త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM DHARA Scheme | పున‌రుత్పాద‌క ఇంధ‌న రంగానికి భారీ ఊతం.. రూ.1.86 ల‌క్షల కోట్ల‌తో పీఎం ధారా స్కీం..

PM DHARA Scheme | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ బుధవారం పీఎం డెవలపింగ్ హార్మనైజ్డ్ అండ్ యాక్సిలరేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ యాక్సెస్ (పీఎం ధారా) పథకానికి ఆమోదం తెలిపింది. ఈ పథకానికి మొత్తం రూ.1.86 లక్షల కోట్ల వ్యయం చేయనున్నారు. దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అంతర్-రాష్ట్ర విద్యుత్ ప్రసార వ్యవస్థను బలోపేతం చేయడం ఈ పథకం ప్రధాన లక్ష్యం.

S

Business | Published On Sep 30, 2026, 4.47 pm IST

PM DHARA Scheme | పున‌రుత్పాద‌క ఇంధ‌న రంగానికి భారీ ఊతం.. రూ.1.86 ల‌క్షల కోట్ల‌తో పీఎం ధారా స్కీం..
Advertisement

PM DHARA Scheme | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ బుధవారం పీఎం డెవలపింగ్ హార్మనైజ్డ్ అండ్ యాక్సిలరేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ యాక్సెస్ (పీఎం ధారా) పథకానికి ఆమోదం తెలిపింది. ఈ పథకానికి మొత్తం రూ.1.86 లక్షల కోట్ల వ్యయం చేయనున్నారు. దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అంతర్-రాష్ట్ర విద్యుత్ ప్రసార వ్యవస్థను బలోపేతం చేయడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. దీని ద్వారా 135 గిగావాట్ల వరకు పునరుత్పాదక విద్యుత్‌ను తరలించే సామర్థ్యాన్ని అభివృద్ధి చేయనున్నారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో విద్యుత్ గ్రిడ్‌తో పునరుత్పాదక విద్యుత్‌ను అనుసంధానం చేయడంతోపాటు విద్యుత్‌ను సమర్థంగా తరలించేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

రూ.1.86 ల‌క్ష‌ల కోట్ల వ్య‌యం..

గ్రిడ్‌లో విద్యుత్ సరఫరా స్థిరత్వాన్ని పెంచేందుకు 50 గిగావాట్ అవర్ సామర్థ్యంతో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు. వీటిని పునరుత్పాదక విద్యుత్ అభివృద్ధిదారులు లేదా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల వద్ద, లేదంటే గ్రిడ్‌లో కీలకమైన ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు. సౌర, పవన విద్యుత్ ఉత్పత్తిలో ఉండే అంతరాయాలను ఎదుర్కోవడం, గ్రిడ్‌లో రద్దీని తగ్గించడం, గరిష్ఠ డిమాండ్ సమయంలో విద్యుత్ కోతలను నియంత్రించడం, సౌర విద్యుత్ అందుబాటులో లేని సమయాల్లో డిమాండ్‌ను తీర్చడం వంటి అవసరాలకు ఈ నిల్వ వ్యవస్థలు ఉపయోగపడనున్నాయి. పీఎం ధారా పథకాన్ని 2032-33 ఆర్థిక సంవత్సరం నాటికి ఏర్పాటు చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం రూ.1.86 లక్షల కోట్ల ప్రాజెక్టు వ్యయంలో రూ.1.36 లక్షల కోట్లను గ్రీన్ ఎనర్జీ కారిడార్-3 కింద అంతర్-రాష్ట్ర విద్యుత్ ప్రసార వ్యవస్థల అభివృద్ధికి కేటాయించనున్నారు. మరో రూ.50 వేల కోట్లను 50 గిగావాట్ అవర్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ కోసం వినియోగించనున్నారు.

రూ.54వేల కోట్ల ఆర్థిక స‌హాయం..

ఈ పథకంలో కేంద్ర ప్రభుత్వం మొత్తం రూ.54,082 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించనుంది. అంతర్-రాష్ట్ర విద్యుత్ ప్రసార ఛార్జీలను కొంతమేర భర్తీ చేయడం ద్వారా విద్యుత్ వ్యయాన్ని తగ్గించేందుకు ఈ కేంద్ర ఆర్థిక సహాయం ఉపయోగపడుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. అంతర్-రాష్ట్ర విద్యుత్ ప్రసార వ్యవస్థల కింద చేపట్టే కొత్త ప్రాజెక్టులను టారిఫ్ ఆధారిత పోటీ బిడ్డింగ్ విధానంలో అమలు చేయనున్నారు. ఇప్పటికే ఉన్న వ్యవస్థల అప్‌గ్రేడేషన్, నెట్‌వర్క్ బలోపేతం వంటి పనులను కాస్ట్ ప్లస్ విధానంలో చేపట్టనున్నారు. రాష్ట్ర ప్రసార సంస్థలు మొత్తం అమలు ప్రక్రియకు బాధ్యత వహించనున్నాయి. టారిఫ్ ఆధారిత పోటీ బిడ్డింగ్ విధానంలో ప్రసార సేవల సంస్థలు పాల్గొంటాయి. 2035 నాటికి దేశంలో 900 గిగావాట్ల స్థాపిత నాన్‌-ఫాసిల్ విద్యుత్ సామర్థ్యాన్ని సాధించాలన్న లక్ష్యానికి పీఎం ధారా పథకం దోహదం చేస్తుందని కేంద్రం పేర్కొంది. దీర్ఘకాలిక ఇంధన భద్రతను బలోపేతం చేయడంతోపాటు కార్బన్ ఉద్గారాలను తగ్గించి పర్యావరణపరంగా స్థిరమైన వృద్ధిని ప్రోత్సహించడంలో కూడా ఈ పథకం కీలక పాత్ర పోషిస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది.

మెరుగుప‌డ‌నున్న ఉద్యోగావ‌కాశాలు..

ఉద్యోగ అవకాశాల పరంగానూ ఈ పథకం ప్రభావం చూపనుంది. విద్యుత్ రంగంతోపాటు తయారీ, నిర్మాణ రంగాల్లో పెద్ద సంఖ్యలో ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు ఏర్పడే అవకాశం ఉందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ముఖ్యంగా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ తయారీ, అమలు ద్వారా దేశీయ ఎనర్జీ స్టోరేజ్ పరిశ్రమలో కొత్త ఉద్యోగ అవకాశాలు ఏర్పడనున్నాయి. అలాగే వివిధ రాష్ట్రాల్లో ఆపరేషన్, నిర్వహణ, గ్రిడ్ నిర్వహణ వంటి విభాగాల్లో దీర్ఘకాలిక నైపుణ్య ఆధారిత ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి.

Advertisement
Advertisement