఫారసు చేయాలి..
కస్టమర్ వయస్సు, ఆదాయం, ఆర్థిక పరిస్థితి, పెట్టుబడి లక్ష్యం, రిస్క్ తీసుకునే సామర్థ్యాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే ఏ ఉత్పత్తినైనా సిఫారసు చేయాలని ఆర్‌బీఐ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ఆదేశించింది. కస్టమర్ అవసరాలు లేదా సామర్థ్యానికి సరిపోని ఉత్పత్తిని విక్రయించడం తప్పుగా పరిగణించనుంది. దీంతో కేవలం కమిషన్ కోసం అనుకూలం కాని ఉత్పత్తులను విక్రయించే విధానానికి చెక్ పడనుంది. ఆన్‌లైన్ ద్వారా జరిగే విక్రయాలపై కూడా ఆర్‌బీఐ కఠిన నిబంధనలు అమలు చేయనుంది. ఇకపై వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌లలో ముందుగానే టిక్ చేసిన ఎంపికలు, పదేపదే వచ్చే పాప్-అప్‌లు, దాచిన ఛార్జీలు లేదా త్వరగా నిర్ణయం తీసుకునేలా ఒత్తిడి చేసే డిజైన్‌లను ఉపయోగించకూడదు. కస్టమర్లు ఏ ఆఫర్‌నైనా సులభంగా తిరస్కరించవచ్చు. అవసరమైతే కొనుగోలు చేసిన ఉత్పత్తిని రద్దు చేసే ప్రక్రియ కూడా గతంతో పోలిస్తే మరింత సులభంగా ఉండనుంది.

తప్పు చేసినట్లు తేలితే జరిమానా..
తప్పుడు సమాచారం ఇచ్చి లేదా ఒత్తిడి చేసి ఏదైనా ఆర్థిక ఉత్పత్తిని కస్టమర్‌కు విక్రయించినట్లు దర్యాప్తులో తేలితే, సంబంధిత బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ కస్టమర్ చెల్లించిన మొత్తాన్ని పూర్తిగా తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఆ ఉత్పత్తిని చెల్లనిదిగా పరిగణిస్తారు. దీంతో పాటు కస్టమర్‌కు అదనపు ఆర్థిక నష్టం జరిగితే, బ్యాంకు పాలసీ ప్రకారం పరిహారం కూడా చెల్లించే అవకాశం ఉంటుంది. తనకు ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్ లేదా ఇతర ఆర్థిక ఉత్పత్తిని తప్పుగా విక్రయించారని కస్టమర్ భావిస్తే, సంబంధిత బ్యాంకు లేదా ఆర్థిక సంస్థకు ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు చేసే గడువు సంబంధిత నియంత్రణ సంస్థ నిబంధనల ప్రకారం ఉంటుంది. ఒకవేళ ప్రత్యేక గడువు నిర్ణయించకపోతే, కస్టమర్ 30 రోజులలోపు ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. ఫిర్యాదు అందుకున్న తర్వాత బ్యాంకు తప్పనిసరిగా దానిపై విచారణ చేపట్టాలి.
కస్టమర్లకు పెరగనున్న విశ్వాసం..
ఈ కొత్త నిబంధనలతో కస్టమర్ల విశ్వాసం మరింత బలపడుతుందని, ఆర్థిక రంగంలో పారదర్శకత పెరుగుతుందని ఆర్‌బీఐ భావిస్తోంది. ఇకపై బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు కేవలం విక్రయాలను పెంచడంపై కాకుండా కస్టమర్ల ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో తప్పుదోవ పట్టించి ఆర్థిక ఉత్పత్తులను విక్రయించే ఘటనలు తగ్గడంతోపాటు ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇతర పెట్టుబడి ఉత్పత్తుల్లో ప్రజలు మరింత విశ్వాసంతో పెట్టుబడులు పెట్టగలుగుతారు.
తాజావార్తలు
- ●Madhusudhana Chary | మండలిలో మాదే మెజారిటీ.. ఆరుగురు సభ్యులున్న కాంగ్రెస్ ఎలా తీర్మానం పాస్ చేస్తుంది?
- ●DK Aruna | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందే.. ఎంపీ డీకే అరుణ డిమాండ్
- ●RS Praveen Kumar | స్పీకర్‌ను ప్రతిసారీ అవమానిస్తున్నది కాంగ్రెస్సే: ఆర్ఎస్ ప్రవీణ్
- ●Telangana Assembly Resolution | కేసీఆర్ క్షమాపణకు అసెంబ్లీలో తీర్మానం
- ●RS Praveen Kumar | కేసీఆర్ హత్యకు రేవంత్‌రెడ్డి కుట్ర.. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సంచలన వ్యాఖ్యలు..!
- ●Legislative Council | బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు

Madhusudhana Chary | మండలిలో మాదే మెజారిటీ.. ఆరుగురు సభ్యులున్న కాంగ్రెస్ ఎలా తీర్మానం పాస్ చేస్తుంది?

DK Aruna | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందే.. ఎంపీ డీకే అరుణ డిమాండ్

RS Praveen Kumar | స్పీకర్‌ను ప్రతిసారీ అవమానిస్తున్నది కాంగ్రెస్సే: ఆర్ఎస్ ప్రవీణ్

Telangana Assembly Resolution | కేసీఆర్ క్షమాపణకు అసెంబ్లీలో తీర్మానం






