త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

NPS | దీర్ఘ‌కాలంలో ఎన్‌పీఎస్ బెస్ట్‌.. రిక‌వ‌ర్ అవుతున్న మార్కెట్లు.. ఇదే స‌రైన స‌మ‌య‌మా..?

NPS | ప్ర‌భుత్వేతర ఖాతాదారుల కోసం అందుబాటులో ఉన్న నేష‌న‌ల్ పెన్ష‌న్ సిస్ట‌మ్ (ఎన్‌పీఎస్‌) దీర్ఘ‌కాలంలో సానుకూల ఫ‌లితాల‌ను ఇచ్చింద‌ని ఆర్థిక సంస్థ‌లు తాజాగా చేప‌ట్టిన అధ్య‌య‌నంలో తేలింది. ఎన్‌పీఎస్ లో టియ‌ర్‌-1, టియ‌ర్‌-2 అని రెండు విభాగాలు ఉండ‌గా, రెండింటిలోనూ దీర్ఘ‌కాలంలో పెట్టుబ‌డుల‌కు చ‌క్క‌ని రాబ‌డులు ల‌భించాయ‌ని వెల్ల‌డైంది.

S

Business | Published On Jun 27, 2026, 3.01 pm IST

NPS | దీర్ఘ‌కాలంలో ఎన్‌పీఎస్ బెస్ట్‌.. రిక‌వ‌ర్ అవుతున్న మార్కెట్లు.. ఇదే స‌రైన స‌మ‌య‌మా..?
Advertisement

NPS | ప్ర‌భుత్వేతర ఖాతాదారుల కోసం అందుబాటులో ఉన్న నేష‌న‌ల్ పెన్ష‌న్ సిస్ట‌మ్ (ఎన్‌పీఎస్‌) దీర్ఘ‌కాలంలో సానుకూల ఫ‌లితాల‌ను ఇచ్చింద‌ని ఆర్థిక సంస్థ‌లు తాజాగా చేప‌ట్టిన అధ్య‌య‌నంలో తేలింది. ఎన్‌పీఎస్ లో టియ‌ర్‌-1, టియ‌ర్‌-2 అని రెండు విభాగాలు ఉండ‌గా, రెండింటిలోనూ దీర్ఘ‌కాలంలో పెట్టుబ‌డుల‌కు చ‌క్క‌ని రాబ‌డులు ల‌భించాయ‌ని వెల్ల‌డైంది. పెట్టుబ‌డిదారులు స్వ‌ల్ప‌కాలిక ల‌క్ష్యాల కోసం కాకుండా దీర్ఘ‌కాలిక ల‌క్ష్యాల కోసం ఇందులో పెట్టుబ‌డుల‌ను పెట్టాల్సి ఉంటుంద‌ని ఈ సంద‌ర్భంగా విశ్లేష‌కులు సూచిస్తున్నారు. దేశంలో ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉన్న ప‌లు టాప్ కంపెనీల‌కు చెందిన ఎన్‌పీఎస్ ఫండ్స్‌ను దీర్ఘ‌కాలం పాటు ప‌రిశీలించిన అనంత‌రం ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. 1 ఏడాది క‌న్నా క‌నీసం 5 ఏళ్ల పాటు పెట్టుబ‌డుల‌ను పెడితే రెండంకెల రాబ‌డిని పొంద‌వ‌చ్చ‌ని అధ్య‌య‌నం తేల్చి చెప్పింది.

గ‌రిష్టంగా 12.51 శాతం మేర లాభాలు..

ఎన్‌పీఎస్‌లోని టియ‌ర్ 1 కామ‌న్ స్కీమ్‌లో ఏడాది కాల వ్య‌వ‌ధి పెట్టుబ‌డుల‌కు రాబ‌డులు సుమారు -8.03 శాతం నుంచి 1.94 శాతం వ‌ర‌కు వ‌చ్చిన‌ట్లు అధ్య‌య‌నం తేల్చ‌గా, 5 ఏళ్ల కాల‌వ్య‌వ‌ధిలో పెట్టుబ‌డులు పెట్టిన వారికి సుమారు 10.41 నుంచి 12.51 శాతం వ‌ర‌కు లాభాలు వ‌చ్చిన‌ట్లు వెల్ల‌డించింది. అంటే దీర్ఘ‌కాలంలో ఎక్కువ లాభం వ‌చ్చింద‌ని అర్థం. అదే స్వ‌ల్ప‌కాలంలో అస్థిర‌త ఎక్కువ‌గా ఉంటుంది క‌నుక కొన్ని సార్లు నెగెటివ్‌గా రాబ‌డి ఉంటుంద‌ని అధ్య‌య‌నం ద్వారా తెలుస్తోంది. ఇక ఏడాది కాల‌వ్య‌వ‌ధిలో ప్ర‌భుత్వ బాండ్ ఫండ్స్ 2 నుంచి 2.79 శాతం మేర రాబ‌డిని ఇవ్వ‌గా, 5 ఏళ్ల కాల‌వ్య‌వ‌ధిలో ఇవి 5.99 నుంచి 6.46 శాతం వ‌ర‌కు రాబడుల‌ను అందించాయి. అలాగే కార్పొరేట్ బాండ్‌లు 1 ఏడాదిలో సుమారుగా 4.87 రాబ‌డిని అందిస్తే, 5 ఏళ్ల వ్య‌వ‌ధిలో 5.52 నుంచి 6.90 శాతం వ‌ర‌కు రాబ‌డుల‌ను ఇచ్చిన‌ట్లు వెల్ల‌డైంది.

