త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kharif season | 423 మండలాల్లో వర్షాలే లేవ్‌

Kharif season | వానకాలం వచ్చి 3 వారాలు దాటింది. ఆశించిన వర్షాలు పడలేదు. అనుకున్నంతగా నేల తడవలేదు. విత్తే పదును రాలేదు. వచ్చే వానలైనా ఆదుకుంటాయా? వానకాలం పంటలు ఈ సారి సాగయ్యేనా? .. ఇవీ రైతన్నలను వేధిస్తున్న సందేహాలు. సగానికి పైగా జిల్లాల్లో అత్యధికంగా లోటు వర్షపాతం నమోదైంది. ఇదే రైతన్నను కలవరపెడుతున్నది.

S

Telangana | Published On Jun 26, 2026, 6.52 pm IST

Kharif season | 423 మండలాల్లో వర్షాలే లేవ్‌
Advertisement
  • మరో 101 మండలాల్లో అతి తక్కువ న‌మోదు
  • రైతన్నను వెక్కిరించిన జూన్ మాసం
  • ఇక ఆశలన్నీ జూలైపైనే
  • 3 వారాలు గడిచినా అంతంతే చినుకులు
  • ఖాళీ కుండల్లా దర్శనమిస్తున్న గోదావరి, కృష్ణ రిజర్వాయర్లు
  • వచ్చే నెలలోనైనా గండం గడిచేనా?
  • ఇట్ల‌యితే ఖరీఫ్ సాగేనా?

Kharif season | త్రినేత్ర‌.న్యూస్‌: వానకాలం వచ్చి 3 వారాలు దాటింది. ఆశించిన వర్షాలు పడలేదు. అనుకున్నంతగా నేల తడవలేదు. విత్తే పదును రాలేదు. వచ్చే వానలైనా ఆదుకుంటాయా? వానకాలం పంటలు ఈ సారి సాగయ్యేనా? .. ఇవీ రైతన్నలను వేధిస్తున్న సందేహాలు. నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన దాదాపు నెల కావస్తున్నా.. తెలంగాణ వ్యాప్తంగా తొలిదశలో సరిపడా వానలు కురవకపోవడంతో అనుకున్న స్థాయిలో సాగు నమోదు కాలేదు. తెలంగాణ వ్యాప్తంగా ఈ సమయానికల్లా దాదాపుగా 109.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 17 శాతం లోటుతో కేవలం 90.4 మిల్లీమీటర్ల మాత్రమే వర్షం పడింది. అయితే సగానికి పైగా జిల్లాల్లో అత్యధికంగా లోటు వర్షపాతం నమోదైంది. ఇదే రైతన్నను కలవరపెడుతున్నది.

423 మండలాల్లో వర్షపు ఛాయలే లేవు

తెలంగాణ ప్రణాళిక సంఘం విడుదల చేసిన గణాంకాల ప్రకారం జూన్ 26 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 17 శాతం లోటు వర్షపాతం నమోదైంది. 423 మండలాల్లో అత్యధిక మండలాల్లో అసలు వర్షమే పడలేదు. కొన్ని మండలాల్లో అత్యంత తక్కువగా 0.2 మిల్లీమీటర్ల లోపు వర్షం నమోదైంది. మరో 101 మండలాల్లో 2.4 మిల్లీమీటర్ల లోపు వర్షం పడింది. కేవలం 97 మండలాల్లో మాత్రమే 2.5 మిల్లీ మీటర్ల నుంచి 64 మిల్లీ మీటర్ల వర్షం పడింది. ఏ మండలంలోనూ 7 మిల్లీ మీటర్లకు మించి వర్షపాతం నమోదు కాకపోవడం గమనార్హం.

హన్మకొండ, సిద్దిపేటలో అధిక లోటు

హన్మకొండలో అత్యధికంగా అతి ఎక్కువగా 77 శాతం, ఆ తర్వాత సిద్దిపేటలో 63 శాతం లోటు వర్షపాతం నమోదైంది. 13 జిల్లాల్లో సాధారణ వర్షం, నల్లగొండ, నాగర్ కర్నూల్, రంగారెడ్డి జిల్లాల్లో సాధారణం కన్నా ఎక్కువ వర్షాలు పడ్డాయి. నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించినప్పటికీ అవి కొన్ని జిల్లాల్లో ఎక్కువగా మరికొన్ని జిల్లాల్లో అతి తక్కువగా వర్షాలకు కారణమయ్యాయి.

రిజర్వాయర్లలోకి జీరో ఇన్ ఫ్లో..

అటు కర్ణాటక, ఇటు మహారాష్ట్రలోనూ కూడా వర్షాలు అంతంత మాత్రంగా ఉండడంతో ఎగువ నుంచి నీటి ప్రవాహమే లేదు. సాధారణంగా.. ఈ సమయానికి ఆల్మట్టిలోకి.. నీటి ప్రవాహం వచ్చి చేరుతూ ఉండాలి. కనీసం సగమైనా రిజర్వాయర్ నిండాలి. కానీ ప్రస్తుతం ఆ రిజర్వాయర్ లో నీటి నిల్వ కేవలం 22 టీఎంసీలుగా మాత్రమే ఉంది. ఇన్ ఫ్లో లే లేవు. గోదావరి పైన ఉన్న శ్రీరాం సాగర్, నిజాం సాగర్, మిడ్ మానేరు, కడెం లోకి ఎలాంటి ఇన్ ఫ్లో లు లేవు.

భారమంతా వరుణుడిపైనే..

ఒక వైపు వర్షాభావ పరిస్థితులు మరోవైపు రిజర్వాయర్లలో అడుగంటిన నీటి మట్టాలతో సాగునీటి పంటలకు ఇప్పటికిప్పుడు నీళ్లిచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఎల్ నినో ముప్పు వల్ల ఈ సారి వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయని కొందరు శాస్త్రవేత్తలు హెచ్చరించినా.. మరికొందరు శాస్త్రవేత్తలు మాత్రం.. జూలై లో ఊరటనిచ్చే వర్షాలు పడతాయని చెబుతున్నారు.

జిల్లా                      వర్షపాతం లోటు

హన్మకొండ ------->   77%
సిద్దిపేట   -------->   63%
వరంగల్   -------->  61%
నిజామాబాద్ ----->  52%
జగిత్యాల  -------->  51%
జనగాం    -------->   51%
మహబూబాబాద్--> 48%
కరీంనగర్ -------->  45%
సిరిసిల్ల ---------->  45%
ఆదిలాబాద్ ------> 44%
యాదాద్రి -------->  35%
మెదక్ ----------->   34%
మేడ్చల్ ---------> 33%
గద్వాల ----------> 29%
కామారెడ్డి --------> 27%
నిర్మల్ ---------->  23%
మంచిర్యాల ----> 22%

Advertisement
Advertisement