త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

FASTag | ఫాస్టాగ్‌లో కీలక మార్పు.. ట్యాగ్ మార్చకుండానే బ్యాంక్‌ను మార్చుకోవచ్చు..

FASTag | ఫాస్టాగ్ వినియోగదారులకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) కీలక సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై ఫాస్టాగ్ జారీ చేసే సంస్థను మార్చుకోవాలనుకునే వినియోగదారులు వాహనానికి ఇప్పటికే అమర్చిన భౌతిక ఫాస్టాగ్‌ను తొలగించి కొత్తది కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు.

S

Business | Published On Sep 21, 2026, 1.18 pm IST

FASTag | ఫాస్టాగ్‌లో కీలక మార్పు.. ట్యాగ్ మార్చకుండానే బ్యాంక్‌ను మార్చుకోవచ్చు..
Advertisement

FASTag | ఫాస్టాగ్ వినియోగదారులకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) కీలక సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై ఫాస్టాగ్ జారీ చేసే సంస్థను మార్చుకోవాలనుకునే వినియోగదారులు వాహనానికి ఇప్పటికే అమర్చిన భౌతిక ఫాస్టాగ్‌ను తొలగించి కొత్తది కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. ఇందుకోసం ఎన్‌హెచ్‌ఏఐ వన్‌ట్యాగ్ పేరుతో ఫాస్టాగ్ పోర్టబిలిటీ సేవను ప్రారంభించింది. ఈ సేవను రాజ్‌మార్గ్‌యాత్ర మొబైల్ యాప్ ద్వారా వినియోగించుకోవచ్చు. వన్‌ట్యాగ్ సౌకర్యం ద్వారా అర్హత కలిగిన వినియోగదారులు తమ వాహనానికి అనుసంధానమైన ఫాస్టాగ్ ఐడీతోపాటు ఇప్పటికే వాహనంపై అమర్చిన అదే భౌతిక ఫాస్టాగ్ ను కొనసాగిస్తూ జారీ సంస్థను మార్చుకోవచ్చు. కొత్త ఫాస్టాగ్ ను కొనుగోలు చేయడం లేదా పాత ట్యాగ్‌ను తొలగించే అవసరం ఉండదు. ఈ సదుపాయం వినియోగదారులకు మరింత సౌలభ్యం, ఎంపిక స్వేచ్ఛ కల్పిస్తుందని ఎన్‌హెచ్‌ఏఐ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించింది.

రాజ్‌మార్గ్ యాత్ర యాప్ ద్వారా..

ఫాస్టాగ్ పోర్టబిలిటీ ప్రక్రియను రాజ్‌మార్గ్‌యాత్ర యాప్ ద్వారా పూర్తి చేయవచ్చు. ముందుగా వినియోగదారులు యాప్‌లో లాగిన్ చేసి తమ వాహన రిజిస్ట్రేషన్ నంబర్‌ను నమోదు చేయాలి. ఆ తర్వాత తమ ఫాస్టాగ్ ఈ సదుపాయానికి అర్హత కలిగి ఉందో లేదో తెలుసుకోవచ్చు. అర్హత ఉంటే ప్రస్తుత ఫాస్ట్‌ట్యాగ్ జారీ చేసే బ్యాంక్ నుంచి ఆరు అంకెల మొబైల్ వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. పోర్టబిలిటీ అభ్యర్థనను ధ్రువీకరించేందుకు ఈ కోడ్‌ను ఉపయోగించాలి. ధ్రువీకరణ పూర్తయిన తర్వాత వినియోగదారు కొత్త ఫాస్టాగ్ జారీ సంస్థను ఎంచుకోవాలి. అనంతరం అవసరమైన కస్టమర్ వెరిఫికేషన్, వాలెట్ ఆన్‌బోర్డింగ్ ప్రక్రియను పూర్తి చేయాలి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత వాహన రిజిస్ట్రేషన్ నంబర్‌కు అనుసంధానమైన ఫాస్టాగ్ ఐడీ మారదు. దీంతో వాహనంపై ఇప్పటికే అమర్చిన అదే ఫాస్టాగ్ ను కొనసాగించవచ్చు.