9 నుంచి 12 శాతం మేర రాబ‌డి..

సాధార‌ణంగా ఎన్‌పీఎస్ ఫండ్‌లలో ఫండ్ మేనేజ‌ర్లు నిర్దిష్ట‌మైన నిష్ప‌తి ప్ర‌కారం పెట్టుబ‌డుల‌ను విభ‌జిస్తారు. 75 శాతం పెట్టుబ‌డిని ఈక్విటీల‌కు కేటాయిస్తే, 15 శాతం మొత్తాన్ని ప్ర‌భుత్వ బాండ్ల‌లో పెట్టుబ‌డిగా పెడ‌తారు. మ‌రో 10 శాతం మొత్తాన్ని కార్పొరేట్ బాండ్ ల‌లో పెడ‌తారు. దీని వ‌ల్ల స‌గ‌టు పోర్ట్ ఫోలియో బ్యాలెన్స్‌గా ఉంటుంది. 5 ఏళ్ల కాల‌వ్య‌వ‌ధిలో ఎన్‌పీఎస్ ఫండ్స్ సుమారుగా 9 నుంచి 12 శాతం మ‌ధ్య‌లో రాబ‌డిని అందిస్తాయ‌ని అధ్య‌య‌నం చెబుతోంది. అంటే అగ్రెసివ్ ఈక్విటీ వెయిట్ ఉండే దీర్ఘ‌కాలిక ఎన్‌పీఎస్‌లో డ‌బుల్ డిజిట్ రిట‌ర్న్స్ వ‌చ్చాయ‌ని అర్థ‌మ‌వుతోంది. అయితే టియ‌ర్ 1, టియ‌ర్ 2 రెండింటిలోనూ ఇదే త‌ర‌హాలో పెట్టుబ‌డులు ఉంటాయి. కానీ చిన్న తేడా ఉంటుంది. టియ‌ర్ 2 స్కీమ్‌ల‌ను ఓపెన్ ఎండ్‌గా నిర్వ‌హిస్తారు. వీటికి లాక్ ఇన్ ఉండ‌దు. అందువ‌ల్ల పెట్టుబ‌డిదారులు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫండ్‌ను విత్ డ్రా చేసుకోవ‌చ్చు. ఇక టియ‌ర్ 2 అకౌంట్ ఓపెన్ చేయాలంటే ముందుగా టియ‌ర్ 1 అకౌంట్ ఉండాలి.

ఇదే స‌రైన స‌మ‌య‌మా..?

5 ఏళ్ల కాల వ్య‌వ‌ధిలో దేశంలోని ప‌లు ప్ర‌ముఖ ఎన్‌పీఎస్ ఫండ్స్ అత్య‌ధిక లాభాల‌ను అందించిన‌ట్లు అధ్య‌య‌నంలో తేలింది. ముఖ్యంగా ఆదిత్య బిర్లా స‌న్ లైఫ్ ఈ జాబితాలో తొలి స్థానంలో ఉండ‌గా, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, టాటా ఆ త‌రువాతి స్థానాల్లో నిలిచాయి. అయితే ఏడాది కాల‌వ్య‌వ‌ధిలో ఇవే ఫండ్స్ నెగెటివ్ నుంచి స్వ‌ల్ప రాబ‌డుల‌ను అందించాయ‌ని అధ్య‌య‌నం పేర్కొంది. అందువ‌ల్ల దీర్ఘ‌కాలంలోనే ఎక్కువ లాభం ఉంటుంద‌ని మ‌రోమారు రుజువైంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. అయితే గ‌త కొంత కాలంగా ఎన్‌పీఎస్‌లో రిట‌ర్న్స్ స్వ‌ల్స‌కాలంలో నెగెటివ్‌లో ఉన్నాయ‌ని, కానీ ఇప్పుడు మార్కెట్లు రిక‌వ‌ర్ అవుతున్నాయ‌ని, అందువ‌ల్ల స్వ‌ల్స‌కాలంలోనూ త‌క్కువ మొత్తంలో లాభాలు క‌నిపిస్తున్నాయ‌ని ఫ్లోట‌ర్ వెల్త్ కో ఫౌండ‌ర్‌, సీఈవో అమిత్ హెఎల్ తెలిపారు. ప్ర‌స్తుతం మార్కెట్లు రిక‌వ‌ర్ అవుతున్నందున ఎన్‌పీఎస్‌లోనూ పెట్టుబ‌డులు పెరుగుతున్నాయ‌ని, పెట్టుబ‌డిదారుల‌కు పాజిటివ్ రిట‌ర్న్స్ క‌నిపిస్తున్నాయ‌ని, ఇది ఎన్‌పీఎస్ మార్కెట్ల‌కు అనుకూలంగా మారుతుంద‌ని అన్నారు. అయితే ఏ స్కీమ్‌లో పెట్టుబ‌డి పెట్టాల‌నుకున్నా నిపుణులను సంప్ర‌దించి స‌ల‌హాల‌ను పాటించాల్సి ఉంటుంద‌ని సూచించారు.

Advertisement
Advertisement