త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | స్టాక్ మార్కెట్ల‌లో జోష్‌.. సెన్సెక్స్ 791 పాయింట్లు జంప్, భారీగా కొనుగోళ్లు..

Stock Markets | భారత స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 791 పాయింట్లు ఎగ‌బాకి 76,991 వద్ద ముగియగా, నిఫ్టీ50 సూచీ 198 పాయింట్లు పెరిగి 24,022 స్థాయికి చేరుకుంది. రోజంతా కొనుగోళ్ల జోరు కొనసాగడంతో రెండు సూచీలు రోజువారీ గరిష్ఠ స్థాయిలకు సమీపంలోనే క్లోజ్ అయ్యాయి.

S

Business | Published On Jun 24, 2026, 4.00 pm IST

Stock Markets | స్టాక్ మార్కెట్ల‌లో జోష్‌.. సెన్సెక్స్ 791 పాయింట్లు జంప్, భారీగా కొనుగోళ్లు..
Advertisement

Stock Markets | భారత స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 791 పాయింట్లు ఎగ‌బాకి 76,991 వద్ద ముగియగా, నిఫ్టీ50 సూచీ 198 పాయింట్లు పెరిగి 24,022 స్థాయికి చేరుకుంది. రోజంతా కొనుగోళ్ల జోరు కొనసాగడంతో రెండు సూచీలు రోజువారీ గరిష్ఠ స్థాయిలకు సమీపంలోనే క్లోజ్ అయ్యాయి. మార్కెట్ ర్యాలీకి ప్రధానంగా ఫైనాన్షియల్, ఐటీ రంగాల షేర్లు బలమైన మద్దతు అందించాయి. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇన్ఫోసిస్ వంటి ఇండెక్స్ హెవీవెయిట్లు లాభపడటంతో సెన్సెక్స్, నిఫ్టీ దాదాపు 1 శాతం మేర ఎగిశాయి. యాక్సిస్ క్యాపిటల్ ఎనిమిది ఐటీ కంపెనీల షేర్లను అప్‌గ్రేడ్ చేయడంతో నిఫ్టీ ఐటీ సూచీ కూడా బలంగా పుంజుకుంది. బ్యాంకింగ్ రంగం మరో ప్రధాన బలంగా నిలిచింది. నిఫ్టీ బ్యాంక్ సూచీ 1.50 శాతానికి పైగా పెరిగి 58,150 వద్ద ముగిసింది. కెనరా బ్యాంక్ మినహా దాదాపు అన్ని బ్యాంకింగ్ షేర్లు గ్రీన్ లో ముగియడం మార్కెట్ సెంటిమెంట్‌ను బలోపేతం చేసింది.

భారీగా లాభ‌ప‌డ్డ ఇండిగో..

రంగాలవారీగా చూస్తే పలు స్టాక్‌లలో ప్రత్యేక కదలికలు కనిపించాయి. ఇరాన్ యుద్ధ ప్రభావంతో గతంలో వచ్చిన నష్టాల నుంచి కోలుకున్న ఇండిగో మార్కెట్ క్యాపిటలైజేషన్ మళ్లీ రూ.2 లక్షల కోట్ల మార్కును దాటింది. గురుగ్రామ్ ప్రాజెక్టుకు రెరా అనుమతి లభించడంతో ఓబెరాయ్ రియాల్టీ షేరు 3 శాతానికి పైగా ఎగిసింది. అలాగే ప్రభుత్వం ఒక్కో షేరును రూ.91 ధరకు ఆఫర్ ఫర్ సేల్ ద్వారా 2 శాతం వాటా విక్రయిస్తున్నట్లు ప్రకటించడంతో ఐఆర్‌ఎఫ్‌సీ షేరు 5 శాతానికి పైగా పడిపోయింది. ఇక బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 76 డాలర్ల దిగువకు రావడంతో డౌన్‌స్ట్రీమ్ ఆయిల్ కంపెనీల షేర్లు లాభపడగా, అప్‌స్ట్రీమ్ ఆయిల్ కంపెనీలు ఒత్తిడికి గురయ్యాయి. జేఎస్‌డబ్ల్యూ ఇన్‌ఫ్రా, ఎం అండ్ ఎం ఫైనాన్షియల్ సర్వీసెస్, ఓఎఫ్‌ఎస్‌ఎస్, ఎక్సైడ్, హెచ్‌పీసీఎల్ త‌దిత‌ర‌ మిడ్‌క్యాప్ షేర్లు ప్రధాన లాభదారులుగా నిలిచాయి. టాటా మోటార్స్ కమర్షియల్ వెహికిల్స్ విభాగం భవిష్యత్ వృద్ధి అంచనాల నేపథ్యంలో 2 శాతానికి పైగా పెరిగింది.

త‌గ్గిన చ‌మురు ధ‌ర‌లు, బ‌ల‌ప‌డ్డ రూపాయి..

అయితే అన్ని రంగాలు లాభపడలేదు. నిఫ్టీ ఇండియా డిఫెన్స్ సూచీ అత్యధికంగా నష్టపోయిన రంగ సూచీగా నిలిచింది. ఎమ్‌టీఏఆర్ టెక్ షేరు 4 శాతానికి పైగా క్షీణించింది. మిడ్‌క్యాప్ సూచీ కేవలం 65 పాయింట్లు పెరిగి 62,135 వద్ద ముగియడం ద్వారా ప్రధాన సూచీలతో పోలిస్తే వెనుకబడి ఉంది. మార్కెట్ బ్రెడ్‌త్ మాత్రం సమతుల్యంగానే కనిపించింది. ఎన్‌ఎస్‌ఈలో అడ్వాన్స్-డిక్లైన్ నిష్పత్తి 1:1గా నమోదైంది. సెన్సెక్స్ ప్యాక్‌లో ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, టెక్ మహీంద్రా, ట్రెంట్, బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్ టాప్ గెయిన‌ర్లుగా నిలిచాయి. మరోవైపు హిందుస్థాన్ ఏరోనాటిక్స్, బజాజ్ ఆటో, ఎన్‌టీపీసీ, మారుతీ సుజుకీ ఇండియా, భారతీ ఎయిర్‌టెల్, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ షేర్లు ఒత్తిడికి లోనయ్యాయి. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో చ‌మురు ధ‌ర‌లు భారీగా త‌గ్గ‌డం కూడా ఈక్విటీల ర్యాలీకి కార‌ణ‌మైంది. బ్రెంట్ క్రూడ్ ధ‌ర 0.79 శాతం మేర త‌గ్గి బ్యారెల్‌కు 75 డాల‌ర్ల‌కు చేరుకోగా, డ‌బ్ల్యూటీఐ క్రూడ్ ధ‌ర 1.07 శాతం మేర ప‌త‌న‌మై బ్యారెల్‌కు 71 డాల‌ర్ల వ‌ద్ద‌కు వ‌చ్చింది. ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి బ‌ల‌ప‌డ‌డం కూడా దేశీయ సూచీల‌కు క‌ల‌సి వ‌చ్చింది. అమెరికా డాల‌ర్‌తో పోలిస్తే రూపాయి 6 పైస‌లు లాభ‌ప‌డి 94.66 వద్ద నిలిచింది.

Advertisement
Advertisement