త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold | బంగారం కొనేవారికి షాక్.. 70 శాతానికి పైగా త‌గ్గిన డిమాండ్‌.. భారీగా పెరిగిన పాత న‌గ‌ల అమ్మ‌కాలు..

Gold | అంత‌ర్జాతీయంగా బంగారం ధ‌ర‌లు రోజు రోజుకీ ప‌డిపోతుండ‌డం, భార‌త్‌లోనూ ధ‌ర‌లు భారీగా త‌గ్గ‌డం, దిగుమ‌తి సుంకాలు గ‌ణ‌నీయంగా పెర‌గ‌డంతో దేశ‌వ్యాప్తంగా గ‌త కొద్ది రోజులుగా డిమాండ్ భారీగా ప‌డిపోయింద‌ని గ‌ణాంకాలు వెల్ల‌డిస్తున్నాయి. పెట్టుబ‌డిదారులు బంగారం విష‌యంలో అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని తేలింది.

S

Business | Published On Jul 1, 2026, 10.44 am IST

Gold | బంగారం కొనేవారికి షాక్.. 70 శాతానికి పైగా త‌గ్గిన డిమాండ్‌.. భారీగా పెరిగిన పాత న‌గ‌ల అమ్మ‌కాలు..
Advertisement

Gold | అంత‌ర్జాతీయంగా బంగారం ధ‌ర‌లు రోజు రోజుకీ ప‌డిపోతుండ‌డం, భార‌త్‌లోనూ ధ‌ర‌లు భారీగా త‌గ్గ‌డం, దిగుమ‌తి సుంకాలు గ‌ణ‌నీయంగా పెర‌గ‌డంతో దేశ‌వ్యాప్తంగా గ‌త కొద్ది రోజులుగా డిమాండ్ భారీగా ప‌డిపోయింద‌ని గ‌ణాంకాలు వెల్ల‌డిస్తున్నాయి. పెట్టుబ‌డిదారులు బంగారం విష‌యంలో అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని తేలింది. ఇండియ‌న్ బులియ‌న్ జువెల‌ర్స్ అసోసియేష‌న్ ఈ మేర‌కు వివ‌రాల‌ను వెల్ల‌డించింది. అసోసియేష‌న్ కార్య‌ద‌ర్శి సురేంద్ర మెహ‌తా మీడియాతో మాట్లాడుతూ దేశంలో దిగుమ‌తి సుంకం పెంపు అనంతరం భార‌త మార్కెట్‌లో బంగారం కోసం డిమాండ్ సుమారుగా 70 శాతానికి పైగా ప‌డిపోయింద‌ని తెలిపారు. ప్ర‌ధాని మోదీ ప్ర‌జ‌ల‌ను ఏడాదిపాటు బంగారం కొనొద్ద‌ని కోర‌డంతోపాటు ఆ త‌రువాత రెండు రోజుల‌కే మే 13న కేంద్రం బంగారంపై క‌స్ట‌మ్స్ డ్యూటీని 6 నుంచి ఏకంగా 15 శాతానికి పెంచింది. అయితే ఇటీవ‌లి కాలంలో బంగారం ధ‌ర‌లు త‌గ్గేందుకు అనేక కార‌ణాలు ఉన్నాయ‌ని మెహ‌తా పేర్కొన్నారు.

ధ‌ర‌లు మరింత త‌గ్గుతాయా..