న‌గ‌దు బ్యాలెన్స్ సంగ‌తేంటి..

జారీ సంస్థను మార్చుకున్నంత మాత్రాన పాత ఫాస్టాగ్ వాలెట్‌లో ఉన్న నగదు బ్యాలెన్స్ పోదు. పోర్టబిలిటీ ప్రక్రియ పూర్తయిన తర్వాత పాత జారీ సంస్థ ప్రస్తుత ఫాస్టాగ్ వాలెట్‌ను మూసివేస్తుంది. అవసరమైన సర్దుబాట్లు చేసిన అనంతరం అందుబాటులో ఉన్న బ్యాలెన్స్‌ను వినియోగదారుడికి తిరిగి చెల్లిస్తుందని ఎన్‌హెచ్‌ఏఐ తెలిపింది. అదే సమయంలో కొత్త జారీ సంస్థతో కొత్త వాలెట్ ఆన్‌బోర్డింగ్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. వన్‌ట్యాగ్ సేవను ఉపయోగించే వినియోగదారులు ఆరు నెలల కూలింగ్ పీరియడ్‌ను గుర్తుంచుకోవాలి. ఒకసారి ఇంటర్‌ఆపరబుల్ ఫాస్టాగ్ ను మరో జారీ సంస్థకు పోర్ట్ చేసిన తర్వాత, తదుపరి ఆరు నెలల పాటు మరో సంస్థకు మళ్లీ పోర్ట్ చేసుకునే అవకాశం ఉండదు. కాబట్టి జారీ సంస్థను మార్చే ముందు వినియోగదారులు ఈ నిబంధనను పరిగణనలోకి తీసుకోవాలి.

త‌గ్గ‌నున్న ఖ‌ర్చులు..

ఫాస్టాగ్ జారీ సంస్థను మార్చే ప్రక్రియను సులభతరం చేయడంతోపాటు, పదేపదే భౌతిక ఫాస్టాగ్ లను తయారు చేయడం, మళ్లీ జారీ చేయడం, వినియోగదారులకు పంపించడం వంటి అవసరాలను తగ్గించడమే వన్‌ట్యాగ్ ప్రధాన ఉద్దేశమని ఎన్‌హెచ్‌ఏఐ తెలిపింది. ఒకే భౌతిక ఫాస్టాగ్ ను కొనసాగించే అవకాశం కల్పించడం వల్ల ట్యాగ్ తయారీ, తిరిగి జారీ, పంపిణీకి సంబంధించిన ఖర్చులు కూడా తగ్గుతాయని అధికారిక పీఐబీ సమాచారం పేర్కొంది. వన్‌ట్యాగ్‌తోపాటు జాతీయ రహదారుల వినియోగదారుల కోసం రాజ్‌మార్గ్‌యాత్ర యాప్‌లో ఇప్పటికే పలు సేవలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఫాస్టాగ్ వార్షిక పాస్, అత్యవసర హెల్ప్‌లైన్ 1033, ఫాస్టాగ్ లోకల్ పాస్ వంటి సేవలు ఉన్నాయి. ప్రయాణికులకు సహాయం అందించేందుకు మార్గ్‌మిత్ర హెల్ప్ సెంటర్ కూడా యాప్‌లో అందుబాటులో ఉందని ఎన్‌హెచ్‌ఏఐ వెల్లడించింది.

దేశవ్యాప్తంగా ఫాస్టాగ్ వినియోగదారుల సంఖ్య సుమారు 13 కోట్లుగా ఉందని, టోల్ లావాదేవీల్లో 98 శాతానికి పైగా ఫాస్ట్‌ట్యాగ్ ద్వారా జరుగుతున్నాయని ఎన్‌హెచ్‌ఏఐ తెలిపింది. దీంతో వన్‌ట్యాగ్ ద్వారా అర్హత కలిగిన వినియోగదారులు ఇకపై వాహనానికి అమర్చిన భౌతిక ఫాస్ట్‌ట్యాగ్‌ను మార్చకుండానే మరో జారీ సంస్థకు మారే అవకాశం పొందుతున్నారు.

Advertisement
Advertisement