త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

NSE | స్టాక్ ధర కాదు.. వ్యాపారమే ముఖ్యం.. ఎన్‌ఎస్‌ఈ సీఈఓ కీలక సూచనలు..

NSE | దేశంలోని స్టార్టప్‌లు, ఎంఎస్‌ఎంఈలు వేగంగా అభివృద్ధి చెందాలంటే పబ్లిక్ మార్కెట్లను మూలధనం సమీకరణకు వినియోగించుకోవాలని ఎన్‌ఎస్‌ఈ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆశిష్ చౌహాన్ సూచించారు.

S

Business | Published On Jun 26, 2026, 5.44 pm IST

NSE | స్టాక్ ధర కాదు.. వ్యాపారమే ముఖ్యం.. ఎన్‌ఎస్‌ఈ సీఈఓ కీలక సూచనలు..
Advertisement

NSE | దేశంలోని స్టార్టప్‌లు, ఎంఎస్‌ఎంఈలు వేగంగా అభివృద్ధి చెందాలంటే పబ్లిక్ మార్కెట్లను మూలధనం సమీకరణకు వినియోగించుకోవాలని ఎన్‌ఎస్‌ఈ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆశిష్ చౌహాన్ సూచించారు. అయితే కంపెనీ వ్యవస్థాపకులు ప్రతిరోజూ షేర్ ధరల మార్పులపై ఎక్కువగా దృష్టి పెట్టకుండా, స్థిరమైన లాభదాయక వ్యాపార నిర్మాణంపైనే దృష్టి సారించాలని ఆయన స్పష్టం చేశారు. ఎన్‌ఎస్‌ఈలో నిర్వహించిన జిటో ఇంక్యుబేషన్ అండ్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ కు చెందిన ఫౌండేషన్ డే కార్యక్రమంలో మాట్లాడిన ఆశిష్ చౌహాన్, మార్కెట్‌లో హెచ్చుతగ్గుల కంటే వ్యాపార బలంపైనే వ్యవస్థాపకులు దృష్టి పెట్టాలని అన్నారు. వ్యాపారం కార్యకలాపాల్లో ఉంటుంద‌ని, షేర్ ధరలో కాద‌ని, స్టాక్ మార్కెట్ వ్యాపారానికి ప్రతిబింబం మాత్రమేన‌ని, అదే వ్యాపారం కాద‌ని అన్నారు.

నియంత్ర‌ణ కోల్పోవాల్సిన ప‌నిలేదు..

కంపెనీలు స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్ కావడం వల్ల మూలధనం సమీకరించుకోవచ్చని, అదే సమయంలో ప్రమోటర్లు తమ నియంత్రణను కోల్పోవాల్సిన అవసరం లేదని ఆశిష్ చౌహాన్ వివరించారు. పబ్లిక్ మార్కెట్ ద్వారా ప్రారంభ దశలో కంపెనీ ఈక్విటీలో కొంత భాగాన్ని మాత్రమే పెట్టుబడిదారులకు అందించి, మెజారిటీ వాటా, నిర్ణయాధికారాన్ని వ్యవస్థాపకులే కొనసాగించవచ్చని చెప్పారు. లిస్టింగ్ సమయంలో 75 శాతం వాటా య‌జ‌మానుల‌ వద్దే ఉంటుంద‌ని, ప్రారంభంలో 25 శాతం మాత్రమే మార్కెట్‌కు ఇస్తార‌ని, అవసరమైతే తర్వాత మరింత ఇవ్వొచ్చ‌ని, కానీ కంపెనీపై నియంత్రణ మాత్రం వ్య‌వ‌స్థాప‌కుల చేతుల్లోనే ఉంటుంద‌ని ఆయన అన్నారు. నిధుల సమీకరణతోపాటు లిస్టెడ్ కంపెనీలకు విశ్వసనీయత పెరుగుతుందని, అనలిస్టుల కవరేజ్ లభిస్తుందని, బ్యాంకుల నుంచి సులభంగా రుణాలు పొందే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

ప్ర‌తిభావంతుల‌ను ఆక‌ర్షించ‌వ‌చ్చు..

ఉద్యోగులకు ఎంప్లాయీ స్టాక్ ఓనర్‌షిప్ ప్లాన్‌ల ద్వారా ప్రతిభావంతులను ఆకర్షించవచ్చని, అలాగే లిస్టెడ్ షేర్లను విలీనాలు, కొనుగోళ్లు, వ్యూహాత్మక భాగస్వామ్యాల కోసం కూడా వినియోగించుకోవచ్చని వివరించారు. లాభదాయకంగా పనిచేసే కంపెనీలకు మార్కెట్‌లో మంచి విలువ లభిస్తుందని కూడా ఆశిష్ చౌహాన్ చెప్పారు. సంవత్సరానికి రూ.2 కోట్ల లాభాలు ఆర్జించే సంస్థ లిస్టింగ్ తర్వాత సుమారు రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు మార్కెట్ క్యాపిటలైజేషన్ సాధించే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్‌ఎస్‌ఈ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఐపీఓ కోసం ఇటీవలే డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ దాఖలు చేసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. శత్రుత్వపూర్వక స్వాధీనం (హోస్టైల్ టేకోవర్)పై ఉన్న ఆందోళనల గురించి స్పందిస్తూ, ప్రమోటర్లను వారి ఇష్టానికి విరుద్ధంగా కంపెనీ నుంచి తప్పించడం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు.

అక్క‌డితో ఆగిపోకూడ‌దు..

2012లో ప్రారంభమైన ఎన్‌ఎస్‌ఈ ఎస్‌ఎంఈ ప్లాట్‌ఫామ్ ద్వారా ఇప్పటివరకు కంపెనీలు కలిపి రూ.21,700 కోట్లకు పైగా నిధులు సమీకరించాయని, ప్రస్తుతం ఈ ప్లాట్‌ఫామ్‌లోని సంస్థల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2 లక్షల కోట్లను దాటిందని ఆయన వెల్లడించారు. రూ.10 కోట్లు లేదా రూ.20 కోట్ల వ్యాపారం చేస్తున్న సంస్థలు అక్కడితో ఆగిపోకుండా, రూ.200 కోట్లకు పైగా వ్యాపారాన్ని లక్ష్యంగా నిర్ణ‌యించుకుని ముందుకు సాగాలని ఆశిష్ చౌహాన్ సూచించారు.

Advertisement
Advertisement