త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SIM Swapping | సిమ్ స్వాపింగ్ మోసాలతో జాగ్ర‌త్త‌.. నిర్ల‌క్ష్యం చేస్తే బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతాయి..

SIM Swapping | ప్ర‌భుత్వాలు, పోలీసులు, బ్యాంకులు ప్ర‌జ‌ల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు సైబ‌ర్ మోసాల‌పై అవ‌గాహ‌న క‌ల్పిస్తున్న‌ప్ప‌టికీ దుండ‌గులు ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త మార్గాల‌ను ఎంచుకుని ప్ర‌జ‌ల‌ను బురిడీ కొట్టిస్తున్నారు. అందినకాడికి దోచుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌స్తుతం సిమ్ స్వాపింగ్ మోసాలు అధిక‌మ‌వుతున్నాయ‌ని పోలీసులు హెచ్చ‌రిస్తున్నారు.

S

Technology | Published On Jun 23, 2026, 3.15 pm IST

SIM Swapping | సిమ్ స్వాపింగ్ మోసాలతో జాగ్ర‌త్త‌.. నిర్ల‌క్ష్యం చేస్తే బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతాయి..
Advertisement

SIM Swapping | ప్ర‌భుత్వాలు, పోలీసులు, బ్యాంకులు ప్ర‌జ‌ల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు సైబ‌ర్ మోసాల‌పై అవ‌గాహ‌న క‌ల్పిస్తున్న‌ప్ప‌టికీ దుండ‌గులు ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త మార్గాల‌ను ఎంచుకుని ప్ర‌జ‌ల‌ను బురిడీ కొట్టిస్తున్నారు. అందినకాడికి దోచుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌స్తుతం సిమ్ స్వాపింగ్ మోసాలు అధిక‌మ‌వుతున్నాయ‌ని పోలీసులు హెచ్చ‌రిస్తున్నారు. ప్ర‌జ‌లు ఈ మోసాల ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచిస్తున్నారు. సిమ్ స్వాపింగ్ ద్వారా సైబ‌ర్ కేటుగాళ్లు తాము చోరీ చేసిన వ్య‌క్తిగ‌త సమాచారంతో బాధితుడి పేరిట న‌కిలీ సిమ్ కార్డును అక్ర‌మంగా పొందుతారు. త‌రువాత బ్యాంకు ఖాతాల‌కు అనుసంధాన‌మై ఖాతాల్లో ఉండే సొమ్మును లూటీ చేస్తున్నారు. సిమ్ యాక్టివేట్ అయిన త‌రువాత ఓటీపీలు, బ్యాంక్ అల‌ర్టులు, ర‌హ‌స్య స‌మ‌చారాన్ని సుల‌భంగా పొందుతున్నారు. దీంతో ఈ త‌ర‌హా మోసాల‌ను చేయ‌డం వారికి చాలా సుల‌భంగా మారింది. అందువ‌ల్ల ప్ర‌జ‌లు సిమ్ స్వాపింగ్ ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, అపరిచితుల‌తో వ్య‌క్తిగ‌త‌, ఆర్థిక‌ప‌ర‌మైన వివ‌రాల‌ను పంచుకోవ‌ద్ద‌ని సూచిస్తున్నారు.

సిమ్ స్వాపింగ్ అంటే..

సిమ్ స్వాపింగ్ అంటే బాధితుడిని మోసానికి గురి చేసి అత‌ని సిమ్‌కు డూప్లికేట్ సిమ్ తీసుకుంటారు. ఇందుకు గాను కేటుగాళ్లు ముందుగా బాధితుడి వివ‌రాల‌ను సేక‌రిస్తారు. త‌రువాత టెలికాం కంపెనీకి ఎస్ఎంఎస్ రిక్వెస్ట్ పంపిస్తారు. కానీ అస‌లు సిమ్ బాధితుడి వ‌ద్దే ఉంటుంది క‌నుక ఆథెంటికేష‌న్ ఓటీపీ ముందుగా బాధితుడికే వ‌స్తుంది. దీంతో ఆ ఓటీపీ కోసం మోస‌గాళ్లు బాధితుడికి ప‌లు ర‌కాలుగా ఫోన్లు చేసి లేదా మెసేజ్‌లు పంపి ఎట్ట‌కేల‌కు ఓటీపీని తెలుసుకుంటారు. దీంతో ఆ ఓటీపీని న‌మోదు చేసి బాధితుడి సిమ్‌ను డీయాక్టివేట్ చేస్తారు. త‌రువాత మోస‌గాళ్ల వ‌ద్ద ఉండే సిమ్ యాక్టివేట్ అవుతుంది. దీంతో బాధితుడి నంబ‌ర్ మోస‌గాళ్ల చేతిలో ఉంటుంది క‌నుక బ్యాంకు ఓటీపీలు, ఇత‌ర స‌మాచారం మొత్తం వారికి ల‌భిస్తుంది. దాంతో వారు బాధితుడి ఖాతాల్లో ఉండే డ‌బ్బును కాజేస్తారు. ఇలా సిమ్ స్వాపింగ్ జ‌రుగుతుంది.

