త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

UPI | యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు.. ఇప్ప‌ట్లో లేన‌ట్లే..?

UPI | యూపీఐ లావాదేవీలపై ఎంపిక చేసిన వ్యాపార వర్గాలకు మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) విధించే ప్రతిపాదన అమలులో మరోసారి జాప్యం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారుల నుంచి తీవ్ర వ్యతిరేకత, రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇంకా అమలు తేదీని ఖరారు చేయలేదు. ఆర్బీఐ, ఎన్పీసీఐతో చర్చలు కొనసాగుతున్నప్పటికీ తుది నిర్ణయానికి రాలేదని సమాచారం.

S

Business | Published On Nov 19, 2026, 11.03 am IST

UPI | యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు.. ఇప్ప‌ట్లో లేన‌ట్లే..?
Advertisement

UPI | యూపీఐ లావాదేవీలపై ఎంపిక చేసిన వ్యాపార వర్గాలకు మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) విధించే ప్రతిపాదన అమలులో మరోసారి జాప్యం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారుల నుంచి తీవ్ర వ్యతిరేకత, రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇంకా అమలు తేదీని ఖరారు చేయలేదు. ఆర్బీఐ, ఎన్పీసీఐతో చర్చలు కొనసాగుతున్నప్పటికీ తుది నిర్ణయానికి రాలేదని సమాచారం.

మ‌రింత ఆల‌స్యం కానున్న యూపీఐ ఛార్జీల విధింపు..

దేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కీలక మార్పులకు దారితీసే యూపీఐ ఎండీఆర్ విధానం అమలు మరింత ఆలస్యం కానుంది. తొలుత అక్టోబర్ 15 నుంచి కొత్త ఛార్జీల విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. అయితే పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఈ నిర్ణయాన్ని దీపావళి తర్వాతకు వాయిదా వేసింది. కొత్త తేదీని విడిగా ప్రకటిస్తామని అప్పట్లో వెల్లడించింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), ఎన్పీసీఐ మధ్య జరిగిన చర్చల్లోనూ అమలు తేదీపై ఏకాభిప్రాయం కుదరలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. వ్యాపారుల నుంచి వస్తున్న వ్యతిరేకతతోపాటు ఉత్తరప్రదేశ్ సహా రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సరైన సమయం కోసం ప్రభుత్వం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్ ఎన్నికల తర్వాత కూడా ఈ విధానాన్ని వాయిదా వేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

రూ.2వేల‌కు మించిన లావాదేవీల‌పైనే..

కొత్త ఎండీఆర్ విధానం ప్రకారం రైల్వేలు, టెలికాం సేవలు, బీమా, ఇంధన రంగాలకు చెందిన ఎంపిక చేసిన వ్యాపార వర్గాల్లో రూ.2వేలకు మించిన యూపీఐ లావాదేవీలపై ఫ్లాట్‌గా రూ.5 ఛార్జీ విధించనున్నారు. అలాగే రూ.2వేల‌కు మించిన పెద్ద వ్యాపార చెల్లింపులపై 0.4 శాతం ఎండీఆర్ వసూలు చేయాలని ప్రతిపాదించారు. అయితే ఈ ఛార్జీ గరిష్ఠంగా రూ.300కే పరిమితం కానుంది. మొత్తం యూపీఐ లావాదేవీల్లో సుమారు 4 శాతం మాత్రమే ఈ కొత్త విధానం పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. 95 శాతానికి పైగా పర్సన్ టు మర్చంట్ (పీ2ఎం) లావాదేవీలకు ఈ ఛార్జీలు వర్తించవు. చిన్న వ్యాపారులు పర్సన్ టు పర్సన్ మర్చంట్ (పీ2పీఎం) విధానంలో ఎప్పటిలాగే జీరో ఎండీఆర్‌తో లావాదేవీలు కొనసాగించవచ్చు.

ఛార్జీల‌ను ఎలా వినియోగిస్తారు..?

ఈ మార్పులతో సాధారణ యూపీఐ వినియోగదారులపై అదనపు భారం పడదని స్పష్టం చేస్తున్నారు. ఉచిత యూపీఐ లావాదేవీలకు ఎలాంటి నెలవారీ పరిమితి లేదా కోటా విధించడం లేదు. ఇప్పటికే ఉచితంగా కొనసాగుతున్న లావాదేవీలకు ఎండీఆర్ ఛార్జీలు వర్తించవు. వ్యాపారులు ఈ ఛార్జీలను వినియోగదారుల నుంచి వసూలు చేయకుండా బ్యాంకులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే మొత్తం ఎండీఆర్ వసూళ్లలో 5 శాతాన్ని చిన్న వ్యాపారుల వద్ద యూపీఐ చెల్లింపుల స్వీకరణ వ్యవస్థను ప్రోత్సహించేందుకు ప్రత్యేక నిధికి కేటాయించనున్నారు. మిగిలిన ఆదాయాన్ని యూపీఐ వ్యవస్థలోని వివిధ భాగస్వాములకు పంచడంతోపాటు డిజిటల్ చెల్లింపుల విస్తరణ, సైబర్ భద్రత, సాంకేతిక ఆవిష్కరణలకు వినియోగించనున్నారు. కార్డులు, డిజిటల్ వాలెట్లతో పోలిస్తే కొత్త ఎండీఆర్ రేట్లు తక్కువగానే ఉండనున్నాయి.

Advertisement
Advertisement