ప్ర‌ధాని మోదీ విజ్ఞ‌ప్తి త‌రువాత బంగారం కోసం డిమాండ్ త‌క్కువ స్థాయిలోనే కొన‌సాగుతుంద‌ని మెహ‌తా అన్నారు. ఈ పరిస్థితుల్లో అనేక భారతీయ కుటుంబాలు తమ వద్ద ఉన్న పాత బంగారు నగలను విక్రయిస్తున్నాయ‌ని, అలాగే కొత్తగా కొనుగోలు చేయాలనుకునే వారు మాత్రం చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నార‌ని తెలిపారు. ఏప్రిల్ నుంచి జూన్ మధ్యకాలంలో పాత బంగారం విక్రయాలు దాదాపు 50 టన్నులకు చేరాయ‌ని, ఇది గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 50 శాతానికి పైగా ఎక్కువగా ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. బంగారం ధరల్లో వచ్చిన భారీ కరెక్షన్ కారణంగా, భవిష్యత్తులో ధరలు మరింత తగ్గొచ్చన్న అంచనాలతో గోల్డ్ లోన్లకు కూడా డిమాండ్ పెరుగుతోంద‌ని, అయితే ప్రస్తుతం ధరలు ఏడాది క్రితం నమోదైన రూ.95,600 స్థాయి కంటే ఇంకా గణనీయంగా ఎక్కువగానే ఉన్నాయని అన్నారు.

క్షీణించే దిశ‌గా ధ‌ర‌లు..

ఈ ఏడాది జనవరి 29న 10 గ్రాముల బంగారం ధర రూ.1.80 ల‌క్ష‌ల‌ను దాటింది. ఆ తర్వాత వరుస కరెక్షన్‌తో జూన్ 30 నాటికి దాదాపు 30 శాతం పడిపోయి రూ.1.40 ల‌క్ష‌ల స్థాయికి చేరుకుంది. ప్రస్తుత మార్కెట్ సెంటిమెంట్ ఏమాత్రం అనుకూలంగా లేదని సురేంద్ర మెహతా తెలిపారు. బంగారం ధరలు ఇంకా తగ్గిపోతాయనే భయంతో వినియోగదారులు, ఇన్వెస్టర్లు ఓపెన్ మార్కెట్‌లో తమ బంగారాన్ని విక్రయిస్తున్నారని ఆయన చెప్పారు. జూన్ 30న విడుదలైన ఆగ్‌మాంట్ బులియన్ నివేదిక ప్రకారం బంగారం ధర ఔన్స్‌కు 4వేల డాలర్ల దిగువకు పడిపోయి దాదాపు ఎనిమిది నెలల కనిష్ఠ స్థాయిని తాకింది. మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు, అమెరికాలో వడ్డీ రేట్లు ఎక్కువకాలం అధికంగానే కొనసాగే అవకాశాల నేపథ్యంలో వరుసగా నాలుగో నెల కూడా ధరలు క్షీణించే దిశగా సాగుతున్నాయని నివేదిక పేర్కొంది.

పెరిగితే ఏ స్థాయికి చేరొచ్చు..

జూన్ నెలలో బంగారం ధరలు 12 శాతానికి పైగా, ఈ త్రైమాసికంలో దాదాపు 15 శాతం తగ్గాయని నివేదిక అంచనా వేసింది. ఇది 2013 తర్వాత నమోదైన అత్యంత భారీ త్రైమాసిక పతనంగా పేర్కొంది. ఆగ్‌మాంట్ బులియన్ విశ్లేషణ ప్రకారం బంగారం 4వేల డాలర్ల కీలక మద్దతు స్థాయిని కోల్పోయి 3,960 డాలర్ల‌కు పడిపోయింది. ఈ స్థాయి కూడా నిలవకపోతే 3,600 డాలర్ల వరకు పడిపోయే అవకాశం ఉందని తెలిపింది. అయితే ప్రస్తుతం మార్కెట్ ఓవర్‌సోల్డ్ పరిస్థితుల్లో ఉండటంతో, స్వల్పకాలిక రికవరీ జరిగితే ధరలు 4,100 నుంచి 4,165 డాలర్ల వరకు పెరిగే అవకాశం కూడా ఉంద‌ని ఆగ్‌మాంట్ అంచ‌నా వేసింది. అయితే బంగారం ధ‌ర‌లు భారీగా త‌గ్గుతున్న నేప‌థ్యంలో పెట్టుబ‌డిదారులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించింది.

Advertisement
Advertisement