ఎలా చేస్తారు..

సిమ్ స్వాపింగ్ చేయ‌డానికి ముందుగా దుండ‌గులు బాధితుల పూర్తి వివ‌రాల‌ను సేక‌రిస్తారు. వాటితోనే టెలికాం కంపెనీల‌ను ఏమార్చి బాధితుడి సిమ్‌కు బ‌దులుగా త‌మ వ‌ద్ద ఉన్న సిమ్‌ను యాక్టివేట్ చేస్తారు. అయితే అప‌రిచిత వ్య‌క్తుల‌కు సున్నిత‌మైన స‌మాచారం షేర్ చేయ‌కుండా ఉంటే వారికి మ‌న స‌మాచారం తెలియ‌దు. అందువ‌ల్ల ఈ విష‌యంలో ముందుగానే జాగ్ర‌త్త‌గా ఉంటే సిమ్ స్వాపింగ్‌కు ఆదిలోనే అడ్డుక‌ట్ట వేయ‌వ‌చ్చు. సైబ‌ర్ నేరగాళ్లు ఫిషింగ్ కాల్స్‌, న‌కిలీ లింక్‌లు, డేటా లీక్‌లు లేదా సోష‌ల్ మీడియా ద్వారా బాధితుల వివ‌రాల‌ను సేక‌రిస్తారు. తాము నిజ‌మైన యూజ‌ర్‌గా న‌టిస్తూ సంబంధిత మొబైల్ సేవా సంస్థ‌ల‌ను సంప్ర‌దించి సిమ్ పాడైంద‌ని, రీప్లేస్ చేయాల‌ని రిక్వెస్ట్ పెడ‌తారు. ఈ క్ర‌మంలో బాధితుడి నుంచి ఓటీపీని గ‌న‌క వారు సేక‌రిస్తే దాంతో అస‌లు సిమ్ ప‌నిచేయ‌దు. నేర‌గాళ్ల వ‌ద్ద ఉండే డూప్లికేట్ సిమ్ యాక్టివేట్ అవుతుంది. దీంతో వారి ప‌ని చాలా సుల‌భ‌త‌రం అవుతుంది. డూప్లికేట్ సిమ్ యాక్టివ్ అవ‌గానే ఆ నంబ‌ర్‌కు అనుసంధాన‌మై ఉండే బ్యాంకు ఖాతాల వివ‌రాల‌ను దుండగులు చాలా త్వ‌ర‌గా సేక‌రిస్తారు. ఆ త‌రువాత వెంట వెంట‌నే డ‌బ్బుల‌ను కాజేస్తారు.

విష‌యం తెలిసే స‌రికి న‌ష్టం..

ఈ ప్ర‌క్రియ‌లో బాధితుల సిమ్ డీయాక్టివేట్ అయి ఉండే విష‌యం వారికి తెలియ‌దు. దీంతో ఓటీపీలు రావ‌డం, బ్యాంకు లావాదేవీలు జ‌ర‌గ‌డం వంటి విష‌యాలు వారికి తెలియ‌వు. అయితే ఈ విష‌యాన్ని బాధితులు చాలా ఆల‌స్యంగా గుర్తిస్తారు. కానీ అప్ప‌టికే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రుగుతుంది. అందువ‌ల్ల సిమ్ స్వాపింగ్ తీవ్ర న‌ష్టం క‌లిగిస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు. అయితే ఓటీపీల‌ను ఎవ‌రికీ చెప్ప‌క‌పోవ‌డం, వ్య‌క్తిగ‌త వివ‌రాల‌ను గోప్యంగా ఉంచ‌డం వంటి చ‌ర్య‌ల వ‌ల్ల సిమ్ స్వాపింగ్ మోసాల‌ను చాలా వ‌ర‌కు అరిక‌ట్ట‌వ‌చ్చు. అలాగే ఫోన్‌లో ఉన్న‌ట్లుండి అక‌స్మాత్తుగా నెట్ వ‌ర్క్ సిగ్న‌ల్ క‌నిపించ‌కుండా పోయినా అనుమానించాలి. ఓటీపీలు లేదా బ్యాంకు అల‌ర్ట్‌లు రాక‌పోయినా, బ్యాంకు స్టేట్‌మెంట్ల‌లో అన‌ధికార లావాదేవీల‌ను గుర్తించినా, బ్యాంకు నుంచి వ‌చ్చే ఈ-మెయిల్స్‌లో అన‌ధికార లావాదేవీలు ఉన్న‌ట్లు గ‌మ‌నించినా వెంట‌నే అల‌ర్ట్ అవ్వాలి. టెలికాం కంపెనీని సంప్ర‌దించి సిమ్ ను బ్లాక్ చేయించాలి. బ్యాంకుల‌ను కాంటాక్ట్ అయి అకౌంట్లు, క్రెడిట్ కార్డుల‌ను తాత్కాలికంగా బ్లాక్ చేయించాలి.

ఈ సూచ‌న‌లు పాటించాలి..

ఫోన్‌లో ఉన్న‌ట్లుండి సిగ్న‌ల్ పోతే వెంట‌నే టెలికాం ఆప‌రేట‌ర్‌కు స‌మాచారం అందించాలి. ఓటీపీలు, పిన్ నంబ‌ర్లు, ఆధార్‌, బ్యాంకు వివ‌రాల‌ను ఎవ‌రికీ షేర్ చేయ‌వ‌ద్దు. బ్యాంకులు లేదా టెలికాం కంపెనీల పేరిట ఓటీపీల‌ను అడుగుతూ వ‌చ్చే కాల్స్‌ను న‌మ్మ‌వ‌ద్దు. ఆర్థిక లావాదేవీల‌కు గాను ఎస్ఎంఎస్ లేదా ఈ-మెయిల్ అల‌ర్ట్స్ యాక్టివ్‌లో లేక‌పోతే వెంట‌నే యాక్టివేట్ చేయండి. ఫోన్ బ్యాంకింగ్‌, ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ లాగిన్‌ల‌కు స్ట్రాంగ్ పాస్‌వ‌ర్డ్‌, పిన్ సెట్ చేసుకోండి. అవ‌స‌రం అయితే 2-స్టెప్ ఆథెంటికేష‌న్‌ను ఆన్ చేయండి. అనుమానాస్ప‌ద లింకులు లేదా అప‌రిచిత వ్య‌క్తులు పంపించే లింకులు, మెసేజ్‌ల‌ను తెర‌వ‌కండి. మీకు తెలియ‌ని యాప్‌ల‌ను ఇన్‌స్టాల్ చేయ‌కండి. ఎల్ల‌ప్పుడూ గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్‌ల నుంచే యాప్‌ల‌ను డౌన్ లోడ్ చేసి వాడండి. ఇలాంటి సంద‌ర్భాల్లో సైబ‌ర్ మోసాల‌కు గురైతే సాక్ష్యాల కోసం స్క్రీన్ షాట్లు, ఎస్ఎంఎస్‌లు, కాల్స్‌, లావాదేవీల వివ‌రాల‌ను అన్నింటినీ భ‌ద్ర‌ప‌ర‌చండి. సైబ‌ర్ మోసాల‌కు గురైతే నేష‌న‌ల్ సైబ‌ర్ క్రైం హెల్ప్‌లైన్ నంబ‌ర్ 1930కి వెంట‌నే కాల్ చేయండి. లేదా cybercrime.gov.in అనే వెబ్‌సైట్‌లో వెంట‌నే ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయండి. మోసాలు జ‌రిగిన‌ప్పుడు ఎంత వేగంగా స్పందిస్తే డ‌బ్బు వెన‌క్కి వ‌చ్చే అవ‌కాశాలు అంత ఎక్కువ‌గా ఉంటాